పాశ్వాన్ స్థానంలో రాజ్యసభకు బీజేపీ అభ్యర్థి..?

ABN , First Publish Date - 2020-11-25T22:40:13+05:30 IST

ఎల్‌జేపీ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతితో బీహార్ నుంచి రాజ్యసభకు ఏర్పడిన..

పాశ్వాన్ స్థానంలో రాజ్యసభకు బీజేపీ అభ్యర్థి..?

పాట్నా: ఎల్‌జేపీ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతితో బీహార్ నుంచి రాజ్యసభకు ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు బీహార్‌లోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఎన్డీయే తరఫున బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్టు చెబుతున్నారు. రాజ్యసభలో పాశ్వాన్ పదవీకాలం 2024 ఏప్రిల్ 2 వరకూ ఉంది. అంటే, కొత్తగా రాజ్యసభకు వెళ్లే వ్యక్తికి దాదాపు నాలుగేళ్లు ఆ పదవిలో ఉంటారు.


కాగా, బీజేపీతో చివరి వరకూ ఉన్న రాంవిలాస్ పాశ్వాన్‌ స్థానంలో తన తల్లి రీనా పాశ్వాన్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలనేది కేంద్రంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ అభిప్రాయంగా ఉంది. అదే తన తండ్రికి ఇచ్చే నివాళి అవుతుందని చిరాగ్ అభిప్రాయపడుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ను టార్గెట్‌గా చేసుకుని సొంతంగా ఎల్‌జేపీ బరిలోకి దిగింది. జేడీయూ ఓట్లను చీల్చడంలో ఆ పార్టీ కొంతమేర సఫలం కావడంతో జేడీయూ 43 సీట్లు మాత్రమే గెలుచుకుంది.


ఎల్జేపీ నామినేషన్ విషయంలో ఇప్పటికే జేడీయూ అధినాయకత్వం బీజేపీ వద్ద తమ వాదన వినిపించిందని తెలుస్తోంది. ఎల్జేపీ అభ్యర్థిని జేడీయూ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించే అవకాశం లేదని, అందుకు కారణాలు ఉన్నాయని, ఆ మాటకే  తమ పార్టీ కట్టుబడుతుందని జేడీయూ సీనియర్ నేత ఒకరు తెలిపారు.


జేడీయూ ప్రాధాన్యం తెలియంది కాదు..

ఎన్డీయేలో జేడీయూ ప్రాధాన్యం గురించి బీజేపీకి తెలియనిది కాదు. గత మార్చిలో బీహార్‌లో ఖాళీ అయిన 5 రాజ్యసభ స్థానాల్లో జేడీయూ రెండు సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో తమ అభ్యర్థిని ఈసారి జేడీయూ బరిలోకి దింపే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. ఇక, బీజేపీ సైతం ఎల్‌జేపీకి సీటు ఇచ్చే మూడ్‌లో లేదని చెబుతున్నారు. రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభకు ఎన్నికయ్యేంత వరకూ ఆ సీటు తమదేనని బీజేపీ అభిప్రాయంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో అనుకున్న ఫార్ములా ప్రకారమే తమ సీటును రామ్ విలాస్ పాశ్వాన్‌కు ఇచ్చామని, ఎన్డీయే నేతలందరిపైనా ఆయనకు మంచి గౌరవం ఉన్నందునే ఆయనకు ఆ సీటు ఇచ్చామని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.


ఇక...ఎల్జీపీ  క్యాంపునకు కూడా తమ హద్దులేమిటో తెలుసు. 'అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ నిర్ణయానికే వదిలిపెడుతున్నాం. కేంద్రంలో బీజేపీతోనే తాము ఉంటామని ఎల్జేపీ పదేపదే చెబుతూనే ఉంది' అని ఎల్జేపీ నేత ఒకరు పేర్కొన్నారు.


బీజేపీ నుంచి ప్రముఖంగా రెండు పేర్లు...

కాగా, బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పలువురు పేర్లు వినిపిస్తున్నా, ముఖ్యంగా రెండు పేర్లు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. వీటిలో కేంద్ర మాజీ మంత్రి షాన్‌వాజ్ హుస్సేన్ ఒకరు కాగా, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ రెండవవారు. ఈసారి నితీష్ కేబినెట్‌లో సుశీల్ కుమార్ మోదీకి చోటు కల్పించకపోవడాన్ని బట్టి ఆయనను రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వాదన ఉంది. తన అభ్యర్థిత్వం గురించి ఆయన కూడా ఆచితూచే స్పందిస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది తనకు తెలియదని చెబుతున్నారు. అలాగే, షాన్‌వాజ్ హుస్సేన్ కూడా రాజ్యసభ సీటు కోసం చాలాకాలంగా వేచి చూస్తున్నారు.


గెలపు ఎన్డీయేకు నల్లేరుమీద నడకే...

ఎన్డీయేకు 126 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున రాజ్యసభ సీటు గెలుచుకునేదంకు అవసరమైన 122 మంది బలం ఆ కూటమికి ఉంది. 17వ అసెంబ్లీ తొలి సమావేశం శుక్రవారంతో పూర్తి కాబోతోంది. ఆ తర్వాతే రాజ్యసభకు ఎన్డీయే తరఫున ఎవరిని అభ్యర్థిగా దింపుతారనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.


మహాకూటమి అభ్యర్థి కూడా బరిలో?

అసెంబ్లీ ఎన్నికల్లో తమ సొంత అభ్యర్థితో తలబడిన ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి కూడా రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాన్ని కొట్టిపారేయలేం. మహాకూటమి అభ్యర్థి బరిలోకి దిగితే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలూ ఉండొచ్చు, అదే జరిగితే అధికార ఎన్డీయేకు చిక్కులు ఎదురు కావచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.

Updated Date - 2020-11-25T22:40:13+05:30 IST