నీరు-చెట్టు బిల్లులపై మరో మెలిక

ABN , First Publish Date - 2021-07-31T04:40:58+05:30 IST

ఆర్నెల్లు కాదు.. సంవత్సరం అంతకంటే కాదు.. రెండేళ్లకుపైగా నీరు-చెట్టు బిల్లులు చెల్లించడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు కావడంతో వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లులన్నీ పక్కన పెట్టేసింది.

నీరు-చెట్టు బిల్లులపై   మరో మెలిక

రెండేళ్ల క్రితం చేసిన పనులపై మళ్లీ విచారణ

అన్నిటినీ చెక్‌మెజర్‌మెంట్‌ చేయాలని ఉత్తర్వులు

రెగ్యులర్‌ ఈఈ వందశాతం, క్యూసీ ఈఈ యాభై శాతం పరిశీలించాలట!

విస్తుపోతున్న ఇరిగేషన్‌ శాఖ అధికారులు

బిల్లులు ఆపేందుకేనంటూ కాంట్రాక్టర్ల గగ్గోలు


నెల్లూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ఆర్నెల్లు కాదు.. సంవత్సరం అంతకంటే కాదు.. రెండేళ్లకుపైగా నీరు-చెట్టు బిల్లులు చెల్లించడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు కావడంతో వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లులన్నీ పక్కన పెట్టేసింది. గడిచిన రెండేళ్ల నుంచి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎన్ని విన్నపాలు చేసుకున్నా పట్టించుకోలేదు. పైగా ఈ పనులపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. కొన్నాళ్లు విచారణ జరిగి ఆ తర్వాత బిల్లుల చెల్లింపు జరగలేదు. ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో మరోమారు నీరు-చెట్టు పనులపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో విజిలెన్స్‌ విచారణ జరపగా ఇప్పుడు ఇరిగేషన్‌ శాఖ అధికారుల చేతనే పనులను పరిశీలించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీరు-చెట్టు పథకం కింద చేసిన పనులన్నీ వంద శాతం చెక్‌ మెజర్‌మెంట్‌ చేసేలా ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే బిల్లులు పెట్టేటప్పుడే చెక్‌ మెజర్‌మెంట్‌ చేశారుగా మళ్లీ ఇప్పుడేమిటి అంటే దానికి సమాధానం లేదు. సాధారణంగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు (ఈఈ) జరిగిన పనుల్లో 33 శాతం పనులకు నేరుగా చెక్‌మెజర్‌మెంట్‌ చేస్తారు. మిగతా పనులకు కింది స్థాయి అధికారులు చెక్‌మెజర్‌మెంట్‌ చేస్తారు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు కూడా పరిశీలిస్తారు. అయితే తాజా ఉత్తర్వులు ప్రకారం నీరు-చెట్టు కింద జరిగిన పనులను ఆయా డివిజన్లకు సంబంధించిన ఈఈలు వంద శాతం చెక్‌ మెజర్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. అలానే క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ కనీసం యాభై శాతం పనులకు చెక్‌ మెజర్‌మెంట్‌ చేయాలి. ఇది పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని జలవనరుల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. చెక్‌ మెజర్‌మెంట్‌ పూర్తి చేశాక నిబంధనల ప్రకారం పనులు జరిగాయని ఈఈలు సంతృప్తి చెందితేనే బిల్లులు చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం. 


అధికారుల్లోనే ఆశ్చర్యం


ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులపై జలవనరుల శాఖ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఎప్పుడూ లేని విధంగా అన్ని పనులకు ఈఈలు చెక్‌ మెజర్‌మెంట్‌ చేయాలంటే జరిగే పనేనా అని చర్చించుకుంటున్నారు. జిల్లాలో నీరు-చెట్టు కింద జరిగిన పనులకు సంబంధించి సుమారు రూ.200 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. ఇన్ని వర్కులను ఇటు రెగ్యులర్‌ ఈఈలు, అటు క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ పరిశీలించడం ఎలా సాధ్యమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎలాగైనా బిల్లులు చెల్లించకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై జలవనరుల శాఖ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ను వివరణ కోరగా నీరు-చెట్టు పనులకు సంబంధించి వంద శాతం చెక్‌ మెజర్‌మెంట్‌ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందిన మాట వాస్తవమేనని సమాధానమిచ్చారు. 

Updated Date - 2021-07-31T04:40:58+05:30 IST