త్వరలో ‘నీట్‌’ గండం నుంచి దేశానికి విముక్తి

ABN , First Publish Date - 2022-03-17T13:19:59+05:30 IST

డీఎంకే ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా త్వరలో ‘నీట్‌’ గండం నుంచి దేశానికి విముక్తి లభించనున్నదని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆశాభావం వ్యక్తం

త్వరలో ‘నీట్‌’ గండం నుంచి దేశానికి విముక్తి

చెన్నై: డీఎంకే ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా త్వరలో ‘నీట్‌’ గండం నుంచి దేశానికి విముక్తి లభించనున్నదని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నైలో బుధవారం ఉదయం జరిగిన మంత్రి కేఎన్‌ నెహ్రూ సోదరుడు రామజయం కుమార్తె వివాహ వేడుక కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రసం గిస్తూ... వైద్య విద్యాకోర్సుల్లో నిరుపేద విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రవేశం కల్పించాలన్న ఆశయం తోనే డీఎంకే ప్రభుత్వం నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని సుదీర్ఘకాలంగా పోరాడుతోందని చెప్పారు. నీట్‌ మినహాయింపు కోసం శాసనసభలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్‌కు పంపామని, అయితే నెలల తరబడి ఆ బిల్లును పెండింగ్‌లో ఉంచి తిప్పిపంపారన్నారు. ఆ తర్వాత డీఎంకే ప్రభుత్వం పట్టు సడలించకుండా రెండోమారు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించి నీట్‌ మినహాయింపు బిల్లును ఆమోదింపజేసి మళ్ళీ గవర్నర్‌ పరిశీలనకు పంపగా, ఆయన  ఇంకా రాష్ట్రపతికి పంపలేదని తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో తాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ మంత్రులతో రాజ్‌భవన్‌ వెళ్ళి గవర్నర్‌ను స్వయంగా కలిఇ నీట్‌ బిల్లు పరిస్థితిని అడిగి తెలుసుకున్నామని తెలిపారు. నీట్‌ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు వీలయినంత త్వరగా పంపుతానని గవర్నర్‌ తమకు హామీ ఇచ్చారని స్టాలిన్‌ చెప్పారు. ప్రస్తుతం నీట్‌ మినహాయింపు సాధనలో డీఎంకే ప్రభుత్వం తొలి విజయాన్ని సాధించిందని, త్వరలోనే నీట్‌ గండం నుండి దేశానికి విముక్తి లభిస్తుందని ఆయన తెలిపారు. ఇక సోదరుడు రామజయం కుమార్తె వివాహ వేడుకలను మంత్రి నెహ్రూ భారీ యెత్తున నిర్వహించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రామజయం హత్యకు గురైనప్పుడు దివంగత డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి తల్లడిల్లిపోయారని, పార్టీకి ఎనలేని సేవలందించిన ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ పార్టీ పత్రిక మురసొలిలో ప్రత్యేక వ్యాసం కూడా రాశారని స్టాలిన్‌ గుర్తు చేశారు. ఈ వివాహవేడుకల్లో టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ఆ పార్టీ ఎంపీ తిరునావుక్కరసర్‌, సీపీఎం నాయకుడు టికే రంగరాజన్‌, సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ముత్తరసన్‌, డీపీఐ నేత తిరుమావళవన్‌, ద్రవిడ కళగం నేత కే వీరమణి, కొంగునాడు దేశియ కట్చి నేత ఈశ్వరన్‌, ముస్లింలీగ్‌ నాయకుడు ఖాదర్‌మొయుద్దీన్‌, ఎంజీఆర్‌ కళగం నేత ఆర్‌ఎం వీరప్పన్‌, మంత్రులు దురైమురుగన్‌, పొన్ముడి, అన్బిల్‌ మహేశ్‌పొయ్యామొళి, ఎంపీ టీఆర్‌ బాలు, డీఎంకే యువజన విభాగం నాయకుడు ఉదయనిధి తదితరులు పాల్గొన్నారు.


మేయర్‌ను వేదికపైకి ఆహ్వానించిన స్టాలిన్‌

ఈ వివాహ వేడుకకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియారాజన్‌ కూడా హాజరయ్యారు. వేదిక దిగువ ముందువరుస లో ఆమె మంత్రులతోపాటు కూర్చున్నారు. గమనించిన స్టాలిన్‌ ఆమెను వేదికపైకి ఆహ్వానించారు. నగర మేయర్‌గా ఆమెకు గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్వాహకులకు తెలిపారు. మేయర్‌ వేదికపైకి రాగానే ఆమెకు ఓ కుర్చీ తెప్పించి స్టాలిన్‌ కూరోచబెట్టారు. ముఖ్యమంత్రి తనపట్ల చూపిన ఆదరాభిమానాలకు మేయర్‌ ఆనందంతో పొంగిపోయారు.

Updated Date - 2022-03-17T13:19:59+05:30 IST