నితీశ్‌కు రాష్ట్రపతి పదవి... ఎన్‌సీపీ మెలిక...

ABN , First Publish Date - 2022-02-23T00:27:51+05:30 IST

మరికొద్ది నెలల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండటంతో

నితీశ్‌కు రాష్ట్రపతి పదవి... ఎన్‌సీపీ మెలిక...

ముంబై : మరికొద్ది నెలల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండటంతో ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరనే చర్చ ప్రారంభమైంది. ఎన్‌సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థిని వివిధ పార్టీల నేతలంతా సమష్టిగా నిర్ణయిస్తారని చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలంటే ముందుగా బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకోవాలని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతింటుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో 403 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయని, వీటిలో కేవలం 150 కన్నా తక్కువ స్థానాలు మాత్రమే బీజేపీకి లభిస్తాయని చెప్పారు. 


2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మహా వికాస్ అగాఢీ నేతలను కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి నాయకత్వంలో ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అయితే కాంగ్రెస్ లేకుండా ఇటువంటి ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. 


బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థి కాబోతున్నారని వార్తా కథనాలు వస్తున్న విషయాన్ని విలేకర్లు ప్రస్తావించినపుడు నవాబ్ మాలిక్ స్పందిస్తూ, బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకునే వరకు దీనిపై చర్చ సాధ్యం కాదన్నారు. మొదట ఆయన బీజేపీతో సంబంధాలను తెంచుకోవాలని, అప్పుడే ఆయన అభ్యర్థిత్వంపై అన్ని ప్రతిపక్షాల నేతలు ఆలోచించడం సాధ్యమవుతుందని చెప్పారు. 


బిహార్‌లో ప్రస్తుతం బీజేపీ, జేడీయూ కూటమి ప్రభుత్వం ఉందనే సంగతి తెలిసిందే.


Updated Date - 2022-02-23T00:27:51+05:30 IST