అమెరికాలో NRIల ఇక్కట్లు.. కొందరు ఉద్యోగాలు కోల్పోతే.. మరికొందరికి వేతనాలు అందక అవస్థలు..

ABN , First Publish Date - 2022-07-09T00:57:21+05:30 IST

వివిధ రకాల అమెరికా వీసాల జారీలో జరుగుతున్న ఆలస్యం అక్కడి భారతీయ కుటుంబాలను ఇక్కట్ల పాలు చేస్తోంది.

అమెరికాలో NRIల ఇక్కట్లు.. కొందరు ఉద్యోగాలు కోల్పోతే.. మరికొందరికి వేతనాలు అందక అవస్థలు..

ఎన్నారై డెస్క్: వివిధ రకాల అమెరికా వీసాల జారీలో జరుగుతున్న ఆలస్యం అక్కడి భారతీయ కుటుంబాలను ఇక్కట్ల పాలు చేస్తోంది. ముఖ్యంగా.. వర్క్ పర్మిట్లపై ఆధారపడ్డ అనేక మంది ఎన్నారైలు  ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో జీతాలు అందక కొందరు అవస్థల పాలవుతుంటే మరికొందరు ఏకంగా ఉద్యోగాలే కోల్పోయి లబోదిబోమంటున్నారు. H-1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న భారతీయుల జీవిత భాగస్వాములు..  H-4 EAD(ఎంప్లాయిమెంట్ ఆథొరైజేషన్ డాక్యుమెంట్)ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్క్‌ పర్మిట్ ఉన్న H-4 వీసాదారులు మాత్రమే అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంది. 


ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. H-4వీసా దారులు, H-4 EAD వర్క్ పర్మిట్ ఉన్నవారు.. వాటిని రెన్యూవల్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ సదుపాయం ఉన్న దరఖాస్తు కేంద్రాలకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది. కరోనా సంక్షోభం కారణంగా మార్చి 2020లో ఈ కేంద్రాలను నాలుగు నెలల పాటు మూసేశారు. ఆ తరువాత వాటిని పునఃప్రారంభించినా.. కార్యాలయాల్లోని సిబ్బంది పరిమిత సంఖ్యలోనే ఉండటంతో వీసాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం.. వర్క్ పర్మిట్‌ల కాలవ్యవధిని తాత్కాలికంగా పొడిగించినా అది కొందరికే ఉపయోగపడిందని అమెరికాలో వలస చట్టాల లాయర్లు చెబుతున్నారు.  


H-EAD వర్క్‌ పర్మిట్ కాలపరిమితి దాటిని H-4 వీసాదారులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని వారు అంటున్నారు. కొత్తగా H-EAD కోసం దరఖాస్తు చేసుకునే వారు, H-4 వీసా పొడిగింపు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న వారికి ఈ సౌలభ్యం లేక అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు.  H-4, H-4 EAD పొడిగింపు కోసం కొందరు ఎన్నారైలు ఆరు నెలల నుంచి వేచి చూస్తున్నారు. ఈ జాప్యం కారణంగా కొందరు తమ ఉద్యోగాలు కోల్పోతే మరికొందరు ఆరోగ్య బీమాకు దూరమయ్యారు. వేతనాలతో కూడి ప్రసూతి సెలవులు కూడా కొందరికి రావట్లేదని, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు మరికొందరికి ఎదురు చూపులు తప్పడం లేదని అక్కడి లాయర్లు అంటున్నారు. ఈ పరిస్థితి కారణంగా అనేక భారతీయ కుటుంబాల(Indian families) ఆదాయం సగానికి సగం పడిపోయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. 

Updated Date - 2022-07-09T00:57:21+05:30 IST