ధరల వేడిలో ఆరిపోయిన ‘ఉజ్వల’... సిలెండర్‌ వద్దంటున్న లబ్ధిదారులు!

ABN , First Publish Date - 2021-03-06T13:26:04+05:30 IST

కట్టెల పొయ్యి పొగనుంచి మహిళలకు విముక్తి కల్పించేందుకు...

ధరల వేడిలో ఆరిపోయిన ‘ఉజ్వల’... సిలెండర్‌ వద్దంటున్న లబ్ధిదారులు!

జైపూర్: కట్టెల పొయ్యి పొగనుంచి మహిళలకు విముక్తి కల్పించేందుకు ‘ఉజ్వల’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే గ్యాస్ సిలెండర్ ధర పెరగడంతో ప్రజల కష్టాలు కూడా పెరిగాయి. పేద కుటుంబాలకు ఉచితంగా సిలిండర్ అందించినా, గ్యాస్ ధర పెరగడంతో వారు రీఫిల్ చేయించుకోలేకపోతున్నారు. అలాగే సబ్సిడీ ఎత్తివేసిన తరువాత ఉజ్వల యోజన ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 30 నుంచి 35 శాతం మంది సిలిండర్ రీఫిల్ చేయించుకోవడం లేదు. 


రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మాయరా అనే మహిళ ఉజ్వల ఫథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు మాయరాతోపాటు ఆమె కుమార్తె కూడా కట్టెల పొయ్యి దగ్గర ఊదుతూ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబం అంతా కష్టపడితే నెలకు వారికి నాలుగువేల రూపాయల ఆదాయం వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో వారు రూ. 823 వెచ్చించి గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేయించుకోలేమని చెబుతున్నారు. ఈ మొత్తంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని అంటున్నారు. తమకు కట్టెల పొయ్యి ముందు అవస్థలను పడటం ఏమాత్రం ఇష్టం లేదని, అయితే ఇది తప్ప మరో మార్గం లేదని వారు వాపోతున్నారు. ఇదేవిధమైన పరిస్థితిలో ఉన్న  మరో మహిళ మాట్లాడుతూ గతంలో సిలెండర్ ధర రూ. 400 ఉండేదని, ఇప్పుడు రూ. 850కి దగ్గరగా ఉందని, అంత డబ్బు తమ దగ్గర లేదని ఆమె వాపోయింది. 

Updated Date - 2021-03-06T13:26:04+05:30 IST