శ్రీరాముని మాటతీరు

ABN , First Publish Date - 2020-08-30T08:26:50+05:30 IST

సాధారణంగా గొప్ప వంశంలో పుట్టినవారు, పేరు ప్రతిష్ఠలు బాగా ఉన్నవారు, గొప్పగొప్ప పదవులు కలవారు, నాయకులు,..

శ్రీరాముని మాటతీరు

సాధారణంగా గొప్ప వంశంలో పుట్టినవారు, పేరు ప్రతిష్ఠలు బాగా ఉన్నవారు, గొప్పగొప్ప పదవులు కలవారు, నాయకులు, ప్రముఖ క్రీడాకారులు, నటీనటులు, ప్రఖ్యాత వ్యాపారవేత్తలు, సౌందర్యవంతులు, ఉన్నత విద్యావంతులు, ఐశ్వర్యవంతులు, సామాన్యజనులతో ప్రేమాదరములతో, స్నేహపూర్వకంగా మాట్లాడడం చాలా అరుదు. సమయం లేదనో, ఎదుటివారు తమ స్థాయికి తగినవారు కాదనో, చనువు ఇస్తే వెంటబడుతారనో, సాయం కోరుతారనో.. తమకు కష్టాలను కలిగిస్తుంటారనో భావిస్తూ.. సామాన్య ప్రజలతో సన్నిహితంగా ఉండరు. కానీ, శ్రీరామచంద్రుడు ‘‘స్మితపూర్వాభిభాషీ, పూర్వభాషీచరాఘవః’’ అన్నట్లు ఎవరినైనా చిరునవ్వుతో పలుకరించే వాడట.  మామూలుగా మంచిగా మాట్లాడేవారు, కోపం వచ్చినప్పుడు ఆవేశంలో అరవడం, తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, నిందించడమో చేస్తారు. శ్రీరామచంద్రుడు మాత్రం కోపాన్ని కూడా శాంతంగానే వ్యక్తపరచేవాడు. కబంధుని సూచనతో ఆంజనేయస్వామి సహకారంతో శ్రీరాముడు సుగ్రీవునితో మైత్రిని ఏర్పరుచుకున్నాడు. వాలిని వధించి.. సుగ్రీవునికి రాజ్యపట్టాభిషేకాన్ని జరిపించాడు. ఆ సందర్భంలో సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో నాలుగు నెలల వర్షాకాలం తర్వాత నేను తప్పక సీతాన్వేషణకై సమర్థులైన వానరోత్తములను పంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు.


వర్షాకాలంలో సీతావియోగ దుఃఖాన్ని అతికష్టం మీద సహించిన శ్రీరాముడు లక్ష్మణునితో ‘‘సుగ్రీవుడు భోగానుభవంలో మునిగి నాకు ఇచ్చిన మాటను విస్మరించినట్లున్నాడు. నీవు కిష్కింధకు వెళ్లి నా మాటలను సుగ్రీవునికి తెలియజేయుము’’ అని కోరాడు. ‘‘శోకముతో క్రుంగిపోతున్న మనపై సుగ్రీవునికి ఎందుకో దయకలుగడం లేదు. సుగ్రీవునితో మైత్రిని మనం ఏర్పరచుకున్నది, వాలిని వధించినది సీతాన్వేషణ కార్యములో వానరసైన్యము మనకు తోడ్పాటును అందిస్తుంది అనే కదా. మిత్రధర్మమును పాటించమని సుగ్రీవునికి తెలపుము’’  అని అన్నాడు.


‘‘నచ సంకుచితః పంథాః యేన వాలీహతో గతః శ్రీ

సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథమన్వగాః శ్రీశ్రీ’’

‘‘సుగ్రీవుడు నా సాధువాక్కులను సౌమ్యమైన రూపాన్ని మాత్రమే చూశాడు. నా కోపాన్ని ఎరుగడు అందుకే నేను చేసే ఈ ముఖ్యమైన హెచ్చరికను తెలియజేయుము. చనిపోయిన తర్వాత వాలి వెళ్లిన పైలోక మార్గమునకు మూతపడలేదని చెప్పు. ప్రతిజ్ఞను పాటించమని వానర సైన్యాన్ని ఒక దగ్గరకు చేర్చి వారిని సమాయత్తం చేసి సీతాన్వేషణ కార్యనిర్వహణకు సిద్ధపడమని చెప్పు’’ అని జాగ్రత్తలు చెప్పాడు.


‘‘స్వధర్మాన్ని మరిచిన వాలి నా బాణపు దెబ్బకు గురి అయి ప్రాణాలను కోల్పోయాడు. నీవు సత్యమును వీడి, ఇచ్చిన మాటను తప్పినచో నా బాణం నిన్ను వదిలిపెట్టదు. అందువల్ల ఓ సుగ్రీవా.. వాలి పద్ధతిని అనుకరించవద్దు. అతడు వెళ్లిన పరలోక మార్గాన్ని అనుసరించవద్దు’’ అని చెప్పమన్నాడు.


కోపం వచ్చిన సందర్భంలో కూడా శ్రీరాముడు మృదువచనాన్నే పలికాడు. పరుషమైన మాటలను వాడలేదు. మనం కూడా శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా గ్రహించి కోపావేశాలకు లోనయిన సందర్భంలో కూడా వివేకాన్ని కోల్పోకుండా.. అసభ్యంగా, అమంగళకరంగా మాట్లాడకుండా ఉండేందుకు జాగ్రత్త వహిద్దాం.

- సముద్రాల శఠగోపాచార్యులు

9059997267

Updated Date - 2020-08-30T08:26:50+05:30 IST