నీట్‌, జేఈఈ పరీక్షలు ‘క్యుయెట్‌’లో విలీనం!

ABN , First Publish Date - 2022-08-13T08:43:42+05:30 IST

జాతీయ అర్హత కమ్‌ ప్రవేశ పరీక్ష (నీట్‌), ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)లను రద్దు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వాటిని కొత్తగా ప్రవేశపెట్టిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌

నీట్‌, జేఈఈ పరీక్షలు ‘క్యుయెట్‌’లో విలీనం!

అందరికీ ఇక ఒకే ఎంట్రెన్స్‌ టెస్ట్‌.. ప్రతిపాదనపై యూజీసీ కసరత్తు..

సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు


న్యూఢిల్లీ, ఆగస్టు 12: జాతీయ అర్హత కమ్‌ ప్రవేశ పరీక్ష (నీట్‌), ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)లను రద్దు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వాటిని కొత్తగా ప్రవేశపెట్టిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (క్యుయెట్‌)లో విలీనం చేసి.. దేశవ్యాప్తంగా అందరికీ ఒకటే ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదనపై విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం (యూజీసీ) కసరత్తు చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి ఏకాభిప్రాయం సాధించడానికి ఓ కమిటీని కూడా నియమించినట్లు యూజీసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ వెల్లడించారు. ఒకే విధమైన సబ్జెక్టులపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు విద్యార్థులు వేర్వేరు పరీక్షలు రాయడంలో హేతుబద్ధత లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు వైద్యం, దంత వైద్య కోర్సులు చదివేందుకు నీట్‌, ఇంజనీరింగ్‌లో చేరడానికి జేఈఈ పరీక్షలు రాస్తున్నారు. అలాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో సైన్స్‌, హ్యుమానిటీస్‌, కామర్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి తాజాగా క్యుయెట్‌ రాస్తున్నారు. పై ప్రతిపాదన సాకారమైతే.. ఇక విద్యార్థులంతా ఒకే పరీక్ష రాస్తే సరిపోతుంది.


ఇందులో వచ్చే మార్కులతో దేశవ్యాప్తంగా తమకు నచ్చిన కోర్సులు చదువుకునే వెసులుబాటు విద్యార్థులకు లభిస్తుంది. అందరూ ఒకే సబ్జెక్టులు చదివినప్పుడు భిన్న పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని జగదీశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. అన్ని రకాల కోర్సులను క్యుయెట్‌లో చేర్చవచ్చన్నారు. ‘ఇందులో పరీక్ష రాస్తే.. ఇంజనీరింగ్‌ చదవాలనుకుంటే గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మార్కులను పరిగణనలోకి తీసుకుని    ర్యాంకింగ్‌ జాబితా ఇవ్వాలి. మెడిసిన్‌కు కూడా సంబంధిత సబ్జెక్టుల మార్కుల ఆధారంగా ర్యాంకింగ్‌ జాబితా తయారుచేయాలి’ అని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఫార్మాట్‌లో ఏడాదికి రెండు సార్లు.. మే-జూన్‌లో ఒకసారి.. డిసెంబరులో రెండోసారి ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల ఆధారంగా తమకు నచ్చిన కోర్సును ఎంచుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకటే ప్రవేశ పరీక్ష ఉంటే.. కేవలం విద్యార్థులపై పరీక్షల భారం లేకుండా చేయడమే కాదు.. జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి కూడా పనిభారాన్ని తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది.

Updated Date - 2022-08-13T08:43:42+05:30 IST