1/70 చట్టానికి తూట్లు

ABN , First Publish Date - 2020-07-11T09:34:19+05:30 IST

అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి తెచ్చిన 1/70 చట్టానికి కొందరు అక్రమార్కులు తూట్లు

1/70 చట్టానికి తూట్లు

గిరిజనుల భూములు గిరిజనేతరుల పరం

ఆసిఫాబాద్‌ చుట్టూ కబ్జాకోరుల దందా

అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోని అధికారులు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి తెచ్చిన 1/70 చట్టానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, అంతరించి పోతున్న తెగలను కాపాడలనే లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆదివాసీలకు రక్షణ కల్పించడం మాట అటుంచి గిరిజనేతరులకు మాత్రం కాసుల పంట పండిస్తోంది. ఇదంతా అధికార యంత్రాంగం ఎదుటే జరుగుతున్నా ఏనాడు అడ్డుకున్న పాపనపోలేదని గిరిజనులు వాపోతున్నారు. అంతేకాదు కొంతమంది గిరిజన నాయకుల అవతారం ఎత్తి అక్రమార్కులతో లాలుచి వ్యవహరం నడుపుతుండడంతో జిల్లాలోని మెజార్జీ భూ కమతాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా బలమున్నోడిదే రాజ్యం అన్నట్లుగా అమాయక ఆదివాసీలను రుణాల పేరుతో ట్రాప్‌ చేసి కోట్లాది రుపాయల విలువైన భూములను సొంతం చేసుకుటున్నారు. అనంతరం దర్జాగా క్రయవిక్రయాలు జరుపుతూ రెండు చేతులా ఆర్జిస్తున్న పరిస్థితి జిల్లాలో షరా మాములుగా తయారైంది. 


అవినీతి అదికారులదే కీలక పాత్ర..

చట్టాలను రక్షించాల్సిన అధికార యంత్రాగమే భూ భకాసూరుల కొమ్ము కాస్తూ మామూళ్ల మత్తుతో తూలడమే కాకుండా ఏకంగా నిజాం కాలం నాటి నక్షాలనే సమూలంగా మార్చి వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టిన అనంతరం జిల్లాల పరిమాణం తగ్గడంతో పాటు భూములకు ఒక్క సారిగా రెక్కలు వచ్చాయి. దీంతో ఏజెన్సీ భూములతో పాటు ప్రభుత్వ భూములపైన కబ్జా కోర్‌ల కన్ను పడింది. ఈ మేరకు కొన్ని చోట్ల ఏకంగా సర్వే నంబర్లనే తారు మారు చేస్తూ వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు బలపడుతున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు కేంద్ర స్థానంగా ఉన్న ఆసిఫాబాద్‌ పట్టణం చుట్టూనే సుమారు 700 ఎకరాలకు పైగా గిరిజనుల భూములు గిరిజనేతరుల పరమైనట్లు గిరిజన సంఘాల విచారణలో తేలిసింది. గతంలో పని చేసిన కలెక్టర్‌ చంపాలాల్‌ ఆదేశాల మేరకు అధికారులు ప్రభుత్వ, అటవీ భూములతో పాటు గిరిజన చట్టం పరిధిలోకి వచ్చే ఖాళీ స్థలాలపై సర్వే నిర్వహించగా నమ్మలేని నిజాలు నిగ్గుతేలాయి.


ఆసిఫాబాద్‌ పట్టణంలోని రాజంపేట, జన్కాపూర్‌ సమీపంలోని అంకుశాపూర్‌, సాలేగూడ, గోవిందాపూర్‌, మేకల వాడ, కేస్లాపూర్‌, పిప్పల్‌గాం, ఎల్లారం, ఆసిఫాబాద్‌, గొడవెల్లి గ్రామాల్లో సుమారు 1,257 ఎకరాల ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఇందులో 507.54 ఎకరాల గిరిజనుల భూములు నిబంధనలకు విరుద్దంగా గిరిజనేతరుల ఆక్రమణలో ఉన్నట్లు నిగ్గు తేలింది. అలాగే 166.23 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు సర్వేలో తేల్చారు.  నికరంగా దీని విలువ ప్రస్తుత ప్రభుత్వ ధర ప్రకారమే రూ.4,98,69,000గా నిర్ధారించారు. జిల్లా ఏర్పాటు తరువాత ఆసిఫాబాద్‌ పరిధిలో భూములకు మార్కెట్‌లో ఎక్కడ లేని రీతిలో భారీ డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం దాదాపు 100 కోట్లపైనే ఉంటుందని అంచనా. 


గిరిజనులకే సంపూర్ణ హక్కులు..

ఏజెన్సీ ఏరియాగా గుర్తించిన ప్రాంతంలో  1/70 చట్టం ప్రకారం  గిరిజనులకు మాత్రమే భూములపై సంపూర్ణ హక్కులు ఉంటాయి. ఆ భూములు గిరిజనేతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించడం కానీ, హక్కులు కల్పించడం కానీ చేయకూడదు. ఒక వేళ గిరిజనులు వ్యక్తిగత అవసరా నిమిత్తం భూములు విక్రయించాల్సి వచ్చినా గిరిజనులకు మాత్రమే అమ్మ జూపాలి. లేదా ప్రభుత్వానికి విక్రయించాలి. తిరిగి ప్రభుత్వం సదరు భూములను గిరిజనులకు తప్పా ఇతర వర్గాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కులు కల్పించకూడదు. ప్రజాప్రయోజనాల రీత్యా భూమి అవసరమైతే సంబంధిత గ్రామ పంచాయతీలలో గ్రామసభ ద్వారా తీర్మానం చేసి మాత్రమే అక్కడ గిరిజనేతరులకు లేదా ప్రభుత్వానికి భూమిని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ గిరిజనేతరులు ఆయా స్థలాలను ఆక్రమించినా, కొనుగోలు చేసినా అధికారికంగా వారికి ఎలాంటి హక్కులు ఉండవు.


అదే సమయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలకు 1/70 చట్టం అమలును బాధ్యతలను అప్పగించారు. దీన్ని సదరు సంస్థలు పట్టించుకోక పోవడంతో అక్రమార్కులు క్రయవిక్రయాలు జరుపుతూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేపట్టి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.


1/70 చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి..కోట్నాక విజయ్‌, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు

గిరిజనుల ప్రయోజనాలను పరిరక్షించే 1/70 చట్టాన్ని అధికారులు కచ్చితంగా అమలు చే యాలి.  అధికారులు ఉదాసీనతగా  వ్యవహరించడంతో గిరిజనేతరులు తమ భూముల్లో తిష్ఠ వేసి యథేచ్ఛగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటై కలెక్టర్‌ ఉన్నచోట కూడా ఇలాంటి అక్రమాలు జరుగడం దారుణం. ముఖ్యంగా ఆసిఫాబాద్‌ పట్టణంలో గిరిజన చట్టానికి యథేచ్ఛగా తూట్లు పోడుస్తున్నారు. ఐటీడీఏ కూడా ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. చెక్‌పోస్టు మొదలుకొని కుమరం భీం చౌక్‌ వరకు అడ్డగోలుగా జరుగుతున్న అక్రమా లు అధికారుల కళ్లకు కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు వీటికి అడ్డుకట్ట వేయాలి.


ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి..మడావి శ్రీనివాస్‌, ఆదివాసీ సంఘం నేత

ఏజెన్సీలో అక్రమంగా గిరిజనేతరులు నిర్మించిన భవనాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతాం. పట్టణంలో గిరిజనుల భూములను ఆక్రమిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. గోండుల రాజు అయిన అంకమ రాజు ఇంటికి చెందిన ఐదు ఎకరాల భూమి మొత్తం కూడా కబ్జాకు గురైంది. అధికారులు సమగ్ర సర్వే చేపట్టి వారి కుటుంబానికి న్యాయం చేయాలి. 

Updated Date - 2020-07-11T09:34:19+05:30 IST