విధుల్లో నిర్లక్ష్యం.... విద్యార్థులకు శాపం..?

ABN , First Publish Date - 2021-10-29T04:04:15+05:30 IST

బెల్లంపల్లి పట్టణంలోని మహత్మాజ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ఈ పాఠశాలలో 5వ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉండగా ప్రభుత్వం ఈ యేడు ఇంటర్‌ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది.

విధుల్లో నిర్లక్ష్యం.... విద్యార్థులకు శాపం..?
బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో సీట్లు వచ్చినట్లు ధృవీకరణ పత్రాలు చూపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

బెల్లంపల్లి, అక్టోబరు 28 : బెల్లంపల్లి పట్టణంలోని మహత్మాజ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ఈ పాఠశాలలో 5వ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉండగా ప్రభుత్వం ఈ యేడు ఇంటర్‌ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొన్ని నెలల క్రితం ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించింది. అయితే పాఠశాలలో 5 సీట్లు మాత్రమే ఖాళీ ఉండగా 74 సీట్లు ఖాళీ ఉన్నట్లు ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. దీంతో 74 మంది సీటు సాధించినట్లు సంబంధిత అధికారులు ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. నాలుగు రోజుల క్రితం గురుకుల పాఠశాలల తెరుచుకున్నాయి. దీంతో 74 మంది విద్యార్ధినీలు తల్లిదండ్రులతో కలిసి బెల్లంపల్లి పట్టణంలోని గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల సిబ్బంది  సీట్లు ఖాళీగా లేవని వెనక్కి పంపుతున్నారు. ఈ విషయంపై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నవ్యకుమారిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ప్రవేశ పరీక్ష సమయంలో గురుకుల పాఠశాలలో విధులు నిర్వహించే కంప్యూటర్‌ ఆపరేటర్‌ వివరాలను సరిగ్గా పొందుపర్చకపోవడంతో  ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ విషయం పై అధికారులకు తెలియజేయగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను తొలగించారని పేర్కొన్నారు. ప్రస్తుతం గురుకుల పాఠశాలలో సీట్లు ఖాళీగా లేనందున విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.  

Updated Date - 2021-10-29T04:04:15+05:30 IST