ఏర్పడాల్సింది బీజేపీ - శివసేన ప్రభుత్వమే : సంచలన విషయాలను వెల్లడించిన ఎన్సీపీ

ABN , First Publish Date - 2020-05-30T22:28:40+05:30 IST

న్ని విషయాలు తెర వెనుక ఉంచడానికే ఇష్టపడాలని, ఎందుకంటే అందులో దాచాల్సింది ఏదో ఉందని ఆయన

ఏర్పడాల్సింది బీజేపీ - శివసేన ప్రభుత్వమే : సంచలన విషయాలను వెల్లడించిన ఎన్సీపీ

ముంబై : ముంబైలో ప్రభుత్వం ఏర్పాటైన తీరుపై ఎన్సీపీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ - శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పడాల్సిందని, ఎందుకంటే ఆ కూటమికే అత్యధిక మెజారిటీ వచ్చిందని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మ్యాజిక్ ఫిగర్ తమ వద్ద లేదని, అందుకే తాము ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందని ప్రకటించారు.


అయితే బీజేపీ - శివసేన మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయని, అవి చాలా రోజుల పాటు నడిచాయని ఆయన తెలిపారు. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ఇరువురూ భేటీ అయి, చర్చించుకున్నారని ఆయన పేర్కొన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, మీరే మా వెంట వచ్చేయండంటూ ఫడణ్‌వీస్ ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌కు ఆఫర్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇదే రకమైన సంభాషణ వారిద్దరి మధ్యా జరిగిందని ఆయన తేల్చి చెప్పారు.


ఆ సమయంలో తమవద్ద సరైన సంఖ్యా బలంలేదని, అందుకే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో లేమని, అయితే బీజేపీ, శివసేన మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, అందులో ఎన్సీపీ పాత్ర లేశమాత్రమైనా లేదని స్పష్టం చేశారు. అయితే దేవేంద్ర ఫడణ్‌వీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్  పవార్ వెళ్లడంపై కూడా ఆయన స్పందించారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం కావచ్చని, లేదా బహుశ: తప్పుడు నిర్ణయం కూడా తీసుకున్నారేమోనని ఆయన కుండబద్దలు కొట్టారు.


అయితే అజిత్ పవార్ మాత్రం ఓ ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదని తేల్చి చెప్పారు. కొన్ని విషయాలు తెర వెనుక ఉంచడానికే ఇష్టపడాలని, ఎందుకంటే అందులో దాచాల్సింది ఏదో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ గడిచిందేదో గడిచిపోయిందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడటం అంత శ్రేయస్కరం కాదన్నారు. ఈ తతంగం అంతా గడిచిన తర్వాత అజిత్ పవార్ తమకు ఓ వివరణ కూడా ఇచ్చారని.... ‘‘ఎన్సీపీని ఇరకాటంలోకి నెట్టేయడం అన్నది తన అభిమతం కాదు’ అని అజిత్ పవార్ వివరణ ఇచ్చారని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. 

Updated Date - 2020-05-30T22:28:40+05:30 IST