నిమ్జ్‌పై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-03T06:18:18+05:30 IST

జిల్లాలో పశ్చిమప్రాంతంలోని కనిగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. తాగు, సాగు నీరు లేదు. కనీసం యువతకు ఉపాధి లేదు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నా ఇంత వరకూ ఇక్కడ ఏ ఒక్క పరిశ్రమా లేకపోవటంతో ప్రజలకు, నిరుద్యోగులకు వలసబాట తప్పనిసరైంది.

నిమ్జ్‌పై నిర్లక్ష్యం
పీసీపల్లి మండలంలోని లక్ష్మక్కపల్లి వద్ద నిమ్జ్‌ కోసం కేటాయించిన భూములు

వైసీపీ పాలనలో ముందుకు పడని అడుగు

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన 

తొలి ఏడాదిలోనే భూసేకరణ పూర్తి

అప్పట్లో చంద్రబాబు చొరవతో రైతుల అంగీకారం

ప్రస్తుతం పట్టించుకోని ప్రభుత్వం, ప్రజాప్రతినిధి

వేలాదిమంది నిరుద్యోగుల ఎదురుచూపులు

నిరాశపడుతున్న వలస కార్మికులు  

‘సీఎంను కలిశా.. ట్రిపుల్‌ ఐటీ, నిమ్జ్‌లపై త్వరలో నిర్ణయం వెలువడుతుంది..’ ఇది మూడురోజుల క్రితం కనిగిరి ఎమ్మెల్యే ప్రకటన. గత మూడేళ్లుగా ఇదేవిధంగా ఆశలు రేపుతున్నా వాస్తవంలో మాత్రం ఆ ఊసే లేదు. జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్జ్‌కు పాలకుల నిర్లక్ష్యపు గ్రహణం పట్టింది. కేంద్ర బడ్జెట్‌లో   ఆ ప్రాజెక్టుకు కేటాయింపులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధి పూర్తిగా వైఫల్యం చెందారు. నిమ్జ్‌ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు నిలిచిపోతాయనుకున్న నిరుద్యోగుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. నిమ్జ్‌కు తొలి అడుగు 2013లో పడినప్పటికీ టీడీపీ అధికారంలోకి వచ్చాక భూసేకరణ చేపట్టారు. సర్వే దాదాపు పూర్తయింది. పామూరు, పీసీపల్లి మండలాల్లో స్థలం కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీని గురించి పట్టించుకునేవారే కరువయ్యారు.

కనిగిరి, ఆగస్టు 2: జిల్లాలో పశ్చిమప్రాంతంలోని కనిగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. తాగు, సాగు నీరు లేదు. కనీసం యువతకు ఉపాధి లేదు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నా ఇంత వరకూ ఇక్కడ ఏ ఒక్క పరిశ్రమా లేకపోవటంతో  ప్రజలకు, నిరుద్యోగులకు వలసబాట తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో 2013లో అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కనిగిరి ప్రాంతంలో నిమ్జ్‌ను మంజూరు చేసింది. రూ.10వేల కోట్ల అంచనాతో మూడు దశల్లో 2040నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సర్వే, భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసింది. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కానీ, స్థానిక ప్రజాప్రతినిధి కానీ ముందడుగు వేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలను మోసం చేయటమే అవుతుందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పనులు ప్రారంభమైతే కేంద్రప్రభుత్వం నుంచి రూ. 43,700కోట్లు వస్తాయన్నది అంచనా. నిమ్జ్‌ కార్యరూపం దాలిస్తే ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా మరో 2లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగాలకు సంబంధించి నైపుణ్యం, అర్హతలు సాధిస్తే మరో ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్లకుండా నిమ్జ్‌ పారిశ్రామిక కారిడార్‌ ద్వారా చక్కటి బాటలు వేసుకోవచ్చని గత టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అయితే మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం, స్థానిక కీలక ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం కారణంగా ఇక్కడి ప్రజలకు నిరాశే మిగిలిందనే ఆరోపణలు ఉన్నాయి.


గతంలోనే భూసేకరణ పూర్తయినా..

నిమ్జ్‌కు సంబంధించి భూసేకరణను పూర్తిచేసి 5వేల ఎకరాలను కూడా ఏపీఐఐసీకి కేటాయించారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి, పామూరు మండలాల్లోని పెదఇర్లపాడు, లింగన్నపాలెం, అయ్యన్నకోట, రేణిమడుగు, సిద్ధవరం, మాలకొండాపురం, బోడవాడ, అయ్యవారిపల్లి, మార్కొండాపురం గ్రామాల్లో భూసేకరణ పూర్తిచేశారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు భూసేకరణతో ఆగకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను పరుగులు పెట్టించారు. భూములు కోల్పోయిన రైతులతోను సమావేశాలు ఏర్పాటు చేయించి వారిని ఒప్పించారు.


పట్టించుకోని ప్రస్తుత ప్రభుత్వం

2019లో ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు కనిగిరి వచ్చినపుడు అధికారంలోకి వస్తే నిమ్జ్‌ ఏర్పాటుకు కృషిచేస్తానని ఆర్భాటంగా హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కనిగిరి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన మధుసూదన్‌యాదవ్‌ గెలిచారు. ఎన్నికలకు ముందు నిమ్జ్‌ ఏర్పాటులో టీడీపీ వైఫల్యం అని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ప్రాజెక్టు ఊసే పట్టించుకోకపోవటంపై ఆ పార్టీ వారిలోనే అసంతృప్తి నెలకొంది. సీఎంను అప్పుడప్పుడు కలిసి హడావుడి చేసి ఆ తర్వాత మిన్నకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీనిని బట్టే ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందని నిరుద్యోగ యువత, వలస కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2022-08-03T06:18:18+05:30 IST