పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించాలి

ABN , First Publish Date - 2022-05-24T05:07:24+05:30 IST

పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించాలని

పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి

  • సమీక్షా సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి 


రంగారెడ్డి అర్బన్‌, మే 23 : పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంపై జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జూన్‌ 3వ తేది నుంచి 18వ తేది వరకు జరగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతిపాదించిన వైకుంఠధామాల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. వార్డుల వారీగా పట్టణ ప్రగతి జరగాలని, అందుకోసం ప్రత్యేకంగా వార్డుకు ఒక అధికారిని నియమించాలని తెలిపారు. వార్డుల్లో విరివిగా మొక్కలు నాటాలని, ఆట స్థలాలను గుర్తించి అభివృద్ధి చేయాలని తెలిపారు. అదేవిధంగా సమీకృత మార్కెట్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలన్నారు. నీటి సరఫరా పైపులైన్లు, అనంతరం రోడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని తెలిపారు. వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మాట్లాడుతూ 4వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గ్రౌండింగ్‌ చేయాలని వైకుంఠ ధామాలు పూర్తి చేయాలని, పబ్లిక్‌ టాయిలెట్లు వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. హరితహారంలో భాగంగా ప్రతి కాలనీలో అవెన్యూప్లాంటేషన్‌ పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, మున్సిపల్‌ అధికారులు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. 


’చెస్‌’లో ప్రతిభను చాటిన మంత్రి మనవడు

రాష్ట్రస్థాయి చెస్‌ టోర్నీలో ప్రతిభ చాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనువడు ఇంద్రారెడ్డి చాంపియన్‌గా నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన 35వ తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ అం డర్‌-9 ఓపెన్‌చె్‌స టోర్నీలో మంత్రి తనయుడు పి. కార్తీక్‌రెడ్డి కుమారుడు విజేతగా నిలిచాడు. ఆదివారం రాత్రి ఎల్బీనగర్‌ స్టేడియంలో జరిగిన పోటీల్లో 5 రౌండ్లలో దూకుడుగా ఆడి మెరుగైన ప్రదర్శనతో టైటిల్‌ కైవసం చేసుకున్నారు. మనువడిని మంత్రి సబితారెడ్డి అభినందించారు. కార్తీక్‌రెడ్డి కూడా ట్విటర్‌  ద్వారా తన కుమారుడిని విజయం పట్ల గర్వపడుతున్నట్లు తెలిపారు. 



Updated Date - 2022-05-24T05:07:24+05:30 IST