మెట్‌ఫార్మిన్‌ టాబ్లెట్లలో ఎన్‌డీఎంఏ వ్యర్థాలు

ABN , First Publish Date - 2020-05-31T06:38:58+05:30 IST

మధుమేహ రోగులు వినియోగించే మెట్‌ఫార్మిన్‌ ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ (ఈఆర్‌) టాబ్లెట్లలో నైట్రోసోడిమిథిలామైన్‌ (ఎన్‌డీఎంఏ) వ్యర్థ పదార్థం ఉండాల్సిన స్థాయి కంటే అధికంగా ఉందని అమెరికా...

మెట్‌ఫార్మిన్‌ టాబ్లెట్లలో ఎన్‌డీఎంఏ వ్యర్థాలు

  • నమూనాల్లో గుర్తించిన యూఎస్‌ ఎఫ్‌డీఏ
  • వెనక్కు తీసుకోవాలని కంపెనీలకు సూచన 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మధుమేహ రోగులు వినియోగించే మెట్‌ఫార్మిన్‌ ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ (ఈఆర్‌) టాబ్లెట్లలో  నైట్రోసోడిమిథిలామైన్‌ (ఎన్‌డీఎంఏ) వ్యర్థ పదార్థం ఉండాల్సిన స్థాయి కంటే అధికంగా ఉందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎ్‌సఎ్‌ఫడీఏ) ప్రకటించింది. యూఎ్‌సఎ్‌ఫడీఏ లేబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో కొన్ని లాట్లలోని మెట్‌ఫార్మిన్‌ ఈఆర్‌ ఔషధాల్లో నిర్ధిష్ట స్థాయిలకు మించి ఎన్‌డీఎంఏ ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది. టైప్‌-2 మధుమేహంతో బాధపడే వారు మెట్‌ఫార్మిన్‌ ఔషధాన్ని వినియోగిస్తారు. వ్యర్థాలు కలిగిన ఈ టాబ్లెట్లను స్వచ్ఛందంగా వెనక్కి రప్పించాలని ఐదు ఔషధ కంపెనీలను ఎఫ్‌డీఏ కోరింది. గత కొద్ది నెలలుగా మెట్‌ఫార్మిన్‌లో ఎన్‌డీఎంఏ మలినాల స్థాయిని తగిన పరీక్షల ద్వారా తెలుసుకోవాలని ఈ ఔషధాన్ని సరఫరా చేస్తున్న కంపెనీలను కోరుతోంది. ఒకవేళ కంపెనీలు మెట్‌ఫార్మిన్‌ టాబ్లెట్లను వెనక్కి రప్పిస్తే రోగులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు కూడా ఆయా సంస్థలతో ఎఫ్‌డీఏ చర్చలు జరుపుతోంది. ఎన్‌డీఎంఏ వ్యర్థాలు కేన్సర్‌కు దారితీసే అవకాశం ఉండటంతో ఈ టాబ్లెట్లలో మోతాదుకు మించి మలినాలు ఉండడానికి గల కారణాలను తెలుసుకోవాలని సదరు కంపెనీలకు సూచించింది. ఫినిష్డ్‌ డోసేజీ ఈఆర్‌ టాబ్లెట్లలో మాత్రమే అధిక మోతాదుల్లో ఎన్‌డీఎంఏ వ్యర్థాలు ఉన్నాయని.. మెట్‌ఫార్మిన్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్ల (ఏపీఐ) నమూనాల్లో స్థాయికి మించి ఎన్‌డీఎంఏ లేదని ఎఫ్‌డీఏ వివరించింది.  


గత ఏడాది చివర్లో : ఇతర దేశాల్లోని మెట్‌ఫార్మిన్‌ ఔషధాల్లో ఎన్‌డీఎంఏ వ్యర్థాలు వస్తున్నట్లు గుర్తించిన ఎఫ్‌డీఏ 2019 చివరి నుంచే అప్రమత్తంగా వ్యవహరించింది. అమెరికాకు సరఫరా అవుతున్న మెట్‌ఫార్మిన్‌ ఔషధంలో ఈ వ్యర్థా ల స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. 2020 ఫిబ్రవరిలో కొన్ని నమూనాల్లో తక్కువ మోతాదుల్లోనే ఎన్‌డీఎంఏ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించింది. అయితే.. పరీక్షలను కొనసాగించింది. 


తయారీలో హైదరాబాద్‌ కంపెనీలు: హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్‌, అరబిందో ఫార్మా తదితర కంపెనీలు మెట్‌ఫార్మిన్‌ ఔషధాన్ని తయారు చేస్తున్నాయి. గ్రాన్యూల్స్‌ ఇండియా విక్రయాల్లో అధిక భాగం మెట్‌ఫార్మిన్‌, దానికి సంబంధించిన ఉత్పత్తులే ఉంటాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గ్రాన్యూల్స్‌ దాదాపు 70 శాతం వరకూ మెట్‌ఫార్మిన్‌ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. కంపెనీకి చెందిన ఏపీఐ, ఫినిష్డ్‌ డోసేజీ ట్యాబ్లెట్ల నమూనాల్లో ఎన్‌డీఎంఏ మోతాదును ఎఫ్‌డీఏ పరీక్షించిందని, కంపెనీకి చెందిన ఔషధాల్లో ఎటువంటి ఎండీఎంఏ వ్యర్థ పదార్థాలు లేవని వెల్లడైందని గ్రాన్యూల్స్‌ ఇండియా పేర్కొంది. అరబిందో ఫార్మా, సన్‌ ఫార్మా, లూపిన్‌, హెరిటేజ్‌ ఫార్మా సహా మరికొన్ని సంస్థలు కూడా మెట్‌ఫార్మిన్‌ ఔషధాన్ని తయారు చేస్తున్నాయి.

Updated Date - 2020-05-31T06:38:58+05:30 IST