దళితులకు రక్షణ లేని నవ్యాంధ్ర

ABN , First Publish Date - 2020-09-10T06:25:42+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, బలహీన వర్గాలపై దాడులు, హింసాకాండ యథేచ్ఛగా సాగుతున్నాయి. చట్టం అధికార పార్టీ...

దళితులకు రక్షణ లేని నవ్యాంధ్ర

దేశంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, ఆంధ్రాలో మాత్రం వైఎస్సార్‌ పార్టీ రాసుకున్న రాజ్యాంగం అమలవుతోంది. చట్టాలు బలహీన వర్గాలు, పేదలకే తప్ప ప్రభుత్వంలోని పెద్దలకు వర్తించవని వైసీపీ ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. దళితులపై దౌర్జన్యాలు జరుగుతున్నా వాటిని ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఖండించకపోవడం, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం చూస్తుంటే ఈ దాడులకు ప్రభుత్వ పెద్దల అండ ఉన్నదని అర్థమవుతున్నది. గతంలో పేదలు, దళితులపై దౌర్జన్యకాండలు, గూండాయిజం వంటి కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా బీహార్‌ను చెప్పుకునేవారు. జగన్‌ పాలనలో ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించడం సిగ్గుచేటైన విషయం.


ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, బలహీన వర్గాలపై దాడులు, హింసాకాండ యథేచ్ఛగా సాగుతున్నాయి. చట్టం అధికార పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మ కావడంతో వారి దౌర్జన్య కాండలకు అంతులేకుండా పోతోంది. దేశంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, ఆంధ్రాలో మాత్రం వైఎస్సార్‌ పార్టీ రాసుకున్న రాజ్యాంగం అమలవుతోంది. ఈ రాష్ట్రంలో చట్టాలు, శాసనాలకు జగన్‌ అధికారంలోకి రావడంతో కాలం చెల్లిపోయింది. ఆ పార్టీ నాయకులు చెప్పిందే శాసనం, చేసిందే చట్టం అనేది కొనసాగుతోంది. పోలీసులు కూడా అలాగే భావించి పని చేస్తున్నారు. దళితులపై దాడి జరిగినప్పుడు ఫిర్యాదు తీసుకోకపోగా ఆ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైనే దౌర్జన్యకాండ సాగిస్తున్నారు.


జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను మనుషులుగా చూడడం లేదు. వారిపై ఇష్టానుసారంగా దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ నివారించే ప్రయత్నం చేయకపోవడంతో దాడులు మరింత పెరిగిపోతున్నాయి. కరోనాకు వైద్యం చేస్తున్న సిబ్బందిని ఫ్రంట్‌ వారియర్స్‌గా మనం పిలుస్తున్నాం. రోగులకు వైద్యం చేయడానికి ముందుకు వస్తున్న డాక్టర్లు దేవుళ్లతో సమానం. విశాఖపట్నంలో కరోనా రోగులకు వైద్యం చేసే తమకు ప్రభుత్వం కనీసం సరైన మాస్కులు కూడా అందజేయడం లేదని చెప్పినందుకుగాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ సుధాకర్‌పై పిచ్చివాడిగా ముద్రవేసి ఉద్యోగం నుంచి తొలగించేశారు. అంతటితో వదలకుండా పోలీసులు నడిరోడ్డుపై బట్టలు విప్పి నిర్దాక్షిణ్యంగా కొట్టుకుంటూ చేతుల్ని కట్టేసి జైలుకు తరలించారు. సుధాకర్‌ను పిచ్చి ఆసుపత్రికి తరలించి, నిజంగానే పిచ్చెక్కించడం కోసం రకరకాల మందుల్ని ఆయనపై ప్రయోగించారు. ప్రభుత్వాన్ని విమర్శించారనే కక్షను మనసులో పెట్టుకుని ఒక డాక్టర్‌పై ఇంతటి అమానుషంగా దౌర్జన్యకాండ జరిపించడం చూసి ప్రజలంతా దిగ్భ్రాంతి చెందారు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని కేసును సీబీఐకి అప్పగించింది. మాస్కు పెట్టుకోలేదనే కారణంతో చీరాల థామస్‌పేటకు చెందిన దళిత యువకుడు కిరణ్‌ కుమార్‌పై పోలీసులు దాడి చేసి విపరీతంగా కొట్టడంతో అతడు మరణించాడు. కానీ ముఖ్యమంత్రి జగన్‌ ఏనాడూ మాస్కు పెట్టుకుని కనపడలేదు. అయినా ఇది ఎవరికీ అభ్యంతకరంగా తోచదు. చట్టాలు బలహీన వర్గాలు, పేదలకే తప్ప ప్రభుత్వంలోని పెద్దలకు వర్తించవని వైసీపీ ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. పెనమలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించే దళిత డాక్టర్‌ అనితారాణి ఆస్పత్రిలో అవినీతిని ప్రశ్నించినందుకు వైసీపీ నాయకులు ఆమెను గదిలో బంధించి హింసించారు. తాను బాత్‌రూమ్‌కు వెళ్లగా కిటికీల్లోంచి ఫొటోలు తీసి అవమానించారని ఆమె తెలిపారు. ఆమె చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని పోలీసులు, పైఅధికారుల చేత ప్రభుత్వం చెప్పించిందే కానీ ఇందుకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చిత్తూరుకు చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్‌ మద్యం ధరలు పెంచినందుకు ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ వీడియో పెట్టారు. దీనిపై అధికార పార్టీ నాయకులు ఆ యువకుడిని తీవ్రంగా భయపెట్టడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా, ఐనంపూడిలో దళిత మహిళ కుటుంబాన్ని సజీవ దహనం చేయడానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేయడం అత్యంత దారుణం. అమరావతిలో అంబేద్కర్‌ విగ్రహాలను తరలించుకుపోవడంతో దళితుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.


ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చెప్పుకుంటారు. కానీ ప్రస్తుతం ఆంధ్రాలో పోలీసులే అధికార పార్టీకి కొమ్ముకాసి దళితులపై దౌర్జన్యకాండకు దిగుతున్నారు. ‘ప్రజా హక్కుల పరిరక్షణ కోసమే పోలీసులు ఉండాలి. ప్రజలకు యూనిఫాం జవాబు దారీ కావాలి’ అని ఓ కేసులో రాష్ట్ర హైకోర్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని హెచ్చరించిన రోజే అదే జిల్లాలో ఒక పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు స్థానిక దళిత యువకుడికి శిరోముండనం చేశారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు దళిత యువకుడు వరప్రసాద్‌పై పోలీసుల చేసిన దాష్టీకమది. వైసీపీ నేత కవల కృష్ణమూర్తి ఆదేశంతో పోలీసులు అతణ్ణి ఇంటి నుంచి కొట్టుకుంటూ తీసుకెళ్లి ఈ దౌర్జన్యకాండకు దిగారు. ఈ అవమానాన్ని భరించలేక తనకు నక్సల్స్‌లో చేరడానికి అనుమతించాల్సిందిగా వరప్రసాద్‌ రాష్ట్రపతిని కోరారంటే అతడు పడిన బాధ ఎంతో అర్థం చేసుకోవచ్చు. జగన్‌ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేకనే ఆ యువకుడు ఇంతటి తీవ్రమైన అభ్యర్థన చేశాడు. పేదలు, బలహీనవర్గాలకు ప్రభుత్వమే అన్యాయం చేస్తే, వ్యవస్థలపై ప్రజలు నమ్మకం కోల్పోతే ఎంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారో ఈ సంఘటన తెలియజేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా టి. నర్సాపురం మండలం, అల్లంచెర్ల కొత్తగూడెంలో దళితుడైన తానంకి వెంకటేశ్వరరావు ఇంటిని వైసీపీ నేత, భూస్వామి 50మంది అనుచరులతో వచ్చి కూల్చేశారు. సామాగ్రిని ధ్వంసం చేశారు. ఆ ఇంటి స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లకపోతే అంతుచూస్తామని బెదిరించారు.


అగ్రకుల దురంహకారానికి గురైన దళిత జడ్జి రామకృష్ణ 2013లో తన ఉద్యోగం నుంచి సస్పెండ్‌ కావాల్సి వచ్చింది. తాజాగా ఈయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యానికి గురయ్యారు. మంత్రి అనుచరులు జడ్జిపై దాడి చేసి కొడితే ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయబోయినా పోలీసులు స్వీకరించలేదు. చివరకు అమాయకుడైన రామకృష్ణను పావుగా వాడుకుని ఉన్నతస్థానాల్లో ఉన్న కొంతమందిపై కక్షసాధించడం కోసం వైసీపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నం బట్టబయలైంది. కృష్ణాజిల్లాకు చెందిన మాలమహానాడు విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేస్తున్న బొల్లపల్లి శాంతికుమారికి ఎస్సీ కమిషన్‌లో పదవి ఇప్పిస్తామని నమ్మించి, ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ భర్త ఒకరు 7లక్షలు తీసుకుని ఇవ్వకుండా మోసం చేశారు. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డికి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని, కనుక తనకు చావే పరిష్కారమని చెప్పి విలేకరుల ఎదుటే విషం తాగి ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు.


శ్రీకాకుళంలో టెక్కలి పట్నం గ్రామానికి చెందిన దళితుడైన పూరిజగన్నాథరావు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇళ్ల వ్యవహారంలో తనకు అన్యాయం జరిగిందని వైసీపీ స్థానిక నేతలతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆ పార్టీ నాయకులు ఆ యువకుడిని గాయపరిచారు. ఈ విషయమై ప్రశ్నిస్తూ సీఐ వేణుగోపాల్‌రావు అతణ్ణి బూటు కాలితో తన్ని దౌర్జన్యం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్‌లో పోస్టులు పెట్టినందుకు మహాసేన అధ్యక్షులు సరిపెళ్ల రాజేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి మూడు కేసులు నమోదు చేశారు. ఈ విధంగా ఆంధ్రాలో అమానుష పాలన అప్రతిహతంగా సాగిపోతోంది. రాజ్యాంగ రచనలో దళితులకు ప్రత్యేక హక్కుల కల్పనతో వారికి నిజమైన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లభిస్తాయని డాక్టర్‌ అంబేడ్కర్ ఆశించారు. కానీ జగన్‌ పాలనలో దళితుల హక్కులు మంటకలిసిపోయాయి. దళితులపై దౌర్జన్యాలు జరుగుతున్నా వాటిని ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఖండించకపోవడం, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం చూస్తుంటే ఈ దాడులకు ప్రభుత్వ పెద్దల అండ ఉన్నదని అర్థమవుతున్నది. గతంలో పేదలు, దళితులపై దౌర్జన్యకాండలు, గూండాయిజం వంటి కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా బీహార్‌ను చెప్పుకునేవారు. జగన్‌ పాలనలో ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించడం సిగ్గుచేటైన విషయం.


దళితుల్లో ఐక్యత లేకపోవడం వల్లే అధికార పార్టీ దౌర్జన్య కాండలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. దళితులు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ ఒకతాటిపైకి వచ్చి హింసాకాండపై పోరాటం సాగించాలి. దళితుల ఆత్మగౌరవం కోసం ఎంతటి త్యాగాలకైనా మనందరం సిద్ధపడాలి. అంబేద్కర్‌ కలలు కన్న దళితుల స్వాతంత్య్రం, సాధికారతల కోసం దళితులందరూ వెనకడుగు లేకుండా పోరాటం సాగించాలి.

దేవతోటి నాగరాజు,

ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యులు



Updated Date - 2020-09-10T06:25:42+05:30 IST