మాతృత్వం గురించి ఏ పుస్తకం చదవలేదు!

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

‘తల్లిగా ఉండడం గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అంటున్నారు బాలీవుడ్‌ నటి నేహా ధూపియా. ఏప్రిల్‌ 11న నేషనల్‌ సేఫ్‌ మదర్‌హుడ్‌ డే సందర్భంగా నేహా ‘ఫ్రీడమ్‌ టు ఫీడ్‌’ గురించి, పాలు ఇవ్వడం, మాతృత్వాన్ని ఆస్వాదించడం వరకు కొన్ని విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో...

మాతృత్వం గురించి ఏ పుస్తకం చదవలేదు!

‘తల్లిగా ఉండడం గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అంటున్నారు బాలీవుడ్‌ నటి నేహా ధూపియా. ఏప్రిల్‌ 11న నేషనల్‌ సేఫ్‌ మదర్‌హుడ్‌ డే సందర్భంగా నేహా ‘ఫ్రీడమ్‌ టు ఫీడ్‌’ గురించి, పాలు ఇవ్వడం, మాతృత్వాన్ని ఆస్వాదించడం వరకు కొన్ని విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పంచుకున్నారు. తన అమ్మతనం అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారామె. 


‘‘తల్లిదండ్రులు పిల్లలను పెంచే పనిని నేర్చుకుంటూ వెళ్లాలి. అంతేతప్ప ప్రత్యేకంగా వివరించే పుస్తకం అంటూ ఏదీ లేదు. నాకు కూతురు పుట్టిన తరువాత తనను ఎలా పెంచాలి? ఎలా చూసుకోవాలి? అనే విషయాల గురించి ఇంటర్నెట్‌లో వెతకలేదు. అలా చేయనందుకు నాకు బాధగా అనిపించేది. అయితే నేను కావాలనే అలా చేయలేదు. ఎందుకంటే మన అమ్మలు, కుటుంబ సభ్యులు చెప్పే విషయాలే కాకుండా నేను ఒక పిల్లల వైద్యురాలితో టచ్‌లో ఉంటూ వారిని నమ్ముతున్నప్పుడు వారు చెప్పేది విశ్వసించాలని భావించాను’’ అంటారు నేహా. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో నేహా ధూపియా పిల్లల వైద్యురాలు సోనాల్‌ సస్తేతో పిల్లలకు ఎంత తినిపించాలి? ఏడుస్తున్న పిల్లలను ఎలా  ఊరడించాలి? అనే విషయాలను చర్చించారు. 




పిల్లలకు ఇష్టమైన ఆకారంలో ఆహారం

‘‘అమ్మగా జీవితం ప్రతి మహిళకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. నేనైతే మాపాప మెహ్రా అన్నం పూర్తిగా తినేయగానే పెద్ద విజయం సాధించానని భావిస్తా. అంతేకాదు నాకు నేను బహుమతి ఇచ్చుకుంటా. ప్రతి తల్లికి పిల్లలకు తినిపించడం సవాల్‌గానే ఉంటుందని ఊహించగలను. నా కూతురును పుస్తకం చూడడం లేదా తనకు నచ్చిన పని ఆడుకునేలా చూస్తాను. ఆ తరువాతే తనుకు ఆహారం ఇస్తాను. అంతేకాదు ఆకుకూరలు కూడా తినిపించేందుకు కొత్తగా ప్రయత్నిస్తాను. పిల్లలకు దోశ తినిపించాలి అనుకున్నప్పుడు రంగు రంగులుగా ఉండేలా చేయాలని మా అమ్మ చెప్పింది. అందుకే దోశ కలర్‌ఫుల్‌గా ఉండాలని కొద్దిగా బీట్‌రూట్‌, పాలకూర వేస్తాను. తరువాత వాటిని నక్షత్రం, టెడ్డీబేర్‌ ఆకారాల్లో కట్‌ చేస్తాను’’ అని పిల్లలకు ఇష్టమైన విధంగా తినిపించడం ఎలాగో వివరిస్తారు నేహా ధూపియా.

Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST