Neelagiri జిల్లాలో ఉద్వేగం.. ఉద్విగ్నం

ABN , First Publish Date - 2021-12-10T14:14:26+05:30 IST

మనసును రంజింపజేసే పచ్చికబయళ్లు, వాటి వెంట పరుగులు తీసే పక్షులు-జంతువులు, ఆ సుందర ప్రకృతిని తిలకించేందుకు తరలివచ్చే యాత్రికులు.. ఇవీ ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లాను తలచుకోగానే

Neelagiri జిల్లాలో ఉద్వేగం.. ఉద్విగ్నం

- ఢిల్లీకి అమరుల పార్థివదేహాలు 

- కన్నీటితో వీడ్కోలు పలికిన స్థానికులు 

- శోకసంద్రమైన సైనిక శిక్షణా కేంద్రం


చెన్నై: మనసును రంజింపజేసే పచ్చికబయళ్లు, వాటి వెంట పరుగులు తీసే పక్షులు-జంతువులు, ఆ సుందర ప్రకృతిని తిలకించేందుకు తరలివచ్చే యాత్రికులు.. ఇవీ ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లాను తలచుకోగానే గుర్తొచ్చే దృశ్యాలు. అయితే రెండు రోజులుగా ఆ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్వేగం, ఉద్రిక్తత నెలకొంది. ఎటు చూసినా విషాదఛాయలు అలముకున్నాయి. తమ జిల్లాలో దేశరక్షకుల్ని కోల్పోయామన్న బాధ జిల్లావ్యాప్తంగా ఆవరించింది. 

నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌ సైనిక శిక్షణా కేంద్రంలో జరగాల్సిన సదస్సులో పాల్గొనేందుకు భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్‌, లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ హర్జీందర్‌సింగ్‌, నాయక్‌ గుర్‌సేవక్‌సింగ్‌, నాయక్‌ జింతేదర్‌కుమార్‌, లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌, లాన్స్‌ నాయక్‌ బి.సాయితేజ, హవల్దార్‌ సత్పాల్‌, వారికి స్వాగతం పలికేందుకు వచ్చిన మరో నలుగురు బుధవారం మధ్యాహ్నం నంజప్పసత్రం వద్ద ఎంఐ17వీ5 హెలికాప్టర్‌ హెలికాప్టర్‌ కూలడంతో అసువులు బాసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాద ఘటన పట్ల యావద్దేశం దిగ్ర్భాంతి చెందగా, ఆ ఘటనకు గల కారణాలను కనుగొనేందుకు రకరకాల విభాగాలు, ఉన్నతాధికారులు, నేతలు అక్కడకు తరలివచ్చారు. 80 శాతం గాయాలతో మృత్యు ఒడి నుంచి తప్పించుకున్న హెలికాప్టర్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ను మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు తరలించారు.

అమరులైన వీరుల భౌతికకాయాలను వెల్లింగ్టన్‌ మిలటరీ ఆస్పత్రిలో వుంచి, గురువారం ఉదయం పూలు అలంకరించిన ప్రత్యేక వాహనంలో సైనిక శిక్షణా కేంద్రానికి తరలించారు. అక్కడ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర మంత్రులు కేఎన్‌ నెహ్రూ, స్వామినాథన్‌, రామచంద్రన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీజీపీ శైలేంద్రబాబు, ఐజీ సుధాకర్‌, వైమానిక దళపతి వీఆర్‌ చౌదరి తదితరులు అంజలి ఘటించారు. వెల్లింగ్టన్‌ సైనిక శిక్షణాకేంద్రంలో అమరుల పార్థివదేహాల వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాలళుర్పించారు. బుధవారం సాయంత్రమే వెల్లింగ్టన్‌ చేరుకున్న స్టాలిన్‌.. ఘటన గురించి అక్కడి సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పురమాయించారు. గురువారం ఉదయం నల్లకండువా ధరించిన స్టాలిన్‌, అమరులకు సెల్యూట్‌ చేశారు. నివాళుల కార్యక్రమం ముగిసిన తరువాత అమరుల పార్థివదేహాలను ప్రత్యేక అంబులెన్సులలో సూలూరు వైమానిక కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా సైనికశిక్షణా కేంద్రం దుఃఖంలో మునిగి పోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ కేంద్రంలో పనిచేసిన సహచరుల మృత దేహాలను, అదీ గుర్తు పట్టలేని స్థితిలో తరలించడాన్ని స్మరించుకుంటూ సైనికులు కుమిలికుమిలి ఏడ్చారు. మృతదేహాలతో అంబులెన్స్‌లు వెళ్తున్న సమయంలో రోడ్లకి రెండు వైపులా బారులు తీరిన ప్రజలు అమరులకు జయజయధ్వానాలు పలికారు. పలువురు కన్నీటిపర్యంతమవుతూ వీడ్కోలు పలికారు. అదేవిధంగా సూలూరు విమానాశ్రయం వద్దకు కూడా భారీగా తరలివచ్చిన ప్రజలు.. అమరులకు అంతిమ వీడ్కోలు పలికారు. 


నేడు నీలగిరి జిల్లాలో సంతాపం

హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరులైన వారికి సంతాప సూచకంగా నీలగిరి జిల్లా వ్యాప్తంగా దుకాణాలు మూసివేయాలని వ్యాపారులు నిర్ణయించారు. శుక్రవారం ఢిల్లీలో దివంగత సైనికాధికారులకు అంత్యక్రియలు నిర్వహించనుండటంతో వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకూ జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు అన్ని దుకాణాలను మూసివేయనున్నట్టు పేర్కొన్నారు. 



Updated Date - 2021-12-10T14:14:26+05:30 IST