శ్రీ గురవేనమః

ABN , First Publish Date - 2020-06-12T08:16:45+05:30 IST

శిష్యుని అజ్ఞానమనే అంధకారాన్ని రూపుమాపి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువని దీని అర్థం. తత్వజ్ఞాన శోభితుడే గురువని, అట్టివానినే బోధగురుడంటారని రామకృష్ణ పరమహంస ప్రవచించారు. ఈ లోకమంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది

శ్రీ గురవేనమః

‘‘గు శబ్దస్త్వంధకారస్యాత్‌ రుశబ్దస్తన్నిరోధకః

అంధకార నిరోధిత్వాద్గురు రిత్యభి ధీయతే’’

శిష్యుని అజ్ఞానమనే అంధకారాన్ని రూపుమాపి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువని దీని అర్థం. తత్వజ్ఞాన శోభితుడే గురువని, అట్టివానినే బోధగురుడంటారని రామకృష్ణ పరమహంస ప్రవచించారు. ఈ లోకమంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది ఆత్మ ఒక్కటే. రెండవ వస్తువు ఉందనే భ్రాంతి వల్ల భయం కల్గుతుంది. అందుకే సాధకుని మనస్సులో పేరుకుపోయిన పంచవిధ భేదాలను సద్గురుడు ఖండించివేస్తాడు.


శాస్త్రజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం అనే రెండూ ఆత్మ విద్యాబోధనకు ఔన్నత్యాన్ని చేకూర్చుతాయి. అవే పరమాత్మ తత్వాన్వేషణకు పరమావధి. ఉత్తమగురుని బోధన నిరాటంకంగా గంగా ప్రవాహం వలె చక్కని అభివృద్ధిని సాధంచాలంటే పరమాత్మ అమూల్యమైన ఆశీస్సులు అలవడాలి. గులాబి మొక్క కనబడగనే తేనెటీగలు దాని చుట్టూ మూగి, మకరందాన్ని గ్రోలే విధంగా గురువర్యుని చేరిన శిష్యులు గురునికి శుశ్రూష చేసి, సాధనలో సత్ఫలితాలు సాధిస్తారు. గురువుల నోటి నుంచి వెలువడే దివ్యవాణి భగవంతుని నుండి ప్రసరించినట్టుగానే  భావించాలి. పరతత్వ విద్యా ప్రకాండుడైన గురుడు.. విశాల హృదయం, ప్రేమతత్వం, నిస్వార్థసేవ, దయవంటి మహోన్నత గుణాలు మెండుగా కలిగి ఉంటాడు. అహంకారరాహిత్యం, అభేదం గురువును వెన్నంటి ఉంటాయి. అందుకే గురు బోధ అనే అమృతం పవిత్రంగా ప్రకాశిస్తుంది. అటువంటి గురువును దర్శించిన సాధకునికి తక్షణమే అనిర్వచనీయమైన భక్తితత్పరత గాఢతరమౌతుంది. గురువును సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపునిగా భావిస్తాడు. సాధకుడు అభ్యసన కృత్యాలలో అడుగడుగునా అడిగే ప్రశ్నలకు హేతుబద్ధమైన దృష్టాంతాలతో గురువు సంతృప్తి కలిగిస్తాడు. సాధకుని సాధన ఉన్నత శిఖరాలందుకొనే విధంగా చేదోడువాదోడుగా ఉంటూ సాధనా ఫలితాన్ని సంపూర్ణంగా సాధింపజేస్తాడు.


గురుశిష్య సంబంధంలో శ్రీకృష్ణార్జునులు లోకోత్తరులు. అర్జునుడడిగిన ప్రశ్నలకు సత్వరమే సమాధానాలిచ్చి.. సందేహాలు తీర్చి, కర్తవ్యాన్ని బోధించి, కార్యోన్ముఖుణ్ని చేశాడు కృష్ణుడు. అది అర్జునుడొక్కడికే చేసిన బోధ కాదు. నాటికీ నేటికీ భగవద్గీత జగత్కల్యాణ కారకమై విరాజిల్లుతుంటే.. కృష్ణుడు జగద్గురువుగా పూజలందుకుంటున్నాడు. రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక గురువుగా అనేకమంది సందేహాలు తీర్చడమే కాక వివేకానందుని తీర్చిదిద్దిన తీరు నిరుపమానం. రామకృష్ణుల బాటలో నడిచిన వివేకానందుడు.. తన శిష్యకోటిని ప్రయోజనశీలురుగా చేయడమే కాక, ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించి, సనాతన హిందూ ధర్మ సంస్కృతి గొప్పదనాన్ని చాటి భారతదేశానికే గర్వకారణంగా నిలిచారు. 

- విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య

Updated Date - 2020-06-12T08:16:45+05:30 IST