Abn logo
Jul 27 2021 @ 01:06AM

సంఘర్షణల పరిష్కారానికి సంధి మార్గం

కోర్టు కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వమే మేలయిందని, దాని ద్వారానే అనేక సమస్యలు పరిష్కారమవుతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ ఇటీవల ఒక అంతర్జాతీయ సదస్సులో పేర్కొన్నారు. మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని కూడ ఆయన విపులీకరించారు.


నిజమే, కోర్టు కేసుల వల్ల సమయం, సంపాదన, సంబంధాలు కోల్పోయినవారే– శత్రువుల్లా బతకడం కన్నా కోర్టు బయటే సమస్యలు పరిష్కరించుకోవడం మానవీయంగా ఉంటుంది. మనదేశం లోని న్యాయస్థానాలలో దాదాపు నాలుగు కోట్ల కేసులు వివిధ దశల్లో పెండింగులో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో 2021 ఏప్రిల్‌ 15 నాటికి 67,898 కేసులు, హైకోర్టుల్లో 57,53,000 కేసులు, జిల్లా కోర్టుల్లో 3,81,00,000 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని ఆ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటిలో కొన్నిటి పరిష్కారానికైనా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయిస్తే కోర్టుల మీద భారం తగ్గడమే కాకుండా, వివాదాల్లో ఉన్నవారు అనేకరకాలుగా లాభపడతారు. ఈ భావనతోనే కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు ప్రత్యామ్నాయ వివాద పరిష్కారమార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని 1993లోనే నిర్ణయానికి వచ్చాయి. ఆ ఏడాది డిసెంబరు 4న అప్పటి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులతో ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కోర్టు కేసులకు ప్రత్యామ్నాయం ఏమిటనే విషయమై ఆ సదస్సులో చర్చించారు. ఆ సమావేశంలో పాల్గొన్న అందరూ ముక్తకంఠంతో, దేశంలో ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ ఉండాలని సూచించారు. సమస్యలను సంప్రదింపులు, మధ్యవర్తిత్వం, రాజీపడటం, కన్సీలియేషన్‌, ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చునని, ప్రతి చిన్న విషయానికి కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశం అభిప్రాయపడింది. ప్రత్నామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం సులభమైన మార్గమని సూచించింది.


ప్రపంచంలో అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్‌, కెనడా, దక్షిణాఫ్రికా, సింగపూర్‌ లాంటి దేశాల్లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ పకడ్బందీగా ఏర్పాటయింది. ఆయా దేశాల్లో కోర్టుల మీద ఒత్తిడి తగ్గి చాలా కేసులు కోర్టుల బయటే పరిష్కృతమవుతున్నాయి. వైవాహిక సంబంధాలు, ఆస్తిపాస్తుల విషయాల్లో, వ్యాపార వాణిజ్య లావాదేవీలలో తలెత్తే అనేక వివాదాల వంటివెన్నో కోర్టు బయటే పరిష్కృతమవుతున్నాయి.


మనదేశంలో 1990 తరువాత వచ్చిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వాణిజ్య, వ్యాపార, ఆస్తి, కాంట్రాక్టులు మొదలైన వివాదాల్లో కోర్టు బయట సత్వర పరిష్కార పద్ధతుల్లోనే వివాదాలు సమసినపుడు పెట్టుబడులు పెరిగి దేశాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావించింది. అందువల్లే మనదేశంలో వాణిజ్య కోర్టుల చట్టం అమల్లోకి వచ్చింది. దాని తర్వాత 1996లో ఆర్బిట్రేషన్‌, కన్సీలియేషన్‌ చట్టం అమల్లోకి వచ్చింది. తరతరాలుగా వస్తున్న మధ్యవర్తిత్వ పద్ధతులను సంస్థాగతం చేయడం ద్వారా సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా కోర్టుల మీద ఒత్తిడి తగ్గించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతకుముందే 1987 నుంచి అమల్లో ఉన్న జాతీయ న్యాయసేవా అథారిటీ చట్టం ఉచిత న్యాయసేవలే అందించింది కానీ, మధ్యవర్తిత్వం లాంటి సేవలు అందించలేదు. ఫలితంగా కోర్టు ఫీజులు కట్టలేని వారికి ఉచిత న్యాయసేవలు, వకీళ్ల సలహాలు అందాయే కానీ, కోర్టుల తిప్పలు తప్పలేదు.


మధ్యవర్తిత్వమే సత్వర న్యాయం చేకూరుస్తుందని అటు న్యాయస్థానాలు, ఇటు ప్రభుత్వాలు భావించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ దీనినే ఉటంకిస్తూ, మధ్యవర్తిత్వం సరిగా అర్థంకాకనే కృష్ణ రాయబారం విఫలమై, మహాభారత యుద్ధం అనివార్యమైందని, సుశిక్షితులైన మధ్యవర్తుల ద్వారా చాలా సమస్యలు సమసిపోయి కుటుంబాలు బాగుపడతాయని అన్నారు.


కోర్టుల్లో వివాదాల పరిష్కారానికి వచ్చే వాళ్లు కూడా మధ్యవర్తిత్వం ద్వారా కేసు పరిష్కృతమయితే బాగుండునని అనేక సందర్భాల్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగా జాతీయ న్యాయసేవా అథారిటీ దేశంలోని అన్ని కోర్టుల్లో జిల్లా న్యాయసేవా అథారిటీలను ప్రారంభించి, పేరుకుపోతున్న అనేక కేసులను లోక్‌ అదాలత్‌ల ద్వారా, మధ్యవర్తుల ద్వారా పరిష్కరించడానికి మార్గం సుగమం చేసింది. జిల్లా న్యాయసేవా అథారిటీలు అనేక కేసుల్లో వకీళ్ల ద్వారా బీదలకు సహాయం చేస్తున్నప్పటికీ మధ్యవర్తిత్వం అనుకున్నంతగా ముందుకు సాగలేదు. అందుకు కారణం ప్రజల్లో, కోర్టుల్లో, వకీళ్లలో మధ్యవర్తిత్వం పట్ల ఉండాల్సినంత అవగాహన ఉండకపోవడమే. అంతేకాకుండా మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఢిల్లీలో ప్రారంభించినప్పుడు వకీళ్లంతా తమ కేసులు పోతాయని భయపడి గొడవ చేశారు. తరువాత సుప్రీంకోర్టు జోక్యంతో పరిస్థితులు మారాయి.


సుప్రీంకోర్టు 2005లో ఒక ‘మీడియేషన్‌, కన్సీలియేషన్‌’ ప్రాజెక్టు కమిటీని స్థాపించి దేశంలో మధ్యవర్తిత్వ దశదిశలను కూలంకషంగా చర్చించింది. తద్వారా మధ్యవర్తిత్వాన్ని వ్యవస్థీకరించాలని, ప్రతి మధ్యవర్తికీ సరైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అంతే కాకుండా మధ్యవర్తికి కావాల్సిన అర్హతలను పాఠ్యాంశాలనూ కూడా ఆ కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత దేశమంతటా జడ్జీలు, వకీళ్లు, ఇతరులు మధ్యవర్తిత్వంలో శిక్షణ పొందారు. కోర్టుల్లో వివాదాలకు వచ్చినవాళ్లు కూడా మధ్యవర్తిత్వం పట్ల మొగ్గు చూపించారు. ఫలితంగా ఇప్పుడు కోర్టుల్లోనే కాకుండా కోర్టు బయట కూడా, అసలు కోర్టుకే వెళ్లకుండా కేసులు పరిష్కరించుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. తత్ఫలితంగా 2019లో దేశవ్యాప్తంగా 94,869 కేసులు పరిష్కృతమయ్యాయి.


దేశ విదేశాల్లో అందరికీ తెలిసిన, ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన బాబ్రీ మసీదు– రామజన్మభూమి కేసు కూడా సుప్రీంకోర్టు నియమించిన వరిష్ట మధ్యవర్తి శ్రీరాం పంచూ చొరవ వల్ల చాలావరకు పరిష్కృతమైంది. మధ్యవర్తుల చొరవకు పటిమను, అవసరాన్ని గ్రహించిన ప్రభుత్వం దేశంలో మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం వద్ద పనిచేస్తున్న ‘అమిక’ మధ్యవర్తిత్వ కేంద్రం, సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన అంతర్జాతీయ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం, హైకోర్టు, జిల్లా కోర్టుల్లోని మధ్యవర్తిత్వ కేంద్రాలు చురుగ్గా పనిచేయడమే కాకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాయి. మనదేశం విదేశీ పెట్టుబడులను అధికంగా ఆశిస్తున్నందున పెట్టుబడిదారులతో తలెత్తే చిన్న చిన్న సమస్యలను ప్రత్నామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవడానికి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ ఇటీవల తన హైదరాబాద్‌ పర్యటనలో సూచించారు. కోర్టు బయట మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే కూడా అభిప్రాయపడ్డారు. ఇవి ఒక ఎత్తయితే, అన్ని వాణిజ్య వ్యాజ్యాల్లో కోర్టులకెక్కడానికి ముందే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలంటూ వాణిజ్య కోర్టుల చట్టాన్ని గత సంవత్సరం సవరించడం మరో ఎత్తు.


నిత్యం వివాదాల్లో తలమునకలైన వారు కోర్టుల చుట్టూ, వకీళ్ల చుట్టూ తిరిగి కాలాన్ని, ధనాన్ని వ్యయం చేసుకోకుండా దగ్గరలోని మధ్యవర్తిత్వ కేంద్రానికి వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్నెట్‌ ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తులకు కష్టాలను తగ్గించడానికి ఆన్‌లైన్‌ డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌ (ఓడిఎల్‌) వ్యవస్థను నీతీఆయోగ్‌ ఈ మధ్యే సమర్థించింది. అందుకు సంబంధించిన సూచనలను పొందుపరుస్తూ ఒక హ్యాండ్‌బుక్‌ను కూడా విడుదల చేసింది. ప్రభుత్వం, చట్టాలు, కోర్టులు చేస్తున్న సూచనలు పాటించి తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకుంటూ మధ్యవర్తిత్వం ద్వారా తమ వివాదాలను పరిష్కరించుకోవడం అందరికీ శ్రేయస్కరం. 

డా. పి. మాధవరావు

ఐక్యరాజ్యసమితి మాజీ సీనియర్‌ సలహాదారు