Breaking: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.. ఎవరంటే..

ABN , First Publish Date - 2022-07-17T01:37:19+05:30 IST

ఎన్డీయే ఉపరాష్ట్రతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ పేరును బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరిగిన అనంతరం..

Breaking: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.. ఎవరంటే..

న్యూఢిల్లీ: ఎన్డీయే ఉపరాష్ట్రతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ పేరును బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరిగిన అనంతరం ఆయన పేరును నడ్డా వెల్లడించారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్‌, గడ్కరీ, తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరపున బరిలో నిలిచిన జగదీప్ ధన్‌కర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు. బుధవారం నాడు బీజేపీ కీలన నేత అమిత్ షాతో ధన్‌కర్ భేటీ అయ్యారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ధన్‌కర్ పేరును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించడం గమనార్హం.



పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతకు, జగదీప్ ధన్‌కర్‌కు మధ్య పొసగడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. 2019 జులైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న ధన్‌కర్ చాలా అంశాల్లో మమతతో విభేదించారు. బాహాటంగానే ఆమె విధానాలపై నిరసన తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం ఆత్మ ధ్వంసమవుతోందని తాజాగా కూడా ధన్‌కర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల రాజకీయ కార్యకలాపాలకు రాష్ట్రంలో స్థానం లభించడం లేదని ఆరోపించారు. దీనివల్ల సమాజంలో తీవ్రమైన అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను ప్రకటించినప్పటికీ నామినేషన్ ఎప్పుడనే విషయంలో నడ్డా స్పష్టత ఇవ్వలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ గడువు జులై 19వ తేదీ కావడం గమనార్హం.



ఆసక్తికర విషయం ఏంటంటే.. ఉప రాష్ట్రపతిగా ధన్‌కర్‌ ఒకవేళ ఎన్నికైతే రాజ్యసభకు చైర్మన్‌గా కూడా ఆయనే వ్యవహరిస్తారు. గత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించిన వెంకయ్య నాయుడు 12 మంది విపక్ష ఎంపీల ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వేటు వేశారు. జగదీప్ ధన్‌కర్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఈ ఎంపీల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రైతు బిడ్డ అయిన జగదీప్ ధన్‌కర్‌ మానవత్వానికి ప్రతీక లాంటి వారని, రైతుల కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను ప్రకటించడం గర్వంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఆగస్ట్ 10న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తారు.

Updated Date - 2022-07-17T01:37:19+05:30 IST