ఆర్యన్‌ ఖాన్‌కు భగవద్గీత, ఖురాన్‌‌తో కౌన్సిలింగ్

ABN , First Publish Date - 2021-10-19T17:50:37+05:30 IST

మాదకద్రవ్యాల కేసులో ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంటూ బెయిల్‌ కోసం ఎదురుచూస్తున్న..

ఆర్యన్‌ ఖాన్‌కు భగవద్గీత, ఖురాన్‌‌తో కౌన్సిలింగ్

ముంబై: మాదకద్రవ్యాల కేసులో ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంటూ బెయిల్‌ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ హీరో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్, ఇతరులకు నార్కోటిక్స్ కండ్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువత భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో, వారి కుటుంబంపై ఎలాంటి ప్రభావం పడుతుందో, వాటికి దూరంగా ఉండేందుకు ఏమి చేయాలో వివరిస్తున్నారు. ఇందుకోసం పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్‌‌ బోధలను సాయం తీసుకుంటున్నారు. ఇస్కాన్ ఆలయ పూజారులు, మత పెద్దలతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.


కాగా, ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆర్యన్ ఖాన్, ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయింది. తీర్పును ఈనెల 20వ తేదీకి కోర్టు రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ పాత్రపై ప్రత్యేక కోర్టులో ఎన్‌సీబీ తన వాదనలు వినిపించింది. ఆర్బాజ్ ఖాన్ నుంచి మాదకద్రవ్యాలను ఆర్యన్ సేకరించినట్టు పేర్కొంది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు ముందు తమ వాదన వినిపించారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసును పరిశీలించినప్పుడు అసలు స్కీమ్ లక్ష్యం, నియమనిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాల ప్రభావం దేశంపైన పడుతుందన్నారు. ఎన్‌సీబీ రాత్రింబవళ్లు డ్రగ్స్ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని పనిచేస్తోందన్నారు. కొద్దిరోజుల క్రితం ఒక కేసులో తమ సీనియర్ అధికారులను నలుగురైదుగురిని చితకబాదారని, మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం సమాజంపైన, ముఖ్యంగా యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అన్నారు. మహాత్మాగాంధీ పుట్టిన గడ్డపై మాదక ద్రవ్యాల బెడద లేకుండా చూడాలని, కుట్రకోణం నుంచి ఈ కేసును పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపింది.

Updated Date - 2021-10-19T17:50:37+05:30 IST