నయవంచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2022-07-01T06:35:49+05:30 IST

ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు గుప్పించి అధికారం చేజిక్కాక నెరవేర్చకపోగా, ఉన్న పథకాలకు మంగళం పలికిన వైసీపీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు పిలుపునిచ్చారు.

నయవంచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
గిరిజనులతో కలిసి అభివాదం చేస్తున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ వై.పాలెం ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు

పెద్ద దోర్నాల, జూన్‌ 30: ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు గుప్పించి అధికారం చేజిక్కాక నెరవేర్చకపోగా, ఉన్న పథకాలకు మంగళం పలికిన వైసీపీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు పిలుపునిచ్చారు. మండలంలోని చింతల, మర్రిపాలెం గిరిజన గ్రామాల్లో ‘బాదుడే-బాదుడు’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చెంచు గిరిజనులతో మమేకమై గత ప్రభుత్వంలో అమలైన పథకాలు, అభివృద్ధి ప్రస్థుత ప్రభుత్వంలో జరుగుతున్న విధ్వంసాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో గిరిజనుల యువతులకు వివాహానికి గిరిపుత్రిక పథకం ద్వారా రూ.50,000లు ఆర్థిక తోడ్పాటు అందించే వారన్నారు. గిరిజనలుకు 40 ఏళ్లకే వృద్ధాప్య పింఛను మంజూరు చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. గూడేల్లో సైతం 90 శాతం సిమెంటురోడ్లు నిర్మించారని గుర్తు చేశారు. ఐటీడీఏ ద్వారా పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం, ఎన్‌టీఆర్‌ జలసిరి ద్వారా ఉచితంగా బోరుబావుల తవ్వకం. విద్యుత్‌ సౌకర్యం, భూముల అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుత వైసీపీ పాలనలో నాటుసారా పేరుతో గిరిజనులపై ఆక్రమ కేసులు పెడుతున్నారు. మరో వైపు ప్రభుత్వమే నాశిరకం మద్యం అమ్ముతోందని విమర్శించారు. ఒక వైపు ప్రజల ఉపాధిని దెబ్బతీస్తూ మరో వైపు పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, ఆర్‌టీసీ బస్సుల చార్జీలు, నిత్యావసర సరుకులు ధరలు రోజురోజుకూ పెంచుతున్నారన్నారు. దీంతో పేదవాడు నిత్యవసరాలు సైతం కొనలేని ధుస్థితి నెలకొందని ఆరోపించారు. ఉన్న వాస్తవాలు గమనించి ప్రజల కోసం పాటుపడే టీడీపీకి మద్దతుగా నిలవాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని చెంచు గిరిజనులను అభ్యర్దించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అంబటి వీరారెడ్డి, బట్టు సుధాకర్‌ రెడ్డి, షేక్‌ మహబూబ్‌ భాష, షేక్‌ సమ్మద్‌భాష, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, దేసు నాగేంద్ర బాబు, రావికింది సుబ్బరత్నం, టీ చెన్నారెడ్డి, జడి లక్ష్మయ్య, ఎలకపాటి చెంచయ్య, షేక్‌ మౌలాలి, పఠాన్‌ ఖాన్‌, సీమారెడ్డి, శ్రీనునాయక్‌, ఏసులు, కుడుముల వెంకటయ్య, భూమని వెంకటేశం, చల్లా పోలమ్మ, వెంకటమ్మ, కుడుముల వెంకటేశం పాల్గొన్నారు.

కొనకనమిట్ల : వైసీపి ప్రభుత్వం ప్రజలపై అడ్డమైన పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తోందని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వింజవర్తిపాడు గ్రామంలో గురువారం టీడీపీ ఆధ్వర్యంలో ‘బాదుడే-బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ.., నిత్యవసరాలు ఎన్నడూ లేనంతగా పెంచిన ఘనత జగన్‌దేనన్నారు. అంతే కాకుండా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, ఆర్టీసీ చార్జీలు, ఇష్టారాజ్యంగా పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారని గుర్తు చేశారు. అంతే కాకుండా మద్యం రేట్లు, ఓటీఎస్‌, భూమి రిజిస్రేషన్‌లు పెంచి, చెత్తపన్నులు విధిస్తూ ప్రజలపై బాదుడే కార్యక్రమాన్ని అమలుచేస్తూ, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని దుయ్య బట్టారు. వైసీపీ అధికారాన్ని, పోలీసులను అడ్డంపెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై ఎన్నో దుర్మార్గపు కేసులు పెట్టేందుకు పూనుకున్నారన్నారు. తరువాత టీడీపీ అధికారంలోకి వస్తే అంతకు రెట్టింపు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. పాదయాత్ర లో నవరత్నాల పేరుతో జగన్‌ ఓటర్లను మభ్యపెట్టి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చాడన్నారు. ఇప్పుడు ఆ పథకాలకు కోత విధిస్తున్నాడన్నారు. అమ్మఒడి ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌లో కోత, డ్రైవర్లకు, దర్జీలకు, ఇంకా ఎన్నో పథకాలను అర్హులకు కాకుండా వైసీపీ నాయకుల ఇష్టారీతిన కేటాయిస్తున్నారని విమర్శించారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని ఏ కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోరబోయిన బాబురావు, పొదిలి ఏఎంసీ మాజీ చైర్మన్‌ చప్పిడి రామలింగయ్య టీడీపీ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-07-01T06:35:49+05:30 IST