నేడు మహాధర్నా

ABN , First Publish Date - 2022-01-24T05:30:00+05:30 IST

జిల్లా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపట్టేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు నిర్ణయించారు.

నేడు మహాధర్నా
మహాధర్నా సన్నాహక సమావేశంలో జిల్లా పీఆర్సీ సాధన సమితి నాయకులు

ప్రదర్శన అనంతరం కలెక్టరేట్‌ వద్ద నిర్వహణ

భారీగా తరలిరావాలని పీఆర్సీ సాధన సమితి పిలుపు 


నెల్లూరు (హరనాథఫురం), జనవరి 24 :  జిల్లా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపట్టేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు నిర్ణయించారు. ఈ ధర్నా కోసం ముందస్తు ఏర్పాట్లపై జిల్లా పీఆర్సీ సాధన సమితి నాయకులు సోమవారం సమావేశమయ్యారు. ఉదయం జరిగే మహాధర్నాకు భారీగా తరలిరావాలని నేతలు అల్లంపాటి పెంచలరెడ్డి, మన్నేపల్లి పెంచలరావు, ఏనుగ రమణారెడ్డి, చేజర్ల సుధాకర్‌రావు తదితరులు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులకు పిలుపునిచ్చారు. మహాధర్నాతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాలని నాయకులు అన్నారు. ఢిల్లీలో రైతు ఉద్యమం స్ఫూర్తిగా పీఆర్సీపై ఇచ్చిన చీకటి జీఓలను రద్దు చేయించుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కులను కాపాడుకుంటామని, భవిష్యత్తరాల కోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు ఈ ధర్నాకు ముందు పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నగరంలోని ఏబీఎం కాంపౌండ్‌ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వీఆర్సీ, మద్రాసు బస్టాండు మీదుగా కలెక్టరేట్‌కు చేరుకొంటుందని నాయకులు చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా  కార్యక్రమం నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. 


నాటి ఉద్యమ స్ఫూర్తితో..

ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన జిల్లాలో ఏ ఉద్యమం చేపట్టినా అది ఖండాంతర ఖ్యాతి గడిస్తోంది. ఇందుకు సారా ఉద్యమం, పొదుపు ఉద్యమాలే నిదర్శనం. తాజాగా ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమం కూడా అదే తరహాలో జిల్లాలో సాగనుంది.  రాష్ట్రంలో స్ట్రగుల్‌ కమిటీ నాయకులు జీఏడీ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌కుమార్‌కు సమ్మె నోటీసు ఇవ్వడంతో జిల్లాలో  ఉద్యోగ, ఉపాధ్యాయులు  తమదైన రీతిలో సమ్మె చేయటానికి నిర్ణయించారు. ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ హెచ్‌ఆర్‌ తగ్గింపు, సీసీఏ రద్దు, 70-75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీఓలపై  ఉద్యోగ, ఉపాధ్యాయులు రగిలి పోతున్నారు.  ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఎస్మా చట్టాలను ప్రయోగించినా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత ముందు ఆ చట్టాలు గడ్డి పరకలేనని భావిస్తామన్నారు. 


Updated Date - 2022-01-24T05:30:00+05:30 IST