కార్పొరేషన్‌లో నయా దందా

ABN , First Publish Date - 2020-05-30T10:06:30+05:30 IST

కరోనా కాలంలో అనంతపురం కార్పొరేషన్‌లో నయా దందాకు తెరలేపారు.

కార్పొరేషన్‌లో నయా దందా

కాంట్రాక్టు గడువు ముగిసినా మార్కెట్‌ సుంకం వసూలు

ఖజానాకు జమ చేయని వైనం

కొందరు అధికారుల వత్తాసు

చేతులు మారిన కాసులు

పట్టించుకోని ఉన్నతాధికారులు


అనంతపురం, మే29 (ఆంధ్రజ్యోతి): కరోనా కాలంలో అనంతపురం కార్పొరేషన్‌లో నయా దందాకు తెరలేపారు. లాక్‌డౌన్‌ సమయాన్ని దందాకు అదునుగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు అధికారులు కాంట్రాక్ట్‌ గడువు ముగిసిన ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యారు. మార్కెట్‌ సుంకం వసూళ్లను ఇందుకు వేదికగా చేసుకున్నారు. ఇంకేముంది.. ఆ కాంట్రాక్టర్‌ వసూళ్ల వేటలో మునిగిపోయాడు. రెండు నెలలపాటు యథేచ్ఛగా.. మార్కెట్‌ సుంకం ఇబ్బడిముబ్బడిగా వసూలు చేశారు. ఆ సొమ్మును కార్పొరేషన్‌ ఖజానాకు జమ చేయలేదన్న విషయం వెలుగు చూసింది. దీంతో కుమ్మక్కు అధికారులపై పైస్థాయి అధికారి చిందులేశాడు.


మార్కెట్‌ సుంకం ఎందుకు ఖజానాకు జమ చేయలేదని నిలదీయటంతో ఆ అధికారులు నీళ్లు నమిలారు. ‘నీ మూలంగా పైస్థాయి అధికారుల నుంచి చీవాట్లు తినాల్సి వస్తోంద’ని ఆ కాంట్రాక్టర్‌పై రుసరుసలాడారు. అదిగో.. ఇదిగో కట్టేస్తానంటూ రోజులు గడిపాడు. చివరికి చిల్లర విసిరేసినట్లుగా కొంత మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. ఒప్పందం మేరకు లక్షలాది రూపాయలు కార్పొరేషన్‌ ఖజానాకు జమ చేయాల్సి ఉంది. కొంతే జమచేసి కాంట్రాక్టర్‌ మమ అనిపించినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా అందిన సమాచారం. వసూలు చేసిన సుంకం సొమ్ములో కొంత అధికారుల చేతులు మారినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా కార్పొరేషన్‌లో అధికారులు, కాంట్రాక్టర్ల దందా విషయం కమిషనర్‌ దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.


కార్పొరేషన్‌లో ఏటా మార్కెట్‌ సుంకం వసూలు నిమిత్తం టెండర్లు పిలవటం ఆనవాయితీ. మార్చి నుంచి మార్చి వరకూ కాంట్రాక్టు ఏడాదిపాటు నిర్ణయించారు. అందులో భాగంగా 2019-20కు సంబంధించి మార్కెట్‌ సుంకం వసూలుకు టెండర్‌ నిర్వహించగా రూ.84 లక్షలకు ధర్మవరానికి చెందిన కుమార్‌ అనే కాంట్రాక్టర్‌ దక్కించుకున్నాడు. ఈ ఏడాది మార్చి ఆఖరుతో కాంట్రాక్ట్‌ ముగిసింది. తిరిగి మార్కెట్‌ సుంకం వసూలు చేయాలంటే మళ్లీ టెండర్‌ నిర్వహించాలి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అధికారులు టెండర్‌ ప్రక్రియపై దృష్టి సారించలేకపోయారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు మార్కెట్‌ సుంకం వసూలు కోసం రెవెన్యూ విభాగంలోని ఆర్వోతో పాటు ఇద్దరు ఆర్‌ఐలు, సీనియర్‌ అసిస్టెంట్లకు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు మార్కెట్‌ సుంకం వసూలు చేశారు. దీనిని పసిగట్టిన ఆ కాంట్రాక్టర్‌ ఆ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రోజుకు రూ.3 వేలు చెల్లించేలా మాట్లాడుకున్నారు.


ఇదే అదునుగా వాహనాల దగ్గర నుంచి రూ.300, తోపుడు బండ్లు, కూరగాయల బండ్లు, చివరికి బేకరీల ముందు బ్రెడ్లు అమ్ముకునే వారి నుంచి రోజుకు రూ.10 చొప్పున వసూలు చేశారు. ఆ సొమ్ములో రోజూ రూ.3 వేలు ఖజానాకు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్‌ ఆ సొమ్మును ఖజానాకు జమ చేయకపోయినా అధికారులు పట్టించుకోలేదు. విషయం కార్పొరేషన్‌ కార్యదర్శి దృష్టికి వెళ్లటంతో సంబంధిత అధికారులు.. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కు విషయం వెలుగుచూసింది. రెండు నెలలపాటు అధికారుల ఒప్పందం మేరకు రోజుకు రూ.3 వేలు చొప్పున రూ.1.80 లక్షలు చెల్లించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా సుంకం వసూలు చేయలేదనే నెపంతో రూ.40 వేలు చెల్లించి చేతులెత్తేసేందుకు యత్నిస్తున్నాడు. ఉన్నతాధికారులు ముక్కుపిండి సొమ్ము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ తతంగంపై కార్పొరేషన్‌ కార్యదర్శి శ్రీనివాసులును వివరణ కోరగా కాంట్రాక్టర్‌ నుంచి మొత్తం సొమ్ము వసూలు చేస్తామన్నారు. అధికారులు, ఉద్యోగులు అవకతవకలకు పాల్పడి ఉంటే విచారిస్తామన్నారు.

Updated Date - 2020-05-30T10:06:30+05:30 IST