Zomato వ్యాల్యూయేషన్ 2 రోజుల్లో 1 బిలియన్ డాలర్లు క్షీణత

ABN , First Publish Date - 2022-06-28T21:36:03+05:30 IST

గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘బ్లింకిట్’(Blinkit) కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో జొమాటో(Zomato) షేర్ల విలువ వరుసగా రెండవ రోజు మంగళవారం కూడా భారీగా పతనమైంది.

Zomato వ్యాల్యూయేషన్ 2 రోజుల్లో 1 బిలియన్ డాలర్లు క్షీణత

బెంగళూరు : గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘బ్లింకిట్’(Blinkit) కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో జొమాటో(Zomato) షేర్ల విలువ వరుసగా రెండవ రోజు మంగళవారం కూడా భారీగా పతనమైంది. zomato షేర్ విలువ మంగళవారం సెషన్‌లో 8 శాతానికిపైగానే దిగజారింది. లోకల్‌గా కార్యకలాపాలు నిర్వహించే ‘బ్లింకిట్’ను ఎందుకు కొనుగోలు చేశారంటూ ఇన్వెస్టర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావంతో షేర్ల విలువ పతనం కొనసాగుతోంది. బ్లింకిట్ కొనుగోలు ఒప్పంద ప్రకటన చేసిన నాటి నుంచి జొమాటో షేర్లు 14 శాతానికిపైగానే క్షీణించాయి. దీంతో జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్(Market Capitalisation) సుమారు 1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.7,800 కోట్లు) మేర తరిగిపోయింది. గతేడాది జులైలో లిస్టింగ్ నాటి నుంచి ఇప్పటివరకు 48 శాతం మేర నష్టపోయినట్టయ్యింది.


యాంట్ గ్రూప్ సారధ్యంలోని జొమాటో గత శుక్రవారం కీలక ప్రకటన చేసింది. రూ.4,447 కోట్లు(568.16 మిలియన్ డాలర్లు)తో బ్లింకిట్‌ కొనుగోలుకు ఒప్పందం కుదురిందని వెల్లడించింది. స్టాక్స్ రూపంలో ఈ డీల్‌ని పూర్తి చేయనున్నట్టు పేర్కొంది. ‘క్విక్ డెలివరీ మార్కెట్‌’లో అడుగుపెట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈ డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపింది. కాగా క్విక్ డెలివరీ మార్కెట్‌లో రాణించాలనుకుంటున్న జొమాటో.. బ్లింకిట్‌లో దాదాపు 400 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అనలిస్టులు విశ్లేషించారు. 


కాగా దేశంలో క్విక్-కామర్స్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రత్యర్థులు స్విగ్గీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ సారధ్యంలోని డంజో, టాటా నేతృత్వంలోని బిగ్‌బాస్కెట్, జొప్టో సంస్థలు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. కాగా రెడ్‌సీర్ సంస్థ అధ్యయనం ప్రకారం... క్విక్ డెలివరీ మార్కెట్ విలువ భారత్‌లో గతేడాది 300 మిలియన్ డాలర్లు ఉండగా.. 2025 నాటికి ఈ వ్యాల్యూ 10-15 రెట్లు పెరుగుతుందనేది అంచనాగా ఉంది.

Updated Date - 2022-06-28T21:36:03+05:30 IST