నీట్-పీజీ కౌన్సిలింగ్ ఈనెల 12 నుంచి

ABN , First Publish Date - 2022-01-09T20:33:11+05:30 IST

2021-2022 సెషన్ మెడికల్ అడ్మిషన్ల కోసం నీట్-పీజీ కౌన్సిలింగ్ ఈనెల 12వ తేదీ నుంచి..

నీట్-పీజీ కౌన్సిలింగ్ ఈనెల 12 నుంచి

న్యూఢిల్లీ: 2021-2022 సెషన్ మెడికల్ అడ్మిషన్ల కోసం నీట్-పీజీ కౌన్సిలింగ్ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారంనాడు ప్రకటించారు. నీట్ పీజీ ప్రవేశాలకు రెండ్రోజుల క్రితం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజా ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల కోటా సబబే అని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో మాదిరిగానే క్రిమిలేయర్‌ సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తింప చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నీట్‌లో 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం లభించింది. అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం అత్యవసరమని తెలిపింది.


''నీట్-పీజీ కౌన్సిలింగ్‌ను సుప్రీంకోర్టు ఆదేశాలు, రెసిడెన్ట్ డాక్టర్లకు ఆరోగ్య శాఖ ఇచ్చిన హామీ మేరకు జనవరి 12 నుంచి ఎంసీసీ ప్రారంభించనుంది. తాజా నిర్ణయంతో కోవిడ్‌పై సమర్ధవంతమైన పోరాటానికి మరింత బలం చేకూరనుంది. అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అని కేంద్ర మంత్రి ఒక ట్వీట్‌లో తెలిపారు.

Updated Date - 2022-01-09T20:33:11+05:30 IST