‘నీట్‌’ నుంచి మినహాయింపు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-01-18T13:16:04+05:30 IST

వైద్యకోర్సుల ప్రవేశానికి నిర్వహిస్తున్న జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్‌) నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని డీఎంకే నేతృత్వంలోని అఖిలపక్ష ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు.

‘నీట్‌’ నుంచి మినహాయింపు ఇవ్వండి

                  - కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఎంపీల వినతి


చెన్నై: వైద్యకోర్సుల ప్రవేశానికి నిర్వహిస్తున్న జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్‌) నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని డీఎంకే నేతృత్వంలోని అఖిలపక్ష ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయిన ఎంపీలు.. తమ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డీఎంకే సీనియర్‌ నేత టీఆర్‌ బాలు నేతృత్వంలో పలు పార్తీల ఎంపీలు అమిత్‌ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. సుమారు అరగంట పాటు ఆయనతో భేటీ అయిన ఎంపీలు.. నీట్‌ వల్ల రాష్ట్ర విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. వారి విజ్ఞప్తిని ఆలకించిన అమిత్‌షా.. కేంద్ర ఆరోగ్య, విద్యాశాఖ మంత్రులతో మాట్లాడ తానని హామీ ఇచ్చారు. హోం మంత్రితో భేటీ అనంతరం బయటకు వచ్చిన టీఆర్‌ బాలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, నీట్‌ వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పడుతున్న అవస్థలను వివరించామన్నారు. ఆయన తాము చెప్పిందిన విన్నారని, కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులు నీట్‌తో వైద్య విద్యకు దూరమవుతున్నారని, ఈ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గత అన్నాడీఎంకే, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపాయి. కానీ, ఆ తీర్మానాలపై రాష్ట్ర గవర్నర్‌ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సైతం రాజ్‌భవన్‌కు వెళ్లి విన్నవించినా గవర్నర్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకోవడం గమనార్హం. అమిత్‌షాతో జరిగిన భేటీలో డీఎంకే లోక్‌సభ సభ్యుడు టీఆర్‌ బాలుతోపాటు అన్నాడీఎంకే ఎంపీ ఎ.నవనీతకృష్ణన్‌, కాంగ్రెస్‌ ఎంపీ డాక్టర్‌ జయకుమార్‌, ఎండీఎంకే ఎంపీ వైగో, సీపీఎం ఎంపీ పీఆర్‌ నటరాజన్‌, వీసీకే ఎంపీ డి.రవికుమార్‌, సీపీఐ ఎమ్మెల్యే టి.రామచంద్రన్‌, పీఎంకే ఎమ్మెల్యే జీకే మణి తదితరులున్నారు.


 వరద సాయం రూ.6230 కోట్లు విడుదల చేయండి : స్టాలిన్‌ లేఖ

చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావిత వర్షాల కారణంగా ఏర్పడిన వరద బాధిత ప్రాంతాలో సహాయక, పునరావాస చర్యలు చేపట్టేందుకు తక్షణమే రూ.6230 కోట్లు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సోమవారం లేఖ రాశారు. గత ఏడాది చివరలో కనీవిని ఎరుగని రీతిలో కుంభవృష్టి సంభవించిందని, ప్రస్తుతం తమ ప్రభుత్వం కరోనా వైరస్‌ నిరోధక పనులకే నిధులను అత్యధికంగా కేటాయించడం వల్ల వరద బాధిత ప్రాంతాల్లో పునరావస చర్యలకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఈ విషయమై మూడుసార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా పంపినట్లు స్టాలిన్‌ గుర్తు చేశారు.

Updated Date - 2022-01-18T13:16:04+05:30 IST