సర్కారు స్థలాలపై నజర్‌

ABN , First Publish Date - 2022-08-20T06:05:28+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ స్థలాలపై వ్యాపారులు, నేతలు నజరు పెట్టారు. వ్యాపారం పేరుతో లీజుకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, సినిమాహాల్స్‌, పెట్రోల్‌బంకులు, ఇతర వాణిజ్య సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి తమకు అనుకూలంగా మలుచుకునే యత్నాలు చేస్తున్నారు.

సర్కారు స్థలాలపై నజర్‌

జిల్లాలోని ప్రభుత్వ భూములపై వ్యాపారులు, నేతల దృష్టి

వాణిజ్య సముదాయాల పేరిట లీజుకు తీసుకునే ప్రయత్నాలు

రాష్ట్ర స్థాయిలో ప్రజాప్రతినిధుల ద్వారా మంతనాలు

పావులుకదుపుతున్న నేతలు.. పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

నిజామాబాద్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ప్రభుత్వ స్థలాలపై వ్యాపారులు, నేతలు నజరు పెట్టారు. వ్యాపారం పేరుతో లీజుకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, సినిమాహాల్స్‌, పెట్రోల్‌బంకులు, ఇతర వాణిజ్య సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి తమకు అనుకూలంగా మలుచుకునే యత్నాలు చేస్తున్నారు. భూముల విలువ పెరగడం కొన్ని ప్రభుత్వ స్థలాలను రాష్ట్ర వ్యాప్తంగా లీజుకు తీసుకుంటుండడంతో అదే రీతిలో జిల్లాకు చెందిన వారితో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు. విలువైన భూములు కావడంతో వాణిజ్య సముదాయాలను నిర్మిస్తే లాభాలు వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రజా ప్రతినిధులను కలుస్తూ తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చే విధంగా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా విలువైన భూములు

జిల్లాలో ప్రభుత్వానికి చెందిన విలువైన భూములు ఉన్నాయి. నిజామాబాద్‌ నగరంతోపాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలో ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఇవే కాకుండా మండలాల పరిధిలో ఆర్టీసీ, ఇతర కార్పొరేషన్లకు చెందిన భూములు ఉన్నాయి. ఆర్టీసీకి సంబంధించిన బస్టాండులు ఖాళీగా ఉండడం కొన్ని మండలాల పరిధిలో ఉపయోగంలో లేకుండా ఉండడం ప్రధాన రహదారిలో ఉండడంతో వ్యాపారుల నజర్‌ వీటిపైన పడింది. నిజామాబాద్‌ నగరం పరిధిలో వివిధ శాఖలకు చెందిన భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ నగరం నడిబొడ్డున, ప్రధాన రహదారుల వెంట ఉన్నాయి. కొత్త కలెక్టరేట్‌ ప్రారంభం అనంతరం పాత కలెక్టరేట్‌తో పాటు కొన్ని శాఖల కార్యాలయాలు తరలి వెళ్లనున్నాయి. కొత్త కలెక్టర్‌లో శాఖలు ఏర్పాటు చేసిన తర్వాత పాత కార్యాలయాలు ఖాళీగా ఉండనున్నాయి. కొన్ని డివిజన్‌ స్థాయి కార్యాలయాలకు వీటిని కేటాయించినా మిగతా కార్యాలయాలు ఖాళీగా ఉండనున్నాయి. ఈ భూములన్నీ విలువైనవిగా ఉండడంతో పలువురు వ్యాపారులు నేతల సహాయంతో పావులు కదుపుతున్నారు. తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆయా శాఖలు, కార్పొరేషన్ల భూములను లీజుకు తీసుకుంటే 33 ఏళ్ల పాటు అనుమతులు ఇస్తున్నందున ఎక్కువ మంది వీటిని దృష్టి పెట్టారు. ఈ భూములు కోట్లలో ధరలు పలుకుతుండడం ప్రభుత్వం అమ్మె పరిస్థితులు లేకపోవడం ఇతర అవసరాలకు కేటాయించే అవకాశం ఉండడంతో వీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలు ఇతర షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం పేరున దరఖాస్తు చేస్తున్నారు. ఆర్మూర్‌లో ఆర్టీసీ భూముల్లో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ మాదిరిగానే నగరం పరిధిలో కూడా నిర్మించేందుకు కొంత మంది ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇతర జిల్లాలో ఆర్టీసీతో పాటు ప్రభుత్వ స్థలాలు ఈ విధంగా కేటాయించడంతో వాటిని ఉదాహారణగా చూపుతూ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. 

నగర పరిధిలో భూముల కబ్జా

నిజామాబాద్‌ నగరం పరిధిలో ఇప్పటికే ప్రభుత్వ భూములు కబ్జాకు గురై దేవాదాయ, రెవెన్యూ, అటవీ, వివిధ కార్పొరేషన్లకు చెందిన భూములు కబ్జా చేశారు. పాత డాక్యుమెంట్లను పుట్టించి రిజిష్ట్రేషన్లు చేస్తున్నారు. విలువైన భూముల్లో భవనాలను కూడా నిర్మించారు. చెరువు శికాలు, చెరువులను కూడా కబ్జా చేశారు. నగరం పరిధిలో ఈ మధ్యనే చేసిన సర్వేలో ఇరిగేషన్‌కు చెందిన చాల భూముల కబ్జాలకు గురికావడంతో పాటు ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. ఉన్నతాధికారులకు నివేదించారు. బోధన్‌ పరిధిలో ప్రభుత్వ భూములతో పాటు షుగర్‌ ప్యాక్టరీకి చెందిన భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్నింటిని అధికారులు నోటీసుల జారీ చేయగా మరి కొన్నింటిలో నిర్మాణాలు వెలిశాయి. ఈ భూముల్లో ఎక్కువ శాతం కబ్జాలకు గురవుతుండడంతో గడచిన రెండేళ్లలో ధరణిలో వీటిని ఆయా శాఖల పేరున ఎంట్రీ చేశారు. దేవాదాయ భూములను దేవుళ్ల పేరుమీదనే పట్టాలు చేసుకున్నారు. పాస్‌బుక్కులను కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు కొన్ని చోట్ల భూములను కాపాడే ప్రయత్నం చేసినా మరి కొన్నిచోట్ల ఒత్తిళ్లతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

ఈ భూములను పక్కాగాకావడం, ధరణిలో ఎంట్రీ కావడంతో వ్యాపారానికి అనుకూలంగా ఉన్న భూములను లీజు పేరుమీద తీసుకునేందుకు ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఆర్టీసీ భూముల్లో పెట్రోల్‌బంకులు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వగా.. అదే రీతిలో ఇతర శాఖల భూములను లీజుకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున ఈ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ భూములను ఎవరికి లీజుకు ఇవ్వకున్నా కొత్త కలెక్టరేట్‌ ప్రారంభం తర్వాత ఫైల్లు కదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలువైన భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తే జిల్లా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2022-08-20T06:05:28+05:30 IST