ఇంటర్నెట్ డెస్క్: కాలిఫోర్నియా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రేగిన కార్చిచ్చును ఆర్పేందుకు 10 వేల మంది అగ్నిమాపక సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ఫాన్ ఫైర్ కారణంగా 2 వేల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. బే ఏరియా ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ కార్చిచ్చు రాజేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా.. సెకోయియా నేషనల్ పార్క్‌లో చెలరేగుతున్న అగ్నీకీలల కారణంగా అనేక వృక్షాలు బూడిదైపోయే అవకాశం కనిపిస్తోంది. అత్యంత పొడవైనవిగా రికార్డుల్లోకెక్కిన చెట్లు ప్రమాదంలో పడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు..అక్కడి గాలుల తీవ్రత తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాల నడుము ఎయిర్ క్రాఫ్ట్‌ల సాయంతో అగ్నిని ఆర్పే అవకాశం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.