పుత్ర బిక్ష పెట్టండి..!

ABN , First Publish Date - 2021-04-11T05:16:11+05:30 IST

అసలే పేద కుటుంబం. ఆపై ఒక డాక్టర్‌ చేసిన పొర బాటుకు కుమారుడి కిడ్నీ పాడైంది.

పుత్ర బిక్ష పెట్టండి..!

మా కుమారుడి రెండు కిడ్నీలు పాడయ్యాయి 

ఆపరేషన్‌కు పది లక్షలు అవసరం

దాతలు సాయం చేయాలంటూ తల్లిదండ్రుల వేడుకోలు


పాలకోడేరు, ఏప్రిల్‌ 10 : అసలే పేద కుటుంబం. ఆపై ఒక డాక్టర్‌ చేసిన పొర బాటుకు కుమారుడి కిడ్నీ పాడైంది. తర్వాత రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. ఇప్పుడు కిడ్నీ మార్పిడికి పది లక్షలు అవసరమైంది. డబ్బు లేక వైద్యం ఆగిపోయింది. పాలకోడేరు మండలం కుమదవల్లికి చెందిన కుమాండురి రంగనాథ్‌, భార్య పద్మజ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. 15 ఏళ్ల క్రితం వీరికి సత్యసాయిప్రభాకర్‌ జన్మించాడు. పుట్టుకతోనే యూరిన్‌ ట్రాక్‌కు ఇబ్బంది ఏర్పడడంతో ఓ వైద్యుడు శస్త్ర చికిత్స చేశాడు. ఏమైందో తెలియదు.. కొద్ది రోజులకే బాలుడికి కిడ్నీ పాడైంది. చిన్నప్పటి నుంచి అలాగే పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం రెండో కిడ్నీ కూడా పాడవడంతో ప్రభుత్వం ప్రోత్సాహంతో డయాలసిస్‌ చేయిస్తున్నారు. తనకున్న కొద్దిపాటి స్థలాలను, గేదెలను అమ్ముకుని వైద్యం చేయించారు. అదీ సరిపోకపోవడంతో స్నేహితుల సహాయంతో వైద్యమందిస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వం పది వేల రూపాయల చొప్పున అందించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. బాలుడు సాధారణ జీవితం గడపాలంటే కిడ్నీ మార్పు తప్పని సరని వైద్యులు చెబుతున్నారు. ‘ప్రభాకర్‌కు కిడ్నీ ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే పది లక్షలు అవసరం. ఇప్పటికే అన్ని అమ్ముకొని రూ.20 లక్షల వరకు ఖర్చు పెట్టాను. ఇప్పుడు వైద్యం చేయించలేని పరిస్థితి. కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ లభించినా ఆపరేషన్‌ కు అవసరమైన సొమ్ము కోసం ఎవరైనా సాయం చేస్తారని ఎదురుచూస్తున్నా. దాతలు సాయం చేసి మాకు పుత్ర బిక్ష పెట్టండి’ అంటూ తల్లిదండ్రులు, సోదరి రేఖ వేడుకుంటున్నారు. దాతలు ఈ నెంబరుకు 94410 94916కు కాల్‌చేసి ఆదుకోవాలని కోరారు.

Updated Date - 2021-04-11T05:16:11+05:30 IST