ధర్మాచరణకు మూలం దయాగుణం

ABN , First Publish Date - 2020-03-28T09:30:15+05:30 IST

ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ ధర్మం తిరిగి నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించడమంటే ధర్మాన్ని ఆచరించడమే. శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకై పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి బయలుదేరే

ధర్మాచరణకు మూలం దయాగుణం

‘ధర్మో రక్షతి రక్షితః’

ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ ధర్మం తిరిగి నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించడమంటే ధర్మాన్ని ఆచరించడమే. శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకై పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి బయలుదేరే ముందు.. ‘‘రాఘవా! నీ రక్షణ కొరకు నేను చేయగల్గిన దేమీ లేదు. ధర్మం ఒక్కటే నిన్ను రక్షిస్తుంది. ఏ ధర్మాన్నైతే నీవు ధైర్యంగా, నియమంగా నిత్యమూ పాలిస్తూ వచ్చావో, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది’’ అని తల్లియైున కౌసల్యాదేవి ఆశీర్వదించింది.


‘ధరతి విశ్వం ఇతి ధర్మః’

..అని ధర్మానికి ఒక నిర్వచనం. అనగా విశ్వాన్ని ధరించునది లేక సంరక్షించునది ధర్మం అని అర్థం. విశ్వాన్ని ఆ పరమేశ్వరుడే ధరించి సంరక్షిస్తున్నాడు. అన్ని ప్రాణులకూ ఆహారాన్ని సమకూర్చుతున్నాడు. జీవుడు దేహాన్ని ధరించి ఉన్నట్లుగా దేవుడు విశ్వాన్ని ధరించి ఉన్నాడు. అందుకే ఆయనను జగదాధారుడు అన్నారు. జగత్తుకు ఆధారమైనవాడు. దైవానికి మరో పేరే ధర్మం. అదే సత్యం. సత్యము, జ్ఞానమే.. అనంతమైన బ్రహ్మ స్వరూపం. బ్రహ్మము వలననే సూర్యుడు వెలుగుతున్నాడు. చుక్కలు ప్రకాశిస్తున్నాయి. సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న భూమి, భూమి చుట్టూ తిరిగే చంద్రుడు ధర్మం తప్పకుండా చరిస్తున్నది బ్రహ్మము వల్లనే.


సృష్టిలోని అన్ని జీవజాతులకూ వాటి వాటి ధర్మాలున్నాయి. ప్రకృతికీ ధర్మాలున్నాయి. భారతీయులది సనాతన ధర్మం. దానికి మూలం వేదం. సనాతనమంటే ప్రాచీనం. సనాతనుడు అంటే భగవంతుడు. ఆ భగవంతుడు శాశ్వతం. సనాతన ధర్మం అనగా సర్వకాల సర్వావస్థలయందూ ఆచరించవలసినది. సనాతన ధర్మంలో సత్యం, అహింస, పరోపకారం, క్షమ, సచ్చీలం, శాంతి, దయ, త్యాగం,  వైరాగ్యం, దానం ముఖ్యమైనవి. ఈ ధర్మాలు నైతిక విలువలను పెంచి మానవాళి అభ్యున్నతికి, పురోగతికి తోడ్పడతాయి. ఆ ధర్మాలన్నీ మన స్వభావంగా మారినప్పుడే వాటిని సర్వకాల సర్వావస్థలయందూ ఆచరించగలుగుతాం. అందుకు ముఖ్యంగా కావలసింది దయాగుణం కలిగి ఉండడం. ధర్మానికి దయయే శరీరం సత్యమే ప్రాణం అని ‘దేవీభాగవతం’ చెబుతోంది.


ధర్మానికి సంబంధించి.. మహా భారతంలో యక్షప్రశ్నల ఘట్టంలో ప్రస్తావన కనిపిస్తుంది. యక్షుడు అడిగిన ఒక ప్రశ్నకు ధర్మ రాజు.. ‘ధర్మానికి ఆధారం దయ’ అని సమాధానం చెబుతాడు. అన్నింటికంటే గొప్ప ధర్మం ‘అహింస’ అని మరో ప్రశ్నకు సమాధానంగా చెబుతాడు. మనోవాక్కాయ కర్మల ద్వారా ఏ ప్రాణినీ కష్టపెట్టకుండా ఉండడమే అహింస. అన్ని ప్రాణుల యందూ సానుభూతిని కలిగి ఉండడమే విశ్వప్రేమకు దారితీస్తుంది. 


దయా ధర్మస్య జన్మభూమిః


దయయే ధర్మానికి జన్మభూమి. కాబట్టి దయాగుణం పెంచుకుని ధర్మాచరణకు పాటుపడదాం.


జక్కని వేంకటరాజం, 94400 21734

Updated Date - 2020-03-28T09:30:15+05:30 IST