నయాగ్యాంగు ఆటకట్టు

ABN , First Publish Date - 2022-08-01T05:56:21+05:30 IST

నయాగ్యాంగు ఆటకట్టు

నయాగ్యాంగు ఆటకట్టు

 ఆరుగురి అరెస్టు.. పరారీలో మరో నలుగురు

 అర్ధరాత్రి అరెస్టు చూపిన కేయూ పోలీసులు

 ఆర్‌ఐ, నయీం గ్యాంగు సభ్యుడు,  మాజీ ఎంపీపీ కోసం వేట

హనుమకొండ క్రైం, జూలై 31: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిఽధిలో వివిధ ప్రాంతాల్లో భూ యజమానుల ను, బాధితులను భయబ్రాంతులకు గురిచేస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను కేయూ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి రెండు తల్వార్లు, ఒక డమ్మీ పిస్టల్‌, ఒక విలువైన కారును స్వాధీ నం చేసుకున్నారు. కేయూ ఎస్‌ఐ బండారి సంపత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కేతపాక రమేష్‌, భీమారం గణే్‌షనగర్‌కు చెందిన బొజ్జ హరిబాబు, శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన అలువాల నరేష్‌, సిద్ధాపురం గ్రామానికి చెందిన మేకల రమేష్‌, హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన పంగ రవి, భీమారానికి చెం దిన టిప్పుల్‌ ప్రవీణ్‌ ఆలియాస్‌ చక్రీలను భూకబ్జాదారులుగా అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరు మరణాయుధాలు ధరించి నగరంలోని పలువురిని భయబ్రాంతులకు గురి చేసి భూములు ఆక్రమించినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరిపై ఐపీసీ 386, 506 రెడ్‌విత్‌ 34 ఐపీసీతో పా టు 25(1)(ఎ) ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. వీరు శనివారం రాత్రి పలివేల్పుల క్రా స్‌ నర్సరీ నుంచి ఫార్చునర్‌ కారులో మరణాయుధాలు ధ రించి వెళుతుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు తారసపడ్డట్టు తెలిపారు. కారులో సోదా చేయగా త ల్వార్లు, డమ్మీ పిస్టల్‌ కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించారు. చేసిన తప్పులను ఒప్పుకుని మిగతా నిందితుల వివరాలను వెల్లడించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

పరారీలో మరో నలుగురు

ఆరుగురు భూకబ్జాదారులను విచారించగా ప్రధాన నిందితుల పేర్లు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఏ1 ఓదెలకు చెందిన ముద్దసాని వేణుగోపాల్‌, ఏ2 మంచిర్యాలకు చెందిన సంపత్‌కుమార్‌ (రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌) ఏ3 మొగుళ్లపల్లి  మాజీ ఎంపీపీ మల్లన్న, ఏ10 వేణుగోపాల్‌, డ్రైవర్‌ క్రాంతికుమార్‌లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి కోసం వారికి సంబంధించిన వ్యక్తులు, ప్రాంతాలలో గాలిస్తున్నట్టు ఎస్‌ఐ వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే 100 డయల్‌ కాల్‌ చేయాలని ఎస్‌ఐ సంపత్‌ తెలిపారు.

పోలీసుల వేట

నయీం నయా గ్యాంగ్‌లో పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి ఆదేశాల మేరకు వారం రోజులుగా ప్రత్యేక బృందాలు, నిఘావర్గాలు.. వారు ఉంటున్న చోటును కనిపెట్టేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. ఈ గ్యాంగును నడిపిస్తున్న ప్రధాన నిందితుడు వేణుమాధవ్‌ మంచిర్యాలలోని ఓ ప్రజాప్రతినిఽధి సహకారంతో అక్కడే లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రజాప్రతినిధికి ఓ మంత్రి సహకరిస్తున్నట్టు వినికిడి. ఇంకా ఆర్‌ఐ సంపత్‌కుమార్‌ అయితే విషయం తెలుసుకుని కాశీకి వెళ్లి అక్కడే తలదాచుకున్నట్టు తెలిసింది. విషయం సద్దుమణిగిన తర్వాత హైదరాబాద్‌ డీజీ కార్యాలయంలో పోలీసు యూనిఫామ్‌తో సహా లొంగిపోనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా పోలీసులకు తెలిసింది. ఇంకా కేసులో ఉన్న మాజీ ఎంపీపీ మల్లన్న సైతం మొగుళ్లపెల్లి ప్రాంతానికి చెందిన అధికారపార్టీ నాయకుడి సహకారంతో లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లొంగిపోయినప్పటికీ వీరిని పోలీసుల కస్టడీకి తీసుకుని విచారిస్తారని తెలుస్తోంది. 

ఆంతర్యమేమి?

చిన్నపాటి నేరం చేసినా, గుట్కాలు, గుడుంబా అమ్ముకునే వారిని పట్టుకుని ఫొటోలు తీసి మరీ అరెస్టు చూపించే పోలీసులు.. నయా గ్యాంగు ఏర్పాటు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ముఠాసభ్యులను అర్ధరాత్రి అరెస్టు చూపించడం వెనుక ఆంతర్యమేమిటో విచారణ విభాగం పోలీసులకు సైతం అర్ధం కాకుండా పోయింది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడితోనే కేసు పూర్తి కాకుండానే పోలీసులకు అరెస్టులు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పరారీలో ఉన్న నలుగురు పట్టుబడితే గానీ భూకబ్జాల చిక్కుముడులు వీడే పరిస్థితి లేదు. కాగా, వేణుమాధవ్‌ ఇంట్లో పోలీసులు రూ.18లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాటిని అధికారికంగా ఇంకా వెల్లడించనే లేదు. ఇదిలా వుండగా, ఈ కేసులో పోలీసు కొలువులో ఉన్న వ్యక్తి గ్యాంగ్‌ లీడర్‌గా అవతారం ఎత్తి తన సర్వీస్‌ పిస్టల్‌ను సైతం అడ్డదారిలో వాడుకుని భూకబ్జాలకు పాల్పడి కోట్ల భూములు కొల్లగొట్టడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తమ శాఖ పరువు రోడ్డున పడ్డట్టయిందని ఆవేదన చెందుతున్నారు. 

Updated Date - 2022-08-01T05:56:21+05:30 IST