ఒక ఆశ కావాలి

ABN , First Publish Date - 2021-05-05T05:52:39+05:30 IST

మాకు ఊపిరి అందడం లేదు, చచ్చిపోతున్నాం, మాకో ప్రభుత్వం కావాలి, 2024 దాకా ఆగలేం, మీరిక తప్పుకోండి అంటూ ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నారు రచయిత్రి అరుంధతీరాయ్...

ఒక ఆశ కావాలి

మాకు ఊపిరి అందడం లేదు, చచ్చిపోతున్నాం, మాకో ప్రభుత్వం కావాలి, 2024 దాకా ఆగలేం, మీరిక తప్పుకోండి అంటూ ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నారు రచయిత్రి అరుంధతీరాయ్. ఈ పరిస్థితికి కారకులు మీరు, దీన్ని మీరు పరిష్కరించలేరు, మీ నిర్వాకం వల్ల ప్రపంచం దృష్టిలో మన దేశానికి ప్రమాదకారి ముద్రపడుతోంది. మీ అసమర్థత వల్ల ఇతర దేశాలకు మన దేశ విషయాల్లో కల్పించుకునే హక్కు వస్తోంది, ఇట్లా దేశ సార్వభౌమత్వానికే మీ కారణంగా ప్రమాదం వచ్చింది-.. అంటూ ఆమె చాలా ఆవేదనతో లేఖ రాశారు. అట్లాగని, బిజెపి భావజాలాన్ని, రాజకీయాలను వ్యతిరేకించే అరుంధతీరాయ్‌గా చేసిన అభ్యర్థన కాదు ఇది. ‘‘మీరు తప్పుకుంటే, మీ పార్టీలోనే, ఆర్‌ఎస్‌ఎస్ అనుమతించినవారే, మరెవరో బాధ్యతలు స్వీకరిస్తారు, రాష్ట్రాలతో సహా విస్తృత ప్రాతినిధ్యం ఉండే సంక్షోభ నివారణ కమిటీతో కొత్త నేత కలసి పనిచేస్తారు. కాంగ్రెస్ కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం తీసుకోవాలి-’’ అని ఆమె సూచించారు. వైఫల్యానికి, సంక్షోభానికి కారకుడిగా ఆమె ప్రధానమంత్రిని పరిగణించారు. మరెవరైనా పరవాలేదు, ఆయన స్థానంలోకి వచ్చి పరిస్థితిని చక్కదిద్దాలి అని ఆమె కోరుకుంటున్నారు.


అరుంధతీరాయ్ అన్నారని కాదు కానీ, కొవిడ్ రెండో దశలో దేశం ఎదుర్కొంటున్న పెను సంక్షోభానికి బాధ్యత తీసుకోవలసిన వ్యక్తిగా నరేంద్ర మోదీని గుర్తించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆయనపై అపరిమిత అభిమానం ఉన్నవాళ్లు, విపరీతమైన వ్యతిరేకత ఉన్నవాళ్లు వారి వారి వైఖరులను సడలించుకోకపోవచ్చును కానీ, పెద్ద తీవ్ర అభిప్రాయాలు లేనివారిలో అధికులు ఏడాది కిందటే మోదీపై ఆశగా, ఆరాధనగా చూశారు, ఈ గండాన్ని గట్టెక్కించగల సమర్థుడని నమ్మారు. వారికి ఆశాభంగం అనుభవంలోకి వస్తున్నది. అందుకే, గాలి మళ్లుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి నోరున్న సమూహాలు, నిపుణులు, మేధావులు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆశ్చర్యకరంగా, ప్రతిపక్ష రాజకీయవాదులని పిలుచుకునే ‘మచ్చిక పులులు’ కూడా గాండ్రింపులు సాధన చేస్తున్నాయి. పెగులుతున్న గొంతులను, రగులుతున్న అసహనాలను పట్టించుకుని తీరవలసిన పరిస్థితి ప్రభుత్వానికి వస్తే తప్ప, దావానలంలా దేశమంతా వ్యాపించిన చితిమంటలు చల్లారవు.


పధ్నాలుగు నెలల కిందట మొదలైన కరోనా వ్యాప్తి, దానితో పాటు వచ్చిన కట్టడులు కేంద్రప్రభుత్వానికి అనేక సానుకూలతలను సమకూర్చింది. పగిలిన పాదాలతో పసిపాపలతో కట్టుబట్టలతో కోట్లాదిమంది చేసిన పాదయాత్రలు కూడా ప్రభుత్వాలకు ఏ కనువిప్పూ అందించలేదు, రాజకీయ క్రీడలు, ఉద్యమాలపై వేటలు ఏవీ ఆగలేదు. రెండవసారి విరుచుకుపడిన వ్యాధి, భారత ప్రభుత్వపు హ్రస్వదృష్టిని, ప్రాధాన్యాలు తెలియని అల్పత్వాన్ని ఆవిష్కరిస్తే తప్ప, కుంభమేళాలు, బెంగాల్ ర్యాలీలూ నేతలను రోగకారకులుగా నిరూపిస్తే తప్ప, పెరిగిపోయిన హజం విరగడం మొదలుకాలేదు. ఇప్పుడిక, ప్రజాస్వామ్యానికి కొంచెం వెసులుబాటు తెచ్చుకోవాలి. పాలనపై ప్రశ్నలు సంధించాలి, కొవిడ్‌పై యుద్ధంలో పౌర సమాజమూ పాలుపంచుకోవాలి.


వ్యతిరేకత ముసురుకుంటోంది సరే, దానిని మూటగట్టుకోగలిగేది ఎవరు? తూర్పున మమత, దక్షిణాన స్టాలిన్, పినరాయి.. ఇట్లా కాదు, జాతీయ వైఫల్యాలకు గురిపెట్టి గొంతువిప్పేది ఎవరు? ఆశను ఒక కేతనంగా ఎగురవేసేది ఎవరు? బిజెపి ఎగుడుగీత చదునయిందని పత్రికలు శీర్షికలు పెట్టాయి కానీ, కాంగ్రెస్ దిగుడుగీత మరింతగా కునారిల్లిందని ప్రస్తావించను కూడా లేదు. గుర్తించక కాదు, ఆ మాత్రపు ప్రాధాన్యం కూడా అవసరం లేదనుకున్నాయేమో? కేరళలో పుదుచ్చేరిలో ఓడింది కాంగ్రెసే. తమిళనాడులో ప్రాధేయపడితే లభించిన పాతికసీట్లలో పద్దెనిమిది దక్కాయి. భాగస్వామి అనవచ్చునా, ఆరోవేలు అనాలా? బెంగాల్‌లో చిరునామా ఎక్కడ? దేశం దిక్కును మార్చిన ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఏది దిక్కు? మోదీ అవరోహణ మొదలైనదనుకున్నా, ఆరోహణ చేయవలసిన నాయకుడేడీ? కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ మధ్య చేసిన ప్రకటనలు, ప్రతిపాదనలు కొంత పరిపక్వతను ప్రతిఫలించాయి, ప్రజల ప్రశంసలను కూడా పొందాయి. కానీ, ఆయన రాజకీయమైన చొరవలో అతి నెమ్మదస్తుడు. బెంగాల్ అనుభవం చెబుతున్నదేమంటే, తెగింపుతో కూడిన చొరవే బలమైన కొండను ఢీకొట్టడానికి ఉపయోగపడుతుంది. ఇతరులను ప్రేరేపించగలుగుతుంది.


‍‍2024 ఎన్నికల గురించి నెమ్మదిగా ఆలోచించవచ్చును కానీ, దేశవ్యాప్త కోవిడ్ సంక్షోభ పరిష్కార సంఘటన ఒకటి ఏర్పడవలసిన అవసరం ఉన్నది. అరుంధతీరాయ్ లేఖలో వ్యక్తమైన సూచనే అది. మోదీ అనంతర బిజెపి ప్రధాని ఆధ్వర్యంలో సకలపక్షాలూ భాగంగా ఉండే కమిటీ గురించి ఆమె ప్రతిపాదించారు. అందులో అసాధ్యాలు, కష్టసాధ్యాలు ఉన్నాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వంతో, అధికార పక్షంతో ప్రమేయం లేకుండా ఒక ప్రజాసంఘటన కోవిడ్ సంక్షోభ పరిష్కారసాధనకు ఏర్పడవలసి ఉన్నది. అటువంటి చొరవ తీసుకోగలిగేవారికి భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనాలు కూడా లభించవచ్చు. ‍రాజకీయాన్ని పక్కనపెట్టి అయినా, ఒక స్వచ్ఛంద సామాజిక కార్యక్రమం తీసుకోవాలి. పరిస్థితిని కొద్దిగానైనా చేతిలో తీసుకుని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి, సమాజంలో భయాందోళనలను తొలగించే బాధ్యత తీసుకోగలిగే ప్రయత్నం ఒకటి జరగాలి. ఇది కేవలం వైద్య సదుపాయాల, చికిత్సల అందుబాటుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, నిరాశ నిండిన దేశంలో ఒక సానుకూల ఆశావహ భవితవ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయడం కొత్త ఊపిరులను ఊదుతుంది.

Updated Date - 2021-05-05T05:52:39+05:30 IST