విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2022-01-21T05:21:54+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు. చీపురుపల్లి ఐసీడీఎస్‌ కార్యాలయం పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
పీవోను ప్రశ్నిస్తున్న జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసరావు

  చీపురుపల్లి ఐసీడీఎస్‌ పీవోపై  జడ్పీ చైర్మన్‌ ఆగ్రహం

చీపురుపల్లి, జనవరి 20: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు. చీపురుపల్లి ఐసీడీఎస్‌ కార్యాలయం పనితీరుపై  అసహనం వ్యక్తం చేశారు. పీడీ రాజేశ్వరి సమక్షంలోనే ఆయన పీవో శారదపై ఆగ్రహం వ్యక్తం చేశారు.    అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు నియామకపత్రాలు అందజేసే కార్య క్రమాన్ని గురువారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాల యంలో నిర్వహించారు. దీనికి హాజరైన  జడ్పీ చైర్మన్‌  ప్రాజెక్టు పూర్తి వివరాలు చెప్పాలని పీవో శారదను కోరారు. అంగన్‌వాడీ క్షేత్ర స్థాయి సిబ్బంది, లబ్ధిదారుల వివరాలు, స్టాకు సమాచారం ఇవ్వాలన్నారు.  పీవో ఎంతసేపటికీ వివరాలను ఇవ్వలేకపోవడంతో చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్పర్ల పోస్టుల భర్తీ కోసం  ఉన్నతాధికారులు జారీ చేసిన నోటిఫికేషన్‌ను యథాతథంగా అమలు చేయాల్సింది పోయి కొన్ని పోస్టులకు సంబంధించిన ప్రకటనను  ఎందుకు తప్పించారని పీవోను ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలతో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల వివరాలు లేకపోతే ఎలా అని మండిపడ్డారు. ప్రాజెక్ట్‌ అధికారి పనితీరు సంతృప్తికరంగా లేదని, దీనిపై నివేదిక తయారు చేసి  కలెక్టర్‌కు సమర్పించాలని కోరారు. అనంతరం నియామకాలు పొందిన వారికి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ  శిరీష, గుర్ల జడ్పీటీసీ సీర అప్పల నాయుడు,  సూర్యనారాయణరాజు, అనంతం, శ్రీనివాసనాయుడు, విశ్వేశ్వరరావు, పి.సన్యాసినాయుడు, వెంకటరమణ తదితరులున్నారు. 

 

Updated Date - 2022-01-21T05:21:54+05:30 IST