సీఎం అమరీందర్‌పై సిద్ధూ ‘పవర్’ అటాక్

ABN , First Publish Date - 2021-07-02T19:48:33+05:30 IST

ఇక పంజాబ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీపై సైతం విమర్శలు గుప్పించారు. పంజాబ్‌కు కాపీ మోడల్ అవసరం లేదని అన్న సిద్దూ.. పంజాబ్ ప్రభుత్వం సబ్సిడీ కింద 9,000

సీఎం అమరీందర్‌పై సిద్ధూ ‘పవర్’ అటాక్

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి విరుచుకుపడ్డారు. పంజాబ్‌లో పవర్ కట్‌పై సీఎంపై పదునైన విమర్శలు చేశారు. ఒకవైపు కెప్టెన్‌ను కార్నర్ చేస్తూనే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాల కంటె ఎక్కువ ధరకు విద్యుత్‌ను పంజాబ్ కొనుగోలు చేస్తోందని అన్న ఆయన ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా చర్యలు ఉన్నట్లు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అప్పటి బాదల్ ప్రభుత్వం మూడు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుందని, అయితే తప్పుడు నిబంధనల కారణంగా 5,400 కోట్ల రూపాయలను వృధాగా చెల్లించారని, ఇప్పుడు స్థిర ఛార్జీల పేరుతో 65,000 కోట్ల రూపాయలను పంజాబ్ ప్రజల డబ్బును చెల్లించాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.


‘‘విద్యుత్ ధరలు, విద్యుత్ కోతలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వాస్తవాలు తెలియాలి. పంజాబ్ ప్రజలకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వాలనే దానిపై సమాలోచనలు చేయాలి. దానికి కొన్ని మార్గాలను అవలంబించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పాలనా సమయాలు మార్చుకోవడంతోనో ప్రజల ఇళ్లల్లో ఏసీలు ఆపేయడంతోనో కాకుండా నిర్ధిష్టమైన కార్యచరణ ఉంటే సరిపోతుంది’’ అని ముఖ్యమంత్రి అమరీందర్‌పై విమర్శలు చేశారు.


ఇక పంజాబ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీపై సైతం విమర్శలు గుప్పించారు. పంజాబ్‌కు కాపీ మోడల్ అవసరం లేదని అన్న సిద్దూ.. పంజాబ్ ప్రభుత్వం సబ్సిడీ కింద 9,000 కోట్లు చెల్లిస్తోందని, కేవలం 1,699 కోట్లు చెల్లిస్తున్న ఢిల్లీ నేతలు పంజాబ్‌కు ఏ విధంగా సరిపడా విద్యుత్ అందిస్తారని ఎద్దేవా చేశారు. పంజాబ్‌కు పంజాబ్ మోడలే కావాలని మరే ఇతర కాపీ మోడల్ అసవరం లేదని సిద్ధూ తేల్చి చెప్పారు.

Updated Date - 2021-07-02T19:48:33+05:30 IST