చర్చలు సఫలం.. తూచ్‌ ఒప్పుకోం

ABN , First Publish Date - 2022-06-19T08:15:36+05:30 IST

‘‘బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో చర్చలు సఫలమయ్యాయి. ఆందోళన విరమణకు వారు అంగీకరించారు.

చర్చలు సఫలం.. తూచ్‌ ఒప్పుకోం

  • బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం
  • సోమవారం నుంచి మళ్లీ తరగతులు: మంత్రి ఇంద్రకరణ్‌
  • లేదు.. సీఎం ప్రకటించేవరకు మేం నిరసన కొనసాగిస్తాం
  • మంత్రి క్యాంపస్‌ బయటకు రాగానే విద్యార్థుల ప్రకటన..!
  • సీఎం ప్రకటించేవరకు నిరసన: విద్యార్థులు


బాసర, జూన్‌ 18: ‘‘బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో చర్చలు సఫలమయ్యాయి. ఆందోళన విరమణకు వారు అంగీకరించారు. సోమవారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరవుతారు..’’ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రకటన ఇది. ‘‘లేదు.. అంతా తూచ్‌. ముఖ్యమంత్రి ప్రకటించే వరకు ఆందోళన కొనసాగుతుంది’’ విద్యార్థుల ట్వీట్‌ ఇది. వెరసి.. నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రతిష్ఠంభనకు ఐదో రోజూ తెరపడలేదు. విద్యార్థులతో మంత్రి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ పారూఖీ, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి శనివారం సాయంత్రం చర్చలు జరిపారు. దీనికిముందు ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ పలుసార్లు వారితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. 


చివరకు మంత్రి ఇంద్రకరణ్‌ 2 గంటల పాటు విద్యార్థులతో అంశాల వారీగా చర్చించారు. సీఎం కేసీఆర్‌ యూనివర్సిటీ సందర్శనను తప్పించి, మిగతావాటిపై చర్చలు సాగాయి. అనంతరం మంత్రి, వెంకటరమణ, ట్రిపుల్‌ ఐటీ కొత్త డైరెక్టర్‌ సతీ్‌షకుమార్‌లు విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామని వివరించారు. మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి ట్విటర్‌లో హామీ ఇవ్వాలన్న డిమాండ్‌నూ ఒప్పుకొన్నట్లు చెప్పారు. త్వరలో పుస్తకాలు, ల్యాప్‌ టాప్‌లు అందించి వర్సిటీలో మౌలిక వసతులు మెరుగుపరుచనున్నట్లు చెప్పారు. కానీ, విద్యార్థులు మాత్రం చర్చలు విఫలమయ్యాయని ప్రకటించారు. చర్చలు ముగించి మంత్రి క్యాంపస్‌ నుంచి బయటకు రాగానే.. తాము ఆందోళనను కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు 5వ రోజూ విద్యార్థుల అందోళన కొనసాగింది.  


ఏవో తొలగింపు.. నూతన డైరెక్టర్‌కు బాధ్యతలు 

ట్రిపుల్‌ ఐటీ పరిపాలన అధికారి (ఏవో) వై.రాజేశ్వర్‌రావును తొలగిస్తూ శనివారం రాత్రి ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బాధ్యతలను ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీ్‌షకుమార్‌కు అప్పగించారు.

Updated Date - 2022-06-19T08:15:36+05:30 IST