చిన్ననీటి వనరులపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-05-25T09:53:04+05:30 IST

కొందుర్గు మండలం రావిర్యాల శివారులోని వీరసముద్రంలో పుట్టి ఫరూఖ్‌నగర్‌ మండలం భీమారం, కాంసాన్‌పల్లి, చించోడు మీదుగా ఏడాది పొడవునా ..

చిన్ననీటి వనరులపై నిర్లక్ష్యం

శిథిలావస్థలో ఆనకట్టలు

దశాబ్దాలుగా పూడికతీత చేపట్టని వైనం

వృథాగా పోతున్న వర్షపు నీరు 

సాగుకు నోచని భూములు

మరమ్మతులు చేపట్టాలని రైతుల వేడుకోలు


సాగునీటి వనరులు లేని షాద్‌నగర్‌ ప్రాంత రైతులు కేవలం వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఇక్కడ ఉన్న కొద్దిపాటి చిన్ననీటి వనరులపై పాలకులు దశాబ్దాలపాటు చిన్నచూపు చూడటం వల్ల వందల ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటిని ఉరకలెత్తిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వర్షపు నీరు వృథా పోకుండా ఈ ప్రాంత వనరులను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. 


షాద్‌నగర్‌రూరల్‌: కొందుర్గు మండలం రావిర్యాల శివారులోని వీరసముద్రంలో పుట్టి ఫరూఖ్‌నగర్‌ మండలం భీమారం, కాంసాన్‌పల్లి, చించోడు మీదుగా ఏడాది పొడవునా జీవనదిలా ప్రవహించే వాగుపై భీమారం శివారులో నాటి నవాబులు ఆనకట్టను నిర్మించారు. అధునాతనంగా నిర్మించిన ఆనకట్ట నుంచి రెండు పంటలకు సాగునీరు అందేది. బాలనగర్‌ మండలం సూరారం, ఫరూఖ్‌నగర్‌ మండలంలోని కాంసాన్‌పల్లి, భీమారం శివారులో 200 ఎకరాలకు నీరు అందేది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల నీటినిల్వ ప్రాంతం పూడికతో నిండిపోయింది, చెట్లుపెరిగి అడవిని తలపించేలా మారింది. పేరుకుపోయిన పూడికను తొలగించి నీటినిల్వ సామర్థ్యం పెంచాలని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పూడిక నిండిపోవడం వల్ల ప్రతీ ఏడాది కురుస్తున్న వర్షపు నీరు వృథాగా పోతుంది. రెండు పంటలతో కళకళలాడాల్సిన భూములు వర్షాధార పంటలకే పరిమితమయ్యాయి. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏళ్ల క్రితం నిర్మించిన ఆనకట్టలో కనీసం పూడిక తీయలేని దుస్థితిలో నేటి పాలకులు ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందల ఏళ్లు గడుస్తున్నా నేటికీ అలుగు, కట్ట పటిష్టత ఏమాత్రం తగ్గలేదు.


రూ.కోటితో నిర్మాణం.. చెరువులోకి చేరని నీరు

అదే వాగుపై అయ్యవారిపల్లి శివారులో 30 ఏళ్ల కిం ద సుమారు రూ.కోటితో చెక్‌డ్యామ్‌ నిర్మించారు, అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చిన్ననీటి వనరుల మంత్రిగా పనిచేసిన శంకర్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని చెక్‌డ్యాం కట్టించారు. చెక్‌డ్యాంలోకి చేరిన వాననీటిని కుడి కాలువ ద్వారా గ్రామ శివారులోని నల్లచెరువులో తరలించడం ద్వారా 100 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని ఆశించారు. కానీ ఇంత వరకు చెరులోకి చుక్కనీరు చేరలేదు. నీటిని తీసుకువచ్చే కాలువ మధ్యలో పిల్ల కాలువపై నిర్మించిన పిల్లర్లు కొంచెం ఎత్తుగా ఉండటం వల్ల నీరు ముందుకు పోవడం లేదు. మిషన్‌భగీరథలో మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.


ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడా ది కూడా వర్షపునీరు వృథాగా పోయే అశకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెక్‌డ్యాం కుడి కాలువ ద్వారా చించోడు శివారులోని బొమ్ముచెరువులోకి నీటిని తరలించాలనుకున్న పనులు అడుగు కూడా ముందుకు పడలేదు. రైతులు మాత్రం ఏనాటికైనా చెరు వు ద్వారా తమ భూములకు నీరు చేరుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులే కాకుండా తమ ప్రాంతంలోని చిన్ననీటి వనరుల ను కూడా అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు.


చెరువులు, కుంటలదీ ఇదే పరిస్థితి

షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని చెరువు కుంటల పరిస్థితి అదే విధంగా ఉంది. మిషన్‌ కాకతీయ ద్వారా మరమ్మతులు చేసినా పాటు కాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఒక్క ఫరూఖ్‌నగర్‌ మండలంలోనే ఏడు ఆయకట్టు చెరువులతో పాటు 120 వరకు కుంటలు ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా దయనీయంగా మారాయి. పాటు కాలువలు కనిపించడం లేదు. కొన్ని చోట్ల ఆక్రమణకు గురయ్యాయి. ఎలికట్ట శివారులో ఉన్న లాడెం చెరువులోకి నీరును చేర్చే పాటు కాలువ మధ్యలో వెలిసిన పరిశ్రమలు కాలువను ఆక్రమించాయి. దీంతో చెరువులోకి నీరు చేరడం లేదని రైతులు వాపోతున్నారు. మిషన్‌ కాకతీయలో పాటు కాలువలను ఆశించిన స్థాయిలో పునరుద్ధరించకపోవడంతో చెరువుల్లోకి నీరు చేరడం లేదు. అడపాదడపా కురుస్తున్న వర్షపు నీరుకూడా వృథాగా పోతుంది. ఆక్రమణకు గరైన పాటు కాలువలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. 


వరదనీటిని మళ్లించాలి..రఘురాం, రైతు,చించోడు

వృథాగా పోతున్న వరద నీటిని చెరువుల్లోకి మళ్లించాలి. ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో భూములు సాగుకు నోచుకోవడం లేదు. కోటి రూపాయల పథకం 30 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. పథకాన్ని అమలు చేస్తే వందల ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయి.


రైతుల్లో అశలు చిగురిస్తాయి..బాలమణి, సర్పంచ్‌,చించోడ్‌

వరద నీటిని చెరువుల్లోకి మళ్లించడం వల్ల సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తాయి. వర్షాలు అంతంత మాత్రంగా కురవడం వల్ల ప్రతి ఏడాది ఆశించిన స్థాయిలో పంటలు పండటం లేదు. వృథాగా పోయే వరద నీటిని కాపాడుకుని చెరువుల్లోకి మళ్లించాలి.  

Updated Date - 2020-05-25T09:53:04+05:30 IST