‘నీట్‌’కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-07-17T13:28:50+05:30 IST

వైద్య విద్య (యూజీ) నీట్‌ 2022-23 ప్రవేశాల కోసం ఆదివారం పరీక్ష జరుగనుంది. రాష్ట్రంలో చెన్నై, కోవై సహా 18 నగరాల్లో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పా

‘నీట్‌’కు సర్వం సిద్ధం

- రాష్ట్రంలో 18 నగరాల్లో ఏర్పాట్లు పూర్తి

- పరీక్ష రాయనున్న 68 ఏళ్ల వృద్ధుడు


ప్యారీస్‌(చెన్నై), జూలై 16: వైద్య విద్య (యూజీ) నీట్‌ 2022-23 ప్రవేశాల కోసం ఆదివారం పరీక్ష జరుగనుంది. రాష్ట్రంలో చెన్నై, కోవై సహా 18 నగరాల్లో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా సమయాన్ని 20 నిమిషాలు పెంచారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 నిమిషాల సమయం ఇచ్చారు. ఇందులో 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.42 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులు నీట్‌ పరీక్ష రాయనున్నారు. చెన్నై, కోయంబత్తూర్‌, కడలూరు, కాంచీపురం, కరూర్‌, మదురై, నాగర్‌కోయిల్‌, నామక్కల్‌, సేలం, తంజావూరు, తిరువళ్లూర్‌, తిరుచ్చి, తిరునల్వేలి, వేలూరు, చెంగల్పట్టు, విరుదునగర్‌, దిండుగల్‌, తిరుప్పూర్‌ అనే 18 నగరాల్లో నీట్‌ పరీక్ష నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.


పరీక్ష రాయనున్న రిటైర్డ్‌ ఉద్యోగి ...

 68 ఏళ్ల వయసులో నీట్‌ రాయడానికి రామమూర్తి అనే రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి సిద్ధమయ్యారు. గత ఏడాది నగరానికి చెందిన 64 ఏళ్ల సుబ్రమణ్యన్‌, ధర్మపురికి చెందిన 61 ఏళ్ల శివప్రకాశంలు నీట్‌ రాసి ఉత్తీర్ణత సాధించారు. ఆ రీతిలో ఈ ఏడాది నీట్‌ రాసి ఎలాగైనా ఉత్తీర్ణ సాధించాలని తంజావూరుకు చెందిన రామమూర్తి హాల్‌టిక్కెట్‌ కూడా పొందారు. సహకార శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి పదవీవిరమణ పొందిన ఆయన చదువుపై పెంచుకున్న మమకారంతో ఇప్పటివరకు 28 డిగ్రీలు సాధించడం గమనార్హం. ఆయనకు కమల అనే భార్య, అఖిల, కోకిల అనే కుమార్తెలు, ముత్తురామలింగం అనే కుమారుడున్నాడు. నీట్‌లో ఉత్తీర్ణత సాధించి డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని రామమూర్తి ధీమా వ్యక్తం చేశారు.


పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు...

- విద్యార్థులు అడ్మిషన్‌ కార్డు, ఇతర పత్రాలను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. 

- అరగంటకు ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 

- పాస్‌ పోర్ట్‌ సైజు ఫొటో, పాన్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు గుర్తింపు కార్డు, ప్లస్‌ టూ హాల్‌టికెట్‌, పాస్‌పోర్ట్‌, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు వీటిలో ఏదైనాఒకదానిని తీసుకెళ్లాలి.

- మొబైల్‌ ఫోన్‌లో ఉన్న గుర్తింపు కార్డులు అనుమతించరు.

- ఎన్‌-95 మాస్క్‌ తప్పనిసరి, శానిటైజర్‌ బాటిల్‌ తీసుకెళ్లాలి.

- అనారోగ్యంగా ఉంటే ముందే తెలియజేయాలి.

- ముక్కు పిన్నులు, గొలుసులు, ఉంగరాలు, గాగుల్స్‌, హ్యాండ్‌ బ్యాగ్‌లు, బ్రాస్‌ లైట్లు, చెవి పోగులు, బాడ్జీలు, హెయిర్‌ బ్యాండ్లు, తాయత్తులతో పాటు ఇతర ఆభరణాలు నిషేధం. సాధారణ చెప్పులతో మాత్రమే రావాలి.

- బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ ఉపయోగించాలి.

- ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సెల్‌ఫోన్‌ నిషేధం.

Updated Date - 2022-07-17T13:28:50+05:30 IST