క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు ఎన్‌సీబీ అధికారుల సస్పెన్షన్

ABN , First Publish Date - 2022-04-14T02:05:27+05:30 IST

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడైన ఆర్యన్ ఖాన్‌తో సహా పలువురిని..

క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు ఎన్‌సీబీ అధికారుల సస్పెన్షన్

ముంబై: బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడైన ఆర్యన్ ఖాన్‌తో సహా పలువురిని చిక్కుల్లో నెట్టిన క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు దర్యాప్తు అధికారులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బుధవారంనాడు సస్పెండ్ చేసింది. విజిలెన్స్ ఎంక్వయిరీ అనంతరం ఎన్‌సీబీ అధికారులైన విశ్వ విజయ్ సింగ్, ఆశిష్ రంజన్ ప్రసాద్‌లను సస్పెండ్ చేసినట్టు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరు అధికారులు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడమమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో సింగ్ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా పనిచేయగా, ఆయనకు డిప్యూటీగా ప్రసాద్ వ్యవహరించాడు. అయితే, వీరి సస్పెన్షన్‌కు ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది కానీ, క్రూయిజ్ డ్రగ్స్ కేసులో వీరి పాత్ర ఏమిటనేది కానీ ఇంకా తెలియలేదు.


క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో సహా ఐదు కేసులను ఇటీవల ఎన్‌సీబీ సిట్‌కు బదిలీ చేశారు. డిప్యూటీ డెరెక్టర్ జనరల్ స్థాయి అధికారి సారథ్యంలో విజిలెన్స్ ఎంక్వయిరీ కూడా ప్రారంభించారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో సింగ్, ప్రసాద్, అప్పటి జోనల్ డెరెక్టర్ సమీర్ వాంఖడేతో సహా పలువురు అధికారుల వాంగ్మూలాన్ని విజిలెన్స్ ఎంక్వయిరీ టీమ్ రికార్డు చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో ముంబైలోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్నినల్‌పై ఎన్‌సీబీ దాడులు జరిపి ఆర్యన్ ఖాన్ సహా పలువురుని అరెస్టు చేసిది. 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల మెఫెడ్రోన్, 21 గ్రాముల చరస్, 22 ఎండీఎంఏ పిల్స్‌ను డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో 20 మందిని అరెస్టు చేయగా, ఆర్యన్‌ సహా18 మంది ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఎన్‌డీపీసీ చట్టంలోని సెక్షన్ 8సి, 20బి, 27,35 కింద ఆర్యన్‌పై కేసు నమోదైంది.

Updated Date - 2022-04-14T02:05:27+05:30 IST