రైతుబజార్‌లపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-19T06:45:46+05:30 IST

రైతుబజార్ల నిర్వహణకు రాజధాని నుంచి రూపాయి కూడా ఇవ్వడం లేదు. ప్రతి బజారులో రోజూ బోర్డులపై కూరగాయల రేట్లు రాయాలి.

రైతుబజార్‌లపై నిర్లక్ష్యం

ఫొటోలు రైతుబజార్లు అని ఫోల్డర్‌లో ఉన్నాయి.

రైటప్‌: రైతుబజార్లకు కొత్తగా వచ్చిన స్కానర్‌ కమ్‌ జెరాక్స్‌ మిషన్‌

2. అలంకారప్రాయంగా మిగిలిన సీసీ టీవీ కెమెరా


నిర్వహణకు నిధులు ఇవ్వని వైనం

సుద్దముక్కలు అడిగితే...

స్కానర్‌ కమ్‌ జెరాక్స్‌ మెషీన్లు పంపించారు

అధికారుల విచిత్ర వైఖరి

పనిచేయని సీసీ టీవీలు

కంపుకొడుతున్న మరుగుదొడ్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రైతుబజార్ల నిర్వహణకు రాజధాని నుంచి రూపాయి కూడా ఇవ్వడం లేదు. ప్రతి బజారులో రోజూ బోర్డులపై కూరగాయల రేట్లు రాయాలి. నాలుగైదు రోజులకు ఒక చాక్‌పీస్‌ల బాక్స్‌ అవసరం. ధర పది రూపాయలే. అయినా గత కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. అటెండర్లే చేతి డబ్బులు పెట్టుకుని కొంటున్నారు. ఇటీవల రైతుబజార్ల సందర్శనకు అమరావతి నుంచి వచ్చిన ఉన్నతాధికారికి ఈ సమస్య వివరిస్తే...ఇక్కడి నుంచి వెళ్లగానే ఆయన ఆ విషయం పక్కన పెట్టి ఒక్కొక్క బజారుకు రూ.60 వేల విలువైన స్కానర్‌ కమ్‌ జెరాక్స్‌ మిషన్లు పంపించారు. వాటిని ఏమి చేయాలో తెలియక ఎస్టేట్‌ అఽధికారులు కవర్లు తీయకుండా అలాగే పక్కన పెట్టారు. ప్రతి జిల్లాకు రైతుబజార్లను పర్యవేక్షించడానికి ఒక కార్యాలయం ఉంటుంది. అక్కడే రూ.10 వేలు విలువ చేసే ప్రింటర్‌ లేదు. రైతుబజార్లకు ఎందుకు ఈ జెరాక్స్‌ మిషన్లు ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ మిషన్‌ ఒక్కొక్కటి రూ.60 వేలు ఖరీదు కాగా మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి 60 మిషన్లు రాష్ట్రంలోని బజార్లకు పంపించారు. చాక్‌పీస్‌లు మాత్రం ఇవ్వడం లేదు.

పనిచేయని సీసీ టీవీ కెమెరాలు

రైతుబజార్లకు రోజూ వేల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తారు. చిల్లర దొంగతనాలు ఎక్కువయ్యాయని అన్ని బజార్లలోను సీసీ కెమెరాలు పెట్టించారు. వాటి నిర్వహణ బాధ్యత ఒక ఏజెన్సీకి అప్పగించారు. కరోనా తరువాత ఆ సంస్థకు బిల్లు చెల్లించకపోవడంతో వారు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీ నిల్వ చేసే బ్యాకప్‌ హార్డ్‌ డిస్క్‌లు తీసుకుపోయారు. ప్రస్తుతం సీసీ టీవీలు అలంకారప్రాయంగా మిగిలాయి. వాటి సంగతి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దాంతో మళ్లీ చిల్లర దొంగతనాలు పెరిగిపోయాయి. 

ఇంటర్‌నెట్‌ సౌకర్యమూ లేదు

ప్రతి బజార్‌ నుంచి రైతుల డేటా, వారు తెచ్చిన కూరగాయలు, విక్రయాలు తదితర సమాచారం అంతా ఏ రోజుకు ఆ రోజు కేంద్ర కార్యాలయానికి ఎస్టేట్‌ అధికారులు పంపించాలి. ఇందుకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం తప్పనిసరి. దాదాపుగా 70 శాతం బజార్లకు ఈ సౌకర్యం లేదు. ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉన్న బజార్‌లకు బిల్లు కట్టేందుకు నిధులు ఇవ్వడం లేదు. కంప్యూటర్లు కూడా పదిహేనేళ్ల క్రితం నాటివి. అవి కూడా పనిచేయకుండా మొరాయిస్తే...ఇటీవలె డెల్‌ కంప్యూటర్లు  పంపించారు. పనిలో పనిగా ఇంటర్‌నెట్‌ పెట్టించమంటే మాత్రం అంగీకరించడం లేదు. మొబైల్‌ డేటా సాయంతోనే డేటా పంపుతున్నారు.

కంపు కొడుతున్న మరుగుదొడ్లు    

రైతుబజార్లకు రైతులు, వ్యాపారులు తెల్లవారుజామున నాలుగింటికి వస్తే మళ్లీ సాయంత్రం ఇళ్లకు వెళతారు. అందుకని మరుగుదొడ్లు నిర్మించారు. వాటిని శుభ్రం చేయడానికి స్కావెంజర్‌ను రూ.4 వేల జీతానికి పెట్టినా...వారికి అవసరమైన ఫినాయిల్‌, యాసిడ్‌, చీపుర్లు వంటివి ఏళ్ల తరబడి ఇవ్వడం లేదు. దాంతో కేవలం నీటితో కడగడం వల్ల దుర్వాసన వెదజల్లుతున్నాయి. వినియోగదారులు ఆ పక్కనున్న దుకాణాల వైపు వెళ్లడం లేదు. దాంతో అక్కడ వ్యాపారం సాగడం లేదు. ఇలా రైతుబజార్లలో సవాలక్ష సమస్యలు ఉండగా వాటిని పరిష్కరించకుండా, ఎటువంటి అవసరం లేని స్కానర్‌ కమ్‌ జెరాక్స్‌ మిషన్లు ఎందుకు పంపించారో అర్థం కావడం లేదు.


Updated Date - 2022-05-19T06:45:46+05:30 IST