సాగునీటి వనరులపై నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2022-06-26T06:11:27+05:30 IST

ప్రతి ఏడాది జల వనరుల శాఖ వివిధ కాలువల ఆధునికీకరణ కోసం ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం నుంచి పైసా రావడం లేదు.

సాగునీటి వనరులపై నిర్లక్ష్యం!
దేవరాపల్లి మండలం నేలపాలెం సమీపంలో తొమ్మిదో కిలోమీటరు తారువ వద్ద ఎడమ కాలువ దెబ్బతిన్న దృశ్యం

- పంట కాలువలు, గ్రోయిన్‌ల ఆధునికీకరణ వట్టిమాటే..

- వైసీపీ పాలనలో కొత్త ప్రాజెక్టు ఊసే లేదు

- బిల్లులు రాక ముందుకు సాగని పనులు




జిల్లాలో సాగునీటి వనరుల ఆధునికీకరణ పనులు పడకేశాయి. వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ చేపట్టలేదు. కనీసం పునాది రాయి వేసిన దాఖలాలు కూడా లేవు. పైగా ఏళ్ల తరబడిగా మరమ్మతులకు నోచుకోని సాగునీటి వనరుల ఆధునికీకరణకు ఆశించిన మేరకు పనులు జరగడం లేదు. పంట కాలువల ఆధునికీకరణ విషయంలో పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.


                                (అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ప్రతి ఏడాది జల వనరుల శాఖ వివిధ కాలువల ఆధునికీకరణ కోసం ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం నుంచి పైసా రావడం లేదు. ఫలితంగా పంట కాలువలు పూడిక చేరి వృథాగా దర్శనమిస్తున్నాయి. గ్రోయిన్‌ల ఆధునికీకరణ ప్రతిపాదనలతో సరి. అక్కడక్కడ గతంలో మంజూరైన కాలువ పనులు చేపడుతున్నా, సకాలంలో బిల్లులు విడుదలకాక అవి కూడా అరకొరగానే మిగులుతున్నాయి. జిల్లాలో సాగునీటి వనరులు వృథాగా దర్శనమిస్తుండడంతో రైతుల్లో సాగుపై నైరాశ్యం నెలకొంది. వ్యవసాయాధారిత జిల్లాలో సాగు రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టని పాలకుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పునర్విభజన తరువాత ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో నీటి పారుదల విభాగం పరిధిలో 3,05,993 ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు అధికారులు తేల్చారు. తాండవ జలాశయం కింద 32,689 ఎకరాలు, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల పరిధిలో సుమారు 42,725 ఎకరాల ఆయకట్టు, అదే విధంగా 2,880 చిన్న తరహా నీటి వనరులైన చెక్‌డ్యామ్‌లు, చెరువులు, కాలువల పరిధిలో మరో 2,30,579 ఎకరాల ఆయకట్టు ఉంది. 

అరకొర కేటాయింపులు

జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధికి ఆశించిన మేర నిధుల కేటాయింపులు జరగడం లేదు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగక పనులు నత్తనడకన సాగుతున్నాయి. వి.మాడుగుల మండలం పాలగెడ్డ జలాశయ మిగులు పనుల కోసం 2019లో రూ.202.27 లక్షలు మంజూరయ్యాయి. కాలువల ఆధునికీకరణ, ఇతరత్రా పనులకు నిధులు కేటాయించినా ఇంకా పూర్తి కాలేదు. చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు రాక 50 శాతం పనులే పూర్తయ్యాయి. ఏపీ సమీకృత సేద్య, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు పథకం కింద ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో జిల్లాలో 50 సాగునీటి చెరువుల పునరుద్ధరణకు రూ.33.45 కోట్లు కేటాయించారు. ఆయా చెరువుల పరిధిలో 7,061 ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. మంజూరైన చెరువుల్లో 32 చెరువు పనులు మాత్రమే సాగుతున్నాయి. 13 పనులకు ఇటీవలే టెండర్లు పూర్తి చేశారు. ఇంకా 7 పనుల విషయంలో టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో అధికారులకే స్పష్టత లేదు. 

ముందుకు సాగని పనులు

ఏపీ సాగునీటి, జీవనోపాధి అభివృద్ధి ప్రాజెక్టు (ఆపాస్‌) అంతర్జాతీయ సహకార సంస్థ సాయంతో చేపట్టిన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు పరిపాలన పరమైన ఆమోదం లభించింది. ఈ పనులు పూర్తయితే 15,344 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని భావించారు. ఈ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇదే పథకంతో 20 మైనర్‌ ఇరిగేషన్‌ పనులు చేపట్టేందుకు 15 ప్యాకేజీలుగా విభజించి సుమారు రూ.8 కోట్లతో ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. మరో 44 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు కేవలం రూ.64 లక్షల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఎప్పుడు పూర్తవుతాయో అధికారులకే తెలియాలి.

నిధులు లేక రైతుల అగచాట్లు

జిల్లాలో రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల మీద ఆధారపడివున్న పంట కాలువలకు గత మూడేళ్లుగా నిర్వహణ నిధులు విడుదల కావడం లేదు. కాలువల నిర్వహణ గాలికొదిలేశారు. దీంతో కాలువల్లో పూడిక పేరుకుపోయి తుప్పలు పెరిగిపోయాయి. దీంతో రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు ప్రభుత్వ తీరుపై విసుగుచెంది చందాలు వేసుకుని సొంతంగా కాలువ పూడిక తొలగింపు పనులు చేపట్టేవారు. విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో పనులు జరిగాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. కాలువల నిర్వహణ పూర్తిగా విస్మరించారు. దీంతో రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. 


Updated Date - 2022-06-26T06:11:27+05:30 IST