Abn logo
Aug 8 2020 @ 23:40PM

రామజపం మొదలయ్యింది!

అయోధ్యలో ప్రధాని నరేంద్రమోదీ రామాలయానికి భూమి పూజ చేయగానే బాలీవుడ్‌లో ‘రామ’జపం మొదలయ్యింది. సంచలన వార్తాకథనాలను సినిమాలుగా తీసి కోట్లు కొల్లగొట్టేందుకు సదా సిద్ధంగా ఉండే బాలీవుడ్‌లో ప్రస్తుతం అరడజను స్ర్కిప్టులు రాముడి చుట్టే తిరుగుతున్నాయి. కంగనా రనౌత్‌, హృతిక్‌ రోషన్‌ వంటి టాప్‌స్టార్లు... పహ్లాజ్‌ నిహలానీ, నితీశ్‌ తివారీ వంటి ప్రముఖ నిర్మాత, దర్శకులు ‘అయోధ్య రాముడి’కి సినీ హారతులు పట్టేందుకు రెడీ అవుతున్నారు.


దూరదర్శన్‌లో 30 ఏళ్ల క్రితం ప్రసారమైన ‘రామాయణ్‌’ సీరియల్‌ను లాక్‌డౌన్‌ సమయంలో తిరిగి ప్రసారం చేస్తే ఆశ్చర్యంగా కోట్లాది మంది వీక్షించారు. అంటే ఈ తరాన్ని కూడా రాముడు మెస్మరైజ్‌ చేశాడనే కదా అర్థం. దీనికి తోడు ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో రామాలయానికి భూమిపూజ చేయడంతో ప్రస్తుతం దేశం యావత్తు రామనామస్మరణతో ఊగిపోతోంది. దీనికి మించిన సందర్భం బాలీవుడ్‌కు ఇంకేం ఉంటుంది. వెంటవెంటనే అయోధ్య రాముడిపై పలు ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ నిర్మాత, సెన్సార్‌బోర్డ్‌ మాజీ ఛైర్మన్‌ పహ్లాజ్‌ నిహలానీ ‘అయోధ్య కీ కహానీ’ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ‘‘రాముడి కథకు యంగ్‌ జనరేషన్‌ కూడా కనెక్ట్‌ అయ్యిందని లాక్‌డౌన్‌లో ప్రసారమైన ‘రామాయణ్‌’ సీరియల్‌ రుజువు చేసింది. నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభించి, వచ్చే ఏడాది దీపావళికి సినిమా విడుదల చేస్తా. దీపావళి ఎందుకు జరుపుకొంటారో ఈ జనరేషన్‌కు తెలియదు కదా’’ అన్నారు నిహలానీ. ఈ సినిమాలో ఎవరు నటిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంచారాయన.

‘మణికర్ణిక’తో రూటు మార్చిన కంగనా రనౌత్‌ దృష్టి కూడా రాముడిపై పడింది. ‘అపరాజిత అయోధ్య’ పేరిట ఆమె ఇప్పడికే స్ర్కిప్టు పనులను కూడా మొదలెట్టింది. బాలీవుడ్‌కు ‘బజ్‌రంగీ భాయ్‌జాన్‌’, ‘బాహుబలి’, ‘మణికర్ణిక’ వంటి బ్లాక్‌బస్టర్‌ స్ర్కిప్టులను అందించిన విజయేంద్ర ప్రసాద్‌ (ఎస్‌.ఎస్‌.రాజమౌళి తండ్రి)కి ఆ బాధ్యతలను అప్పగించింది కంగనా. ‘‘రామమందిరం అనేది గత కొన్నేళ్లుగా చర్చనీయాంశంగా మారింది. 80ల నుంచి అంటే నా చిన్నతనం నుంచి అయోధ్య గురించి వింటూనే ఉన్నా. అపనమ్మకం నుంచి నమ్మకం వైపు సాగే కథానాయకుడి ప్రయాణమే నేను తీయబోయే సినిమా కథాంశం. ఈ సినిమాను నేనే డైరెక్ట్‌ చేస్తానా లేదా అనేది చూడాలి’’ అంటోంది కంగనా. అయితే బాబర్‌ అక్కడున్న దేవాలయాన్ని ఎందుకు కూల్చాడు? వంటి అంశాలను స్పృశిస్తూ ఆమె 600 ఏళ్ల చరిత్రను తెరమీద చూపాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.


ఆమిర్‌ఖాన్‌తో ‘దంగల్‌’ను తీసిన ప్రముఖ దర్శకుడు నితిశ్‌ తివారీ కూడా గత ఏడాది కాలంగా ‘రామాయణ’ స్ర్కిప్టుపై కసరత్తులు చేస్తున్నారు. అల్లు అరవింద్‌, మధు మంతెనలతో కలిసి ఆయన ఈ భారీ ప్రాజెక్ట్‌ను చేస్తున్నట్లు బాలీవుడ్‌ టాక్‌. ఇందులో హృతిక్‌రోషన్‌ ప్రధాన భూమికను పోషిస్తాడని తెలుస్తోంది. అయితే స్ర్కిప్టు పూర్తయిన తర్వాతే నటీనటులు ఎవరనేది తెలుస్తుందని దర్శకుడు చెబుతున్నారు. వీటితో పాటు మరో మూడు ప్రాజెక్టులు కూడా ‘రామ’జపం చేస్తున్నాయి. మొత్తానికి అయోధ్యలో రామమందిరం పూర్తయ్యేలోపు వెండితెరపై ఎంతమంది రాముళ్లు రూపుదిద్దుకుంటారో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement