పరిధి తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-06T07:43:42+05:30 IST

వితస్తా నదీ తీరంలో కర్దముడనే మహర్షి ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో ఎందరో శిష్యులు ఎన్నెన్నో విద్యలను నేర్చుకునేవారు. ఆ

పరిధి తెలుసుకోవాలి

వితస్తా నదీ తీరంలో కర్దముడనే మహర్షి ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో ఎందరో శిష్యులు ఎన్నెన్నో విద్యలను నేర్చుకునేవారు. ఆ విద్యలతో భుక్తిని పొందినవారు కొందరు. ముక్తిమార్గాన్ని పట్టినవారు కొందరు. అక్కడ లోకాన్వేషి, దేవాన్వేషి, బ్రహ్మాన్వేషి అని ముగ్గురు శిష్యులు ఉండేవారు. వారు వారి పేర్లకు తగిన విధంగా వరుసగా లోకాన్ని, దైవాన్ని, బ్రహ్మతత్త్వాన్ని అన్వేషించేవారు. లోకాన్వేషి మిగిలిన ఇద్దరినీ చూసి నవ్వుతుండేవాడు. చార్వాకం అంటే అతనికి చాలా ఇష్టం. చార్వాకం చారు వాక్యముల సముదాయం అనేవాడు. మనకు కనబడే ప్రపంచం కన్నా వేరేమీ సత్యం లేదనే వాడు.


రెండో వాడు.. ‘మనకు కనబడని ఆ దేవదేవుడు మహేశ్వరుడు ఈ జగత్తుకు ఆధారం’ అనే వాడు. ఆ కనబడే త్రిమూర్తులకు కూడా మూలం నిర్గుణ పరబ్రహ్మమే అని మూడో శిష్యుడు నిర్గుణ బ్రహ్మోపాసన చేస్తూ ఉండేవాడు. గురువు వారి అభిరుచులకు తగిన విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాడు. కాలం గడిచిన కొద్దీ లోకాన్వేషి ఎగతాళి మాటలు ఎక్కువ అవుతున్నాయి. ‘దేవుడు ఉంటే ఈ చెట్లూ, కొండలు, గుట్టలు, నదులు ఇవన్నీ కనబడినట్లు కనబడాలి కదా?’ అని అడిగేవాడు. ‘నిర్గుణ బ్రహ్మోపాసన అంటే శూన్యాన్ని ఉపాసించటమే కదా?’ అనేవాడు. ఈ మాటలు గురువు చెవిని పడ్డాయి.


ఒకరోజు ఆయన.. లోకాన్వేషిని తన ధ్యానకుటీరానికి పిలిచాడు. అతనిని ఆ విషయాలు, ఈ విషయాలు అడుగుతూ.. ‘‘మన తాళపత్ర గ్రంథాలయంలోని ‘శాస్త్రతత్త్వ రహస్య చంద్రిక’లో పదహారో పత్రంలో ఉన్న విషయం ఏమిటో వివరించు’’ అని ప్రశ్నించాడు. దానికి లోకాన్వేషి.. ‘‘గురువర్యా! నేను ఆ గ్రంథాన్ని ఎప్పుడూ చూడలేదు. కనుక మీరు చెప్పిన పత్రంలో విషయాన్ని ఎలా చెప్పగలను?’’ అని అన్నాడు. ‘‘ఆ గ్రంథశాలలోకి వెళ్లకుండా, ఆ విషయాన్ని చూడకుండా అది ఉందో లేదో చెప్పలేవు కదా?’’ అని కర్దముడు అడిగాడు. లోకాన్వేషి ఔనని తలూపాడు.


అప్పుడు గురువు.. ‘‘సరే. దగ్గరకు రా.’’ అని అతని తల పై తన కుడిచేతి బొటన వేలు అదిమిపెట్టి ఉంచాడు. కళ్లుమూసుకోగానే శిష్యుడు గ్రంథాలయంలో ఆ గ్రంథం దగ్గరకు చేరుకున్నాడు. అందులో తనకు కావాల్సిన పత్రాన్ని చదివాడు. తిరిగి చూసేసరికి గురువు దగ్గర ధ్యాన కుటీరంలో ఉన్నాడు. తాను భౌతికంగా కదలకుండానే గ్రంథాలయంలో ఆ గ్రంథాన్ని చూడగలగడం ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు గురువు అతడితో.. ‘‘ఎవరు ఏ పరిధిలో ఉంటే వారికి ఆ పరిధికి చెందిన జ్ఞానం లభిస్తుంది. నువ్వు ఆధిభౌతిక క్షేత్రంలో ఉండి ఆధిదైవిక అనుభవాన్ని, ఆధ్యాత్మికానుభవాన్ని పొందాలంటే కుదురుతుందా? అది సాధ్యం కావాలంటే మన దేహానికి సాధన అవసరం. ఈర్ష్యాసూయలకు అతీతంగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడు నీ హృదయం దేవతానిలయం అవుతుంది. దేవతానుగ్రహంతో నిర్గుణ పరబ్రహ్మ అనుభవమూ సాధ్యమవుతుంది. యోగం ద్వారా ఆధిదైవిక క్షేత్రంలోకి, ఆధ్యాత్మిక క్షేత్రంలోకి కూడా వెళ్లవచ్చు. 




నిన్ను నువ్వు పొగుడుకోకపోవడం, కపటం లేకపోవడం, అహింస, సరళత, ఇంద్రియ ఆకర్షణకు లోనుకాకపోవడం, దైవం పట్ల సడలని నమ్మకం, ఏకాంత స్థలంలో ఉపాసన వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు నీలో దైవీ శక్తి పెరుగుతుంది. మన అనుభవంలోకి రానంత మాత్రాన అది లేదు అనరాదు’’ అని చెప్పాడు. దీంతో, లోకాన్వేషికి కర్తవ్యం తెలిసి వచ్చింది. శిష్యులు ముగ్గురూ మంచి సాధకులుగా పేరు తెచ్చుకున్నారు.

-ఆచార్య రాణి సదాశివ మూర్తి


Updated Date - 2020-10-06T07:43:42+05:30 IST