త్వరలో రాష్ట్రపతి ఆమోదానికి ‘నీట్’ బిల్లు

ABN , First Publish Date - 2022-04-19T15:03:05+05:30 IST

రాష్ట్రాన్ని నీట్‌ నుండి మినహాయించాలని కోరుతూ శాసనసభలో రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించిన్న బిల్లును ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదానికి పంపేందుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

త్వరలో రాష్ట్రపతి ఆమోదానికి ‘నీట్’ బిల్లు

                             - ఎట్టకేలకు గవర్నర్ నిర్ణయం


చెన్నై: రాష్ట్రాన్ని నీట్‌ నుండి మినహాయించాలని కోరుతూ శాసనసభలో రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించిన్న బిల్లును ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదానికి పంపేందుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సిద్ధమైనట్లు తెలిసింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాసనసభలో సభా నిబంధన 110 కింద నీట్‌ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనందుకే గవర్నర్‌ తేనీటి విందులో పాల్గొనలేదని ప్రకటిస్తున్న సమయంలోనే రాజ్‌భవన్‌ నుంచి మీడియాకు ‘లీకులు’ రావడం గమనార్హం. ఆ మేరకు నీట్‌ బిల్లును గవర్నర్‌ పరిశీలించారని, త్వరలోనే దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారని రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలోనూ నీట్‌ మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అసెంబ్లీలో నీట్‌ మినహాయింపు బిల్లును ఆమోదించి గవర్నర్‌ పరిశీలనకు పంపినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో గత యేడాది మేలో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం నీట్‌ నుంచి మినహాయింపు ఎలా పొందాలన్న కిటుకు తమకు మాత్రమే తెలుసంటూ ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే నీట్‌ వల్ల విద్యార్థులకు కలుగుతున్న నష్టాలపై అధ్యయనం చేసేందుకు మాజీ న్యాయమూర్తి జస్టీస్‌ ఏకే నటరాజన్‌ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక  ఆధారంగా గత సెప్టెంబర్‌ 13న శాసనసభలో నీట్‌ మినహాయింపు ముసాయిదా చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఆ బిల్లును గవర్నర్‌కు పంపారు. అయితే ఫిబ్రవరి ఒకటిన గవర్నర్‌ ఆ బిల్లును వెనక్కి పంపారు. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న సమష్టి నిర్ణయం మేరకు ఫిబ్రవరి 8వ తేదీన శాసనసభ ప్రత్యేక సమావేశంలో రెండోసారి నీట్‌ మినహాయింపు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్‌కు పంపారు. మార్చి 15న నీట్‌ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపాలంటూ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కూడా గవర్నర్‌ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడంతో తమిళ ఉగాది సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు డీఎంకే, దాని మిత్రపక్షాలు గైర్హాజరయ్యాయి. గవర్నర్‌కు రాష్ట్రపభుత్వానికి విబేధాలు నెలకొన్నాయని ప్రసారమాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. అదే సమయంలో డీఎంకే పార్టీ పత్రిక ‘మురసొలి’లో నీట్‌ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రస్వరంగా దుయ్యబట్టారు. గవర్నర్‌ రాష్ట్రపతిననే భావనతో ఉన్నారంటూ ఆ సంపాదకీయంలో విమర్శించారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పట్టుసడలించి నీట్‌ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నీట్‌ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపినా కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకారం తెలుపుతుందా అన్నదే అసలు సందేహం. గవర్నర్‌ ఈ బిల్లును నేరుగా రాష్ట్రపతికి పంపటానికి వీలులేదు. కేంద్ర హోం శాఖ ద్వారానే పంపించాలి.. ఈ బిల్లుపై ముందుగా హోం శాఖ ఆధ్వర్యంలో న్యాయశాఖ పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపటానికి వీలుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదటి నుంచి నీట్‌కు మద్దతుగానే వ్యవహరిస్తుండటంతో నీట్‌ మినహాయింపు బిల్లును వ్యతిరేకించే అవకాశాలే అధికంగా ఉన్నాయి.

Updated Date - 2022-04-19T15:03:05+05:30 IST