భారత్‌కు భారీ షాక్‌

ABN , First Publish Date - 2022-07-27T09:55:46+05:30 IST

కామన్వెల్త్‌ క్రీడలకు ముందు భారత్‌కు అతిపెద్ద షాక్‌. కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనే భారీ అంచనాలున్న స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా టోర్నమెంట్‌ నుంచి తప్పుకొన్నాడు.

భారత్‌కు భారీ షాక్‌

‘కామన్వెల్‌’్త నుంచి నీరజ్‌ అవుట్‌

గాయంతో టోర్నీలో ఆడలేనని ప్రకటన


బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడలకు ముందు భారత్‌కు అతిపెద్ద షాక్‌. కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనే భారీ అంచనాలున్న స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా టోర్నమెంట్‌ నుంచి తప్పుకొన్నాడు. గతవారమే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన 24 ఏళ్ల నీరజ్‌.. గాయం కారణంగా బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో పాల్గొనడం లేదని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్‌ మెహతా మంగళవారం వెల్లడించాడు. అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జావెలిన్‌ విసిరే సమయంలో నీరజ్‌ గజ్జల్లో గాయంతో బాధపడ్డ సంగతి తెలిసిందే. ‘గాయం కారణంగా ఫిట్‌గా లేకపోవడంతో టోర్నీలో ఆడలేనంటూ.. ఈరోజు ఉదయం అమెరికా నుంచి నీరజ్‌ అసోసియేషన్‌కు సమాచారం అందించాడు. సోమవారం ఉదయం అతనికి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేయించారు. అయితే, నెలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు’ అని మెహతా తెలిపాడు. కామన్వెల్త్‌ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా నీరజ్‌ వ్యవహరించాల్సి ఉంది. 

Updated Date - 2022-07-27T09:55:46+05:30 IST