చెంతనే కాలువ.. సాగునీటికి చింత

ABN , First Publish Date - 2022-08-09T04:39:59+05:30 IST

నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపమవుతోంది. చెంతనే నారాయణపురం కాలువ ఉన్నా.. సాగునీరందక పొందూరు మండలంలోని తాడివలస, కింతలి, లొద్దలపేట, సింగూరు, బొడ్డేపల్లి తదితర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో నారాయణపురం ఎడమకాలువ కింద సుమారు ఏడువేల హెక్టార్లలో వరి పంట సాగవుతోంది.

చెంతనే కాలువ.. సాగునీటికి చింత
నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

‘నారాయణపురం’ ఆధునికీకరణలో నిర్లక్ష్యం

ఆందోళన చెందుతున్న రైతులు

(పొందూరు, ఆగస్టు 8) 

నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపమవుతోంది. చెంతనే నారాయణపురం కాలువ ఉన్నా.. సాగునీరందక పొందూరు మండలంలోని తాడివలస, కింతలి, లొద్దలపేట, సింగూరు, బొడ్డేపల్లి తదితర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో నారాయణపురం ఎడమకాలువ కింద సుమారు ఏడువేల హెక్టార్లలో వరి పంట సాగవుతోంది. నారాయణపురం కాలువ ఆధునికీకరణ పనుల్లో నిర్లక్ష్యం కారణంగా తమకు సక్రమంగా సాగునీరు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఉపాధిహామీ ద్వారా పనులు చేపట్టి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. జేసీబీతో పనులు చేపట్టి.. మట్టిని అక్కడే విచిడిపెట్టారు. దీంతో ఆ మట్టి కాలువలో పడి సక్రమంగా సాగునీరందడం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు ముందే సబ్‌చానళ్లను అధికారులు సిద్ధం చేయాలి. కాలువల మరమ్మతులు చేపట్టాలి. కానీ, పనులు చేపట్టకపోవడంతో కాలువల్లో పూడికలు పేరుకుపోయాయి. నీరు పారడం లేదు. మరోవైపు కావళి బ్రిడ్జి వద్ద షట్టర్లు ఎత్తులో పెట్టారు. కాలువ లోతు కావడంతో ఇక్కడి నుంచి సబ్‌ చానెల్‌ ద్వారా తాడివలస, లొద్దలపేట, కింతలి తదితర గ్రామాలకు సాగునీరు అందడం లేదు. వరినాట్లు ఎండిపోతున్నాయి. ప్రధాన కాలువలో 400 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తేనే.. ఈ కాలువలోకి నీరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగునీరందించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 


సాగునీటి కోసం రైతుల నిరసన

పొందూరు మండలం తాడివలస, బెలమాం, కావళి లొద్దలపేట సబ్‌చానల్‌ ద్వారా నారాయణపురం ప్రధానకాలువ నుంచి సాగునీరు విడుదల చేయాలని సోమవారం తాడివలసలో రైతులు నిరసన తెలిపారు. ‘కావళి వద్ద ఉన్న 8-7 ఛానల్‌ ద్వారా సాగునీరందక సుమారు 1000 ఎకరాలు వరిపంట ఎండిపోతోంది. అధికారులకు ఎన్నిసార్లు ప్రాథేయపడినా సాగునీరు విడిచి పెట్టడం లేదు. సబ్‌చానల్‌లో జంగిల్‌ క్లియరెన్సు, పూడికతీత పనులు నిర్వహించడం లేదు. ఉపాధిహామీ ద్వారా కాలువ మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నా స్పందించడం లేదు. ఇప్పటివరకు సాగునీరందక వరినాట్లు ఎండిపోతున్నాయ’ని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక పంట నష్టపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సర్పంచ్‌ తమ్మినేని మునెమ్మ, బీజేపీ సమాచార హక్కుల చట్టం సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిల్లి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో భారీగా రైతులు శ్రీకాకుళంలోని జడ్పీలో స్పందనకు తరలివెళ్లారు. తమ సమస్య పరిష్కరించాలని అధికారులకు వినతిప్రతాన్ని అందజేశారు. 


నదిలో నీరులేకే.. 

నాగావళి నదిలో నీరు లేకే నారాయణపురం ఎడమకాలువ పరిధిలోని తాడివలస సబ్‌చానల్‌కు సాగునీరందడం లేదు. కాలువలోకి 400 క్యుసెక్కుల నీరు వస్తే.. దిగువకు విడిచిపెడతాం. కాలువ పనుల్లో ఎటువంటి సాంకేతిక లోపాలు లేవు. సబ్‌చానల్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేసీబీతో పనులు చేయించాం. ఇందులో ఎటువంటి అవకతవకలు లేవు. 

- జీవీ రమణ, ఏఈ, నీటిసారుదలశాఖ



Updated Date - 2022-08-09T04:39:59+05:30 IST