గల్లీ అయినా.. ఢిల్లీ అయినా.. ‘బుల్లెట్ నర్సన్న’...

ABN , First Publish Date - 2020-10-23T13:45:54+05:30 IST

1962లోనాడే నగరానికి వచ్చి న నాయిని.. ఈ 58 ఏళ్లూ క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారు. మూడు తరాల నేతలను ప్రభావితం చేసిన వ్యక్తిత్వం ఆయనది. ముఖ్యంగా కార్మిక సంఘం నాయకత్వం నుంచి ఆయన ఎదిగిన స్థాయికి మళ్లీ ఒకరిద్దరు మాత్రమే రాగలిగారు.

గల్లీ అయినా.. ఢిల్లీ అయినా.. ‘బుల్లెట్ నర్సన్న’...

హైదరాబాద్: 1962లోనాడే నగరానికి వచ్చి న నాయిని.. ఈ 58 ఏళ్లూ క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారు. మూడు తరాల నేతలను ప్రభావితం చేసిన వ్యక్తిత్వం ఆయనది. ముఖ్యంగా కార్మిక సంఘం నాయకత్వం నుంచి ఆయన ఎదిగిన స్థాయికి మళ్లీ ఒకరిద్దరు మాత్రమే రాగలిగారు. పార్టీలకు అతీతంగా లీడర్లపై ఆయన ప్రభావం ఉంది. విస్తృతమైన సంబంధాలున్నాయి. ఇప్పుడు ఆయన మృతితో రాజకీయ వర్గాలతో పాటు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు.


తాత కోసం ఏడ్చి.. ఏడ్చి..

నాయినికి కుమారుడు దేవేందర్‌ రెడ్డి పిల్లలు సాత్వి, సాత్విక్‌లంటే మహా ఇష్టం. రోజూ వారితోనే ఎక్కువ సమయం గడిపేవారు. నెల రోజులుగా తాత ఇంట్లో కనిపించకపోవడంతో ఆ పిల్లలు బెంగపెట్టుకున్నారు. బుధవారం నాయిని భౌతికకాయాన్ని ఇంటికి తీసుకురావడంతో ఆయనను చూసిన పసి హృదయాలు తల్లడిల్లాయి. తాతా..అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నాయిని కుమార్తె సమతారెడ్డి కుమారులు అంకుశ్‌రెడ్డి, ధను్‌షరెడ్డిలతో కూడా నాయిని సరదాగా గడిపేవారు. గురువారం ఆ పిల్లల వేదన కూడా వర్ణణాతీతం.


అల్లుడినే అయినప్పటికీ..

నేను నాయినికి అల్లుడినే అయినప్పటికీ కొడుకులాగానే చూశారు. రాజకీయ వారసుడిగా ప్రకటించారు. రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలిపించి రాజకీయ భవిష్యత్‌ ప్రసాదించారు. కార్మిక రంగం బాధ్యతలను కూడా అప్పగించి కార్మిక రంగానికి కూడా పరిచయం చేశారు. ప్రసిద్ధి చెందిన వీఎ్‌సటీ కంపెనీ యూనియన్‌ అధ్యక్షుడిగా పోటీ చేయించి కార్మిక వారసత్వ నాయకత్వాన్ని అందించారు. 

- వి శ్రీనివాస్‌ రెడ్డి


చిన్నపిల్లాడిలా ఏడ్చిన నాయిని కుమారుడు

కుమారుడు దేవేందర్‌రెడ్డి తండ్రి మృతిని తట్టుకోలేక పోయారు. అక్కడికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నేతల వద్దకు వెళ్లి ‘‘మా నాన్న ఇకలేరు’’ అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చారు. నాకు కావాల్సినవన్నీ నాన్నే అడిగి తెలుసుకుని సమకూర్చేవారంటూ కన్నీటి పర్యంతం కావడం అందరినీ 

కలిచివేసింది.


నివాళులు అర్పించిన ప్రముఖులు

నాయిని భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వారిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసన మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, విప్‌ వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె కేశవరావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, జైపాల్‌యాదవ్‌, సుదర్శన్‌రెడ్డి, బాల్కసుమన్‌, వివేకానంద, ముఠాగోపాల్‌, కాలేరు వెంకటేష్‌, ప్రజా గాయకుడు గద్దర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి, మాజీ మంత్రిపట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీలు, స్వామిగౌడ్‌ రాములు నాయక్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్‌ బొంతురామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌, సీఎస్‌ సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీపీఐ, సీఐటీయూ, పలు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఉన్నారు. మం త్రుల నివాసాల నుంచి బంజారాహిల్స్‌రోడ్డు నెంబర్‌ 12, ఫిలింనగర్‌ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది. దారి పొడవునా నర్సింహారెడ్డి అమర్‌ హై అన్న నినాదాలు మిన్నంటాయి.


నర్సన్న యాదిలో...

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి కార్మిక, రాజకీయ లోకాన్ని కలిచివేస్తోంది. ఆయనకు నివాళులు అర్పించిన ప్రముఖులు నాయినితో ఉన్న అనుబంధాన్ని ఇలా గుర్తు చేసుకున్నారు.


మంత్రిగా, కార్మిక నాయకుడిగా.. 

నగరంలో ఎక్కడ సమస్య తలెత్తినా ఆయన ముందుకు వచ్చి దాన్ని పరిష్కరించేందుకు కృషి చేసేవారు. మంత్రిగా, ఉద్యమకారుడిగా, కార్మిక నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి


మలి విడత ఉద్యమంలో...

కార్మికుల పక్షపాతి, పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం పరితపించే నాయకుడిగా నాయిని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మలి విడత ఉద్యమంలో భాగంగా 2001 నుంచి ఆయన కేసీఆర్‌ వెంబడి ఉన్నారు.

- మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌


చివరి సారి మాట్లాడలేక పోయా 

నర్సింహారెడ్డితో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి పది రోజులుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా. సాధ్యం కాలేదు. మా  ఇద్దరిదీ ఒకే జిల్లా. ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేశాం. నాయిని ఇక లేరనేది జీర్ణించుకోలేకపోతున్నా. 

- కాంగ్రెస్‌ సీనియర్‌నేత జానారెడ్డి


నర్సన్నను కోల్పోవడం బాధాకరం

కార్మిక నేత నర్సన్నను కోల్పోవడం బాధాకరం. కార్మిక లోకానికి ఆయన చేసిన సేవలు మరచిపోలేం. ప్రభుత్వాలతో కొట్లాడి కార్మికుల హక్కులను కాపాడే తత్వం నాయిని సొంతం.

- మంత్రిమల్లారెడ్డి


ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాలు

ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాలు అంటేనే నాయిని నర్సింహారెడ్డి. ఆయనతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాం. ఆయనను చూసి అనేక విషయాలు నేర్చుకున్నాం. 

- ప్రజా గాయకుడు గద్దర్‌


గుండె ధైర్యం ఉన్న వ్యక్తి

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఉన్నంత గుండె ధైర్యం నాయినికి ఉంది. కార్మిక నాయకుడిగా, పోరాట యోధుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ తరఫున నాయినికి ఘన నివాళి సమర్పిస్తున్నా. 

-  టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ


20 ఏళ్లుగా కొడుకులాగా చూసుకున్నారు 

నాయిని నర్సింహారెడ్డి సార్‌ వద్ద  2001 నుంచి డ్రైవర్‌గా పని చేస్తున్నాను. నన్ను సొంత కొడుకులాగా చూసుకునే వారు.

- నాయిని డ్రైవర్‌ జగదీష్‌

Updated Date - 2020-10-23T13:45:54+05:30 IST