నయా హిట్లర్‌ నరేంద్రమోదీ

ABN , First Publish Date - 2021-09-19T05:40:04+05:30 IST

ప్రజాద్రోహి, నయా హిట్లర్‌ ప్రధాని నరేంద్రమోదీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు.

నయా హిట్లర్‌ నరేంద్రమోదీ
నెల్లూరు నగరంలో సీపీఐ నేతల ర్యాలీ

జగన్‌ది నీచపాలన

వ్యక్తిగత కేసుల కోసం కేంద్రంతో రాజీ

ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు

జన ఆందోళన యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ


నెల్లూరు ( వైద్యం), సెప్టెంబరు 18 : ప్రజాద్రోహి, నయా హిట్లర్‌ ప్రధాని నరేంద్రమోదీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. శనివారం సీపీఐ ఆధ్వర్యంలో నెల్లూరులో జన ఆందోళన యాత్ర జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి కనకమహల్‌ సెంటర్‌ వరకు ర్యాలీ జరిగింది.  ముఖ్య అతిథిగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రం నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని తీవ్ర నష్టాలకు గురిచేస్తోందన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను అర్బన్‌ నక్సల్స్‌, ఖలిస్తాన్‌ తీవ్ర వాదుల పేరుతో అవమానించటం దుర్మార్గమన్నారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో అదేస్థాయిలో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు. ప్రధాని మోదీ లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ లకు అప్పగించటమే పనిగా పెట్టుకున్నారన్నారు. వ్యక్తి గత కేసుల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రంతో రాజీ పడ్డారన్నారు. జగన్‌ నీచపాలన అందిస్తూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ.3,699 కోట్ల భారం ప్రజలపై వేస్తున్నారని ఆరోపించారు. మోదీ విద్యుత్‌ చట్ట సవరణల నేపథ్యంలో జగన్‌ ప్రజలపై చార్జీల భారం మోపటం దారుణ మన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్‌ చార్జీల భారం మోపనని చెప్పి  నేడు మాటతప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు.  ట్రూఆప్‌ చార్జీల భారం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలు సెంటర్లలో ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర సభ్యులు హరనాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సహాయకార్యదర్శి దామా అంకయ్య, పముజుల ధశరఽఽథరామయ్య, రామరాజు, అరిగెల నాగేంద్రసాయి, ఆంజనేయులు, సీపీఎం నగర కార్యదర్శి మూలం రమేష్‌, నాగేశ్వరరావ్‌  పాల్గొన్నారు.


122 కరోనా కేసులు

నెల్లూరు(వైద్యం) సెప్టెంబరు 18 : జిల్లాలో శనివారం  122 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,43,431లకు చేరుకున్నాయి. కరోనా కారణంగా ఎవరూ మృత్యువాత పడలేదు. అలాగే కరోనా నుంచి కోలుకున్న 240 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. మరోవైపు 34,155 మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు.  

Updated Date - 2021-09-19T05:40:04+05:30 IST