కట్నం తేలేదని... తన కూతుర్ని వేధించి..

ABN , First Publish Date - 2020-08-02T15:33:13+05:30 IST

కట్నం తేలేదని...తన కూతుర్ని వేధించి చంపేశారని ఓ తండ్రి పోలీసులకు..

కట్నం తేలేదని... తన కూతుర్ని వేధించి..

వివాహిత మృతిపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు


ములకలచెరువు(చిత్తూరు): కట్నం తేలేదని...తన కూతుర్ని వేధించి చంపేశారని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు...మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన నాగరాజు కుమార్తె శ్రీలతను తన మేనమామైన ములకలచెరువు మండలంవేపూరికోట పంచాయతీ గురికివారిపల్లెకు చెందిన రామాంజులుకు ఇచ్చి నాలుగేళ్ళ క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు శశికుమార్‌, మోక్షజ్ఞ ఉన్నారు.


కొన్ని నెలలుగా రామాంజులు కుటుంబం మదనపల్లెలోనే ఉంటూ ఎలక్ర్టికల్‌ షాపు పెట్టి జీవనం సాగిస్తోంది. రామాంజులు, అతని భార్య శ్రీలత ఈనెల 26న గురికివారిపల్లెకు వచ్చారు. మరుసటి రోజు భార్యాభర్తలిద్దరు పొలం వద్దనున్న ఎగువ నీటి కుంట వర్షానికి నిండడంతో పూజలు చేసేందుకు వెళ్ళారు. కొద్దిసేపటికి శ్రీలత(25) కుంటలో శవమై కన్పించింది. కుంట వద్ద పూజ చేస్తూ శ్రీలత మునిగి చనిపోయిందని అత్తింటివారు సమాచారం ఇచ్చారని, అల్లుడు రామాంజులు స్వయాన అక్క కుమారుడు కావడంతో అనుమానించక ఆ గ్రామంలోనే ఖననం చేశామని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశాడు.


విచారించగా అత్తింటివారే చంపేసినట్లు బయటపడిందని,  కట్నం తేలేదని తన కూతుర్ని చంపేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఆ గ్రామంలో విచారణ చేపట్టారు. డీఎస్పీ, సీఐ, తహసీల్దార్‌ మహేశ్వరిబాయి సమక్షంలో నాలుగు రోజుల క్రితం ఖననం మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. మదనపల్లె నుంచి వచ్చిన వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి అత్తమామలు రమణప్ప, పార్వతి, భర్త రామాంజులుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Updated Date - 2020-08-02T15:33:13+05:30 IST