ఇప్పుడేం జరుగనుంది?

ABN , First Publish Date - 2022-02-05T15:56:45+05:30 IST

నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిప్పి పంపేశారు.. ఇప్పుడేం జరుగనుంది?.. శనివారం జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారు?.. ఒకవేళ మళ్లీ అసెంబ్లీలో అదే బిల్లును ఆమోదించి

ఇప్పుడేం జరుగనుంది?

- నీట్‌ మినహాయింపుపై సర్వత్రా ఉత్కంఠ 

- ‘వ్యతిరేక బిల్లు’ను మళ్లీ అసెంబ్లీ ఆమోదిస్తే గవర్నర్‌ ఏం చేస్తారో ?


చెన్నై: నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిప్పి పంపేశారు.. ఇప్పుడేం జరుగనుంది?.. శనివారం జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారు?.. ఒకవేళ మళ్లీ అసెంబ్లీలో అదే బిల్లును ఆమోదించి పంపితే గవర్నర్‌ ఏం చేస్తారు?.. ఇంతకీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోనుంది?.. గవర్నర్‌ ముందున్న ప్రత్యామ్నాయా లేంటి?.. జార్జ్‌కోట - రాజ్‌భవన్‌ మధ్య అంతరం పెరిగిందా?.. ఇక యుద్ధం మొదలు కానుందా?.. అందుకే మున్ముందు తాను అవలంభించాల్సిన వైఖరిపై స్పష్టత కోసమే గవర్నర్‌ ఢిల్లీ వెళ్లనున్నారా?.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే అంశాలపై ముమ్మరంగా చర్చ జరుగుతోంది. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో గట్టి పట్టుదలతో వున్నట్లు కనిపిస్తోంది. అందుకే నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సవరణలు, వివరణలతో తాజాగా తీర్మానం ఆమోదించి గవర్నర్‌కు పంపేందుకు సన్నాహాలు చేపడుతోంది. శాసనసభ రెండోసారి ఆమోదించి పంపే బిల్లును గవర్నర్‌ తిరస్కరించలేరని హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కర్పగవినాయగం వంటి న్యాయ నిపుణులు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబరులో శాసనసభలో ఆమోదించిన బిల్లుకు అనుబంధంగా చేర్చిన జస్టిస్‌ ఏకే రాజన్‌ కమిషన్‌ నివేదిక అంశాలను గవర్నర్‌ పరిశీలించకుండానే బిల్లును తిప్పి పంపారని, బిల్లు తిరస్కరణకు తగిన కారణం కూడా తెలపలేదని వారు వ్యాఖ్యా నిస్తున్నారు. విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా ఆ బిల్లు ఉందని మాత్రమే గవర్నర్‌ పేర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా వెనుబడి ఉన్న విద్యార్థుల సంక్షేమానికి భంగం కలిగించేలా అసెంబ్లీ తీర్మాణించిన బిల్లు ఉందని గవర్నర్‌ అసెంబ్లీ స్పీకర్‌కు పంపిన ఆదేశాల్లో పేర్కొ నడమేంటని, అదెలా భంగం కలిగించేలా వుందో చెప్పాల్సిన అవసరం ఆయనకు వుందని పేర్కొంటున్నారు. 


నేడు అఖిలపక్షం సమీక్ష...

నీట్‌ బిల్లును గవర్నర్‌ తిరస్కరించటంపై శనివారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో పార్టీల ప్రతినిధులు సమీక్షించనున్నారు. అన్ని పార్టీలు కలిసి నీట్‌ మినహాయింపు కోసం మరిన్ని వివరాలతో శాసనసభలో తాజాగా తీర్మానం చేసి ఆమోదించాలనే ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన నాయకులంతా నీట్‌పై మరో బిలులను శాసనసభలో ప్రవేశపెట్టడం ఖాయమని ప్రకటించారు. ఆ దిశగానే అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.


మళ్లీ బిల్లు పంపితే..?

శాసనసభలో నీట్‌ మినహాయింపు బిల్లును మరోమారు ఆమోదించి పంపితే అప్పుడు గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీగా గవర్నర్‌ ఆ బిల్లును ఆమోదించటం మినహా మరో గత్యంతరం లేదని చెబుతుండగా, మరికొందరు మాత్రం ఆ బిల్లుపై గవర్నర్‌ రెండు రకాల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపడం, లేదా బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సుప్తచేత నావస్తలో పెట్టడం మాత్రమే ఆయన ముందున్న మార్గాలని గుర్తు చేస్తున్నారు. హైకోర్టు సీనియర్‌ న్యాయవాది, డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ ధర్మాసనం 163వ అధికరణ ప్రకారం శాసనసభ ఆమోదించిన బిల్లుకు వ్యతిరేకంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదన్నారు. బిల్లుకు సంబంధించి అనుమానాలుంటే, వాటి నివృత్తి కోసం పంపవచ్చని, అయితే ప్రస్తుతం బిల్లుకు సంబంధించి ఎలాంటి వివరణ కోరకుండానే తిప్పిపంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండోసారి శాసనసభ ఆమోదించే బిల్లును రాజ్యాంగ ధర్మాసనం 21 వ సెక్షన్‌ ప్రకారం గవర్నర్‌ ఆమోదించితీరాలన్నారు. మరో సీనియర్‌ న్యాయ వాది కేఎన్‌ విజయన్‌ మాట్లాడుతూ... శాసనసభ ఆమోదించిన బిల్లుపై ఏవైనా వివరాలు కోరుతూ గవర్నర్‌ ఆ బిల్లును స్పీకర్‌కు పంపవచ్చని, అయితే ప్రభుత్వం రెండోసారి ఆమోదించే బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపటం మినహా మరో ప్రత్యా మ్నాయం లేదన్నారు. అదే సమయంలో మరో కీలక మైన అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని, అదేమిటంటే నీట్‌ నుంచి మినహాయింపు కోరుతూ తీర్మానం చేసే అధికారం శాసనసభకు ఉందా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉన్న వైద్య విద్యకు సంబంధించిన అంశాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసే అధికారం శాసనసభలకు లేదని రాజ్యాంగ ధర్మాసనం 60, 61 సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. మరో న్యాయవాది ఎన్‌.రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ... పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టం నుంచి మినహాయింపు పొందాలంటే రాజ్యాంగ ధర్మాసనం 53వ సెక్షన్‌ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వు లేదా ఆమోదం అత్యంత అవసరమని తెలిపారు. ప్రస్తుతం రెండోసారి రాష్ట్ర శాసనసభ ఆమోదించే బిల్లును గవర్నర్‌ అంగీకరించినా, ఆ బిల్లుపై నిర్ణయం తీసుకోలేరని, రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారన్నారు. చివరకు రాష్ట్రపతి మాత్రమే నీట్‌ మినహాయింపు బిల్లుపై నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేశారు. 


గవర్నర్‌ తొందరపడ్డారా?

హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కర్పగ వినాయగం మాట్లాడుతూ... నీట్‌ బిల్లును తిరస్కరించి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తొందరపడ్డారన్నారు. నీట్‌ బిల్లుపై గవర్నర్‌ వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించి వుండాల్సిందన్నారు. ఇదేవిధంగా మాజీ ప్రధాని రాజీవ్‌ హత్య కేసు ముద్దాయిల విడుదల బిల్లు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారని చెప్పారు. నీట్‌ మినహాయిం పు బిల్లులో ఎలాంటి సవరణ చేయాలో గవర్నర్‌ రాష్ట్ర ప్రభు త్వానికి సూచించి వుంటే బాగుండేదని, బిల్లును తానెందుకు తిరస్కరించాల్సి వచ్చిందో తగిన కారణాలను తెలిపి ఉండా లన్నారు. ఇక జస్టిస్‌ ఏకే రాజన్‌ కమిటీ సిఫారసులు, అధ్యయనం మేరకే నీట్‌ మినహాయింపు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదించారని, అలాంట ప్పుడు ఆ కమిటీ నివేదికను గవర్నర్‌ పరిశీలించి ఉంటే బిల్లును తిప్పి పంపేందుకు అవకాశం ఉండేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ బిల్లును శాసనసభలో ఆమోదించి పంపితే గవర్నర్‌కు ఆమో దించటం మినహా మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-02-05T15:56:45+05:30 IST